టూకీగా ప్రపంచ చరిత్ర 74
ఏలుబడి కూకట్లు
మెసొపొటేమియా ఈజిప్టుల్లో చెప్పుకోదగ్గ నగరం ఏర్పడిన ప్రతిచోట ఒక దేవాలయం ఉండే తీరుతుంది. సాధారణంగా అది ఊరికి మధ్యలో ఉంటుంది. దాని గోపురం కంటే ఎత్తై కట్టడం ఆ నగరంలో మరొకటి ఉండదు. చివరకు రాజభవనమైనా సరే, దానికి మించగూడదు.
అడపాదడపా సంచారజాతుల దాడులను ఎదుర్కోవడం మినహా, స్థిరనివాసుల జీవితంలో నిలకడ ఏర్పడింది. సంపద పెరగడంతో పాటు విశ్రాంతి పెరిగింది. ఆందోళనలేని విశ్రాంతి మనిషిని వినోదాలవైపు, ఉత్సవాలవైపు నడిపిస్తుంది. ఆ కాలంలో వినోదానికైనా, ఉత్సవానికైనా కేంద్రం దేవాలయమే. గాయకులతో కథాగానాలు జరిపించడమేగాక, తన అనుభవంతో ఇతరులకు సలహాలివ్వడం, మూలికలతో జబ్బులకు చికిత్స చెయ్యడం, నక్షత్రాల గమనాన్ని గుర్తించి రుతువుల రాకపోకలు ఎరిగించడం వంటి సామాజిక కార్యక్రమాలకు దేవాలయం కూడలి కావడంతో, అర్చకుల ప్రాముఖ్యత అత్యున్నత స్థాయికి ఎదిగింది.
అరుదుగా వచ్చే పండుగ రోజుల్లోనే కాకుండా, ఏ పని తలపెట్టినా మొదట దేవుణ్ణి బుజ్జగించి ముందుకు సాగటం మంచిదనే నమ్మకాలు పెరిగేకొద్దీ దేవాలయ కార్యక్రమాల్లో రద్దీ పెరిగింది. బ్రతుకుతెరువు విధానాల్లో వైవిధ్యాలు పెరిగేకొద్దీ బుజ్జగించుకోవలసిన దేవుళ్లసంఖ్య అదే నిష్పత్తిలో పెరుగుతూ పోయింది. ప్రతి వృత్తికి ఒక సొంతదేవుడు; ఆ దేవుని ఒక నివాసం, ఒక భార్య, ప్రత్యేక వ్యవస్థగా తయారైంది. అందులో పలురకాల పనులకు వినియోగింపబడే సేవకుల బృందం ఏర్పడింది. ఆ సేవకులు ధరించే దుస్తులు కూడా ఇతరులు ధరించే వాటికి భిన్నంగా మారిపోయాయి. నెత్తురు బంధాలు తెంచుకుని, అర్చకులు కుటుంబరహిత వ్యక్తులుగా మారిపోయారు. దాంతో ఆలయాలది ఒక ప్రత్యేక కుటుంబంగా రూపొందింది.
నాగరికత పెరిగేకొద్దీ అదే నిష్పత్తిలో నైతిక విలువలు దిగజారడం సహజం. క్రమబద్ధం చేసేందుకు పాతకాలం ఆనవాయితీలు చాలవు. కొత్త అవసరాలు తీర్చేందుకు సరికొత్త నిబంధనలు అవసరమయ్యాయి. వ్యాపారం విస్తరించడంతో కొలతలూ, తూనికలకు ఒక ప్రామాణికత తీసుకురావడం కూడా అవసరమయింది. ఆ బాధ్యతలు నిర్వహించడం అనుభవజ్ఞులకే సాధ్యం. అందువల్ల అర్చకులు శాసనకర్తలయ్యారు. దేవాలయాలు న్యాయస్థానాలయ్యాయి.
దేవాలయ నిర్వహణకు ప్రతి కుటుంబం వస్తురూపంలో కొంత విరాళంగా చేరుతుండటంతో, వాటి జమాఖర్చులూ, అత్యవసరమైన కొన్ని సంఘటనలూ జ్ఞాపకం నుండి జారిపోకుండా ఉండేందుకు ఏదోవొక రూపంలో వాటిని నమోదు చేయవలసిన అవసరం ఏర్పడింది. ఆ అవసరం నుండి చిత్రలిపి పుట్టుకొచ్చింది. అర్చకుల పరస్పర సంప్రదింపులతో చిత్రలిపి వైశాల్యం ఒనగూరదు. వ్రాయగలగడం, చదవగలగడం కలిసి ‘విద్య’. ఆ కాలంలో గుడికీ బడికీ తేడా లేదు.
చదవడం, రాయడం ఎంత వేగంగా పెరిగినా, దేవాలయం వెలుపలున్న సమాజమంతా విద్యలేని వాళ్లే. తమ పెద్దరికానికి సవాలు ఎదురయ్యే ఉపద్రవాన్ని నిరోధించేందుకు, ‘విద్య’ తమ హద్దును దాటిపోకుండా అర్చకవర్గం కట్టుదిట్టాలు పాటించింది. ‘అర్చకులంతా సంకుచితులే’ అనేందుకు వీలు లేదు గానీ, సంకుచితులవల్ల శాస్త్రవిజ్ఞానానికి ఎంత హాని జరిగిందో భారతీయులకు తెలిసినంతగా మరొకరికి తెలియరాదు. విద్యలను కుటుంబ పరిధిలో నిబెట్టుకోవాలనే తాపత్రయంతో అమూల్యమైన వైద్యవిజ్ఞానాన్నీ, ఖగోళవిజ్ఞానాన్నీ లోహపరిజ్ఞానాన్నీ చేతులారా ధ్వంసం చేసుకున్న జాతి మనది. తనసంతానం మేథోశక్తి చాలుతుందా చాలదా అనే విచక్షణ వదిలేసి, ఆసక్తిని వారసులకు సంక్రమింపజేసే చాదస్తంతో విద్యల సారాన్ని సంపూర్ణంగా ఇగురబెట్టింది. ఈ విషయంలో ప్రపంచంలోని పురాతన నాగరికతలన్నింటికి భిన్నంగా ప్రవర్తించింది చైనా, ఆ దేశంలో చదవడం, రాయడం ఒక వర్గం సొత్తుగాదు. ఆసక్తి ఉంటే ఎవరైనా అర్హులే. ఆ విధానం వల్ల సమాజంలో వాళ్ల నైపుణ్యాలు విస్తరిస్తూ వచ్చాయి.
మెసొపొటేమియా ఆలయాల దృక్పథం పెద్దదైనా, చిన్నదైనా, అవి ఆ నగరవాసుల విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పైగా, సామాజిక వ్యవహారాలను సమన్వయించేందుకు విజ్ఞత కలిగిన కేంద్రంగా వాటి అవసరం రోజు రోజుకు పెరిగిపోయింది. ఇదివరకటి పౌరుల వ్యాపకాలు వ్యవసాయం, పశుపోషణ, ఆత్మరక్షణలకు పరిమితం. ఇప్పుడు లోహపు పనిముట్ల తయారీ, వర్తకం, నౌకాయానం వంటి కొత్త వ్యాపకాలు సమాజంలో ప్రవేశించాయి. ఎవరెవరి వ్యాపకం వాళ్లది కావడంతో నగర రక్షణకు ఒక సైనికదళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకమయింది.
ఎం.వి.రమణారెడ్డి