జాహి హవాస్ బృందం తవ్వకాలు జరుపుతున్న సక్కారా ప్రాంతం
కైరో: ఈజిప్టు అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది పిరమిడ్లు, మమ్మీలు. పురాతత్వ శాస్త్రవేత్తలు ఇక్కడ నిత్యం పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. తాజాగా ఈజిప్టులోని సక్కారా ప్రాంతంలో ఆర్కియాలజిస్టులు 3000 సంవత్సరాల క్రితం నాటి చెక్క, రాతి శవపేటికలను గుర్తించారు. ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన చరిత్రను తిరగరాసే గొప్ప, అద్భుతమైన ఆవిష్కరణ అంటున్నారు ఆర్కియాలజిస్టులు. సక్కారా అనేది పురాతన ఈజిప్టు రాజధాని మెంఫిన్‌లో భాగం. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఇక్కడ డజనుకు పైగా పిరమిడ్లు, పురాతన మఠాలు, జంతువుల ఖనన ప్రదేశాలు ఉన్నాయి. ప్రసిద్ధ ఈజిప్టు పురావస్తు శాస్త్రవేత్త జాహి హవాస్ నేతృత్వంలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతాన్ని గుర్తించింది. ఈజిప్టు పాత సామ్రాజ్యం(ఓల్డ్ కింగ్‌డమ్) ఆరవ రాజవంశానికి చెందిన మొదటి ఫారో.. కింగ్ టెటి పిరమిడ్ సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ఆవిష్కరణలని గుర్తించింది.
'చరిత్రను తిరిగరాస్తుంది'
న్యూ కింగ్డమ్ (క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 11వ శతాబ్దం)నాటి 50 కి పైగా చెక్క శవపెటికలు భూమికి 40 అడుగుల లోతులో ఈ శ్మశానవాటికలో బయపటడినట్లు హవాస్ న్యూస్ ఏజెన్సీకి ఏఎఫ్‌పీకి వెల్లడించారు. "ఈ ఆవిష్కరణ సక్కారా చరిత్రను.. మరి ముఖ్యంగా 3,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైన న్యూ కింగ్డమ్ చరిత్రను తిరిగరాస్తుంది" అన్నారు. (చదవండి: ప్రైవేట్ ఫొటోషూట్.. మోడల్ అరెస్టు!)
ఇంకా ఏమి కనుగొన్నారు
తన బృందం శవపేటికలతో పాటు మొత్తం 22 బాణాలను కనుగొన్నట్లు హవాస్ వెల్లడించారు. వాటిలో ఒకదాని మీద "సైనికుడు, పక్కనే విశ్రాంతి తీసుకున్నట్లుగా ఉన్న అతని యుద్ధ గొడ్డలి ఉంది" అన్నారు. వీటితో పాటు ఒక రాతి శవపేటికను కూడా గుర్తించామని హవాస్ వెల్లడించారు. అలాగే చనిపోయినవారి పుస్తకంలోని(బుక్ ఆఫ్ ది డెడ్) 17 వ అధ్యాయాన్ని కలిగి ఉన్న ఐదు మీటర్ల పొడవున్న పురాతన పత్రం, ఆ కాలంలో ఉపయోగించిన మాస్క్‌లు, చెక్క పడవలు, పురాతన ఈజిప్షియన్లు ఆడటానికి ఉపయోగించే ఆట వస్తువులు వంటివి లభ్యమయ్యాయి అని తెలిపారు.
ఇదే ప్రధాన ఆవిష్కరణ ఎందుకు
ఈజిప్ట్ పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ శనివారం సక్కారాలో గుర్తించిన "ప్రధాన ఆవిష్కరణలు" గురించి ప్రకటించింది. ‘‘ఇది చాలా అరుదైన, క్రొత్త ఆవిష్కరణ. ఎందుకంటే మేము కనుగొన్న చాలా కళాఖండాలు న్యూ కింగ్‌డమ్(క్రొత్త రాజ్యం)కి చెందినవి. అయితే ప్రస్తుతం సక్కారాలో గుర్తించినవి మాత్రం సాధారణంగా క్రీ.పూ 500 కాలానికి చెందినవి’’ అని తెలిపింది. ఇక్కడ ఇటీవలి సంవత్సరాలలో అనేక తవ్వకాలు జరిగాయి. (చదవండి: 2,500 ఏళ్ల తర్వాత 'మమ్మీ'ని బయటకు తీశారు!)
బయటపడిన పురాతన ఆలయం
ఇక ఇక్కడ జరిపిన తవ్వకాల్లో హవస్ ఒక పురాతన ఆలయం కూడా బయటపడింది. ఇది "కింగ్ టెటి భార్య క్వీన్ నిరిట్ యొక్క అంత్యక్రియల ఆలయం" అని పురాతన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పురాతన ఈజిప్టులో నిర్మించిన మొట్టమొదటి నిర్మాణాల్లో ఒకటి అయిన జొజర్ స్టెప్ పిరమిడ్ సక్కరా ప్రాంతంలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment