టూకీగా ప్రపంచ చరిత్ర 46
ఈజిప్టు, మెసొపొటేమియాల కంటే మిక్కిలి విస్తారమైన ప్రాచీన నాగరికత సింధూ పీఠభూమిది. మెసొపొటేమియాకు మల్లే ఇది జంట నదుల నాగరికత. ఈ జంటలో ప్రధానమైంది సింధూ నది. దీనికి సమాంతరంగా ఒకప్పుడు తూర్పుపార్శ్వంలో ప్రవహించిన ఘగ్గర్-హాక్రా (Ghaggar-Hakra) నది ఇప్పుడు అంతర్థానమైంది. దీని ఉనికి కేవలం శాటిలైట్ చిత్రం ద్వారా తెలుసుకోవలసిందే. బహుకాలంగా చరిత్రకారుల నిర్లక్ష్యానికి గురి కావడంతో సింధూ నాగరికతకు సంబంధించిన సమాచారం మనకు దొరకుతున్నది అరకొరగానే. దొరికిన కొద్దిపాటి సమాచారంతోనే ప్రపంచానికి అబ్బురపాటు కలిగించిన నాగరికత సింధూ పీఠభూమిది. నేటి పాకిస్థాన్‌లోని ‘క్వెట్టా’ పట్టణానికి సమీపంలో, క్రీ.పూ. 7000 కాలం నాటి ‘మెహ్‌గ్రర్ (క్ఛజిటజట్చజి)లో బార్లీతో పాటు గోధుమ సాగైనట్టు తెలియడమే కాకుండా, మొట్టమొదటిగా ‘పత్తి’ (ఇౌౌ్ట్ట) ఆనవాళ్లు కనిపించింది ఇక్కడే. ‘సింధూ’ అనే పదానికి పర్షియన్ భాషలో సమానార్థకం ‘హిందూ’. ఆ కారణంగా గ్రీకులు, ఇరానియన్లు ఈ ప్రాంతాన్ని ‘హిందూ’ దేశంగా వ్యవహరించడంతో ఆ పేరే చరిత్రలో కొనసాగింది.
మెసొపొటేమియాకు మల్లే సింధూ నాగరికతలో కూడా ఇంటి నిర్మాణాలకు వాడింది ఇటుకేగాని, ఇవి కాల్చిన ఇటుకలు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం ఈ నాగరికత విశేషాలు. ఆ రోజుల్లో ఎక్కడా కనిపించని విధంగా ఇక్కడ ఇంటింటికి ఒక బావి, ఒక స్నానాల గది ఉండటం చూస్తే, ఇక్కడి వాతావరణంలోని తేమ, వేడి కారణంగా ఈ నాగరికులు స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చినట్టే కనిపిస్తుంది. వీటికి తోడు నగరం మధ్యలో కోనేరు. దాని ప్రయోజనం తెలీక పాశ్చాత్య పురావస్తు నిపుణులు దాన్ని పుణ్యస్నానాలకు ఉపయోగించే ‘గ్రేట్ బాత్’ (ఎట్ఛ్చ్ట ఆ్చ్టజి)గా భావించారు. వాస్తవానికి అది నగరవాసుల మంచి నీటి సౌకర్యం కోసం ఏర్పాటైన సదుపాయం. ఊట బావి నీరు మట్టిలోని లవణాలను అంతో ఇంతో కరిగించుకోవడంతో జవుకులుగా మారే అవకాశమున్న కారణంగా, వాటిని తాగేందుకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటూ, ఇటుకలతో కట్టిన కాలవద్వారా ఏటి నీరు నేరుగా కోనేటికి చేర్చుకుని, వాటిని తాగేందుకు ఉపయోగించడం ఇటీవలి కాలం దాకా దక్షిణ భారతదేశంలో సంప్రదాయంగా ఉండేది. కోనేర్లు రెండు రకాలవి మనకు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి. దేవాలయాల దగ్గర కనిపించే కోనేర్లకు తీరం పొడవునా, చుట్టూరా మెట్లుంటాయి. ఇవి స్నానాలకు ఉపయోగించేవి. మంచి నీటి కోనేర్లు సాధారణంగా దీర్ఘచతురస్రాలు. ఇరువైపులా వెడల్పు తక్కువుండే భుజాల్లో మాత్రమే వీటికి మెట్లుంటాయి. మొహెంజదారోలో కనిపించే గ్రేట్‌బాత్ అచ్చం ఈ తరహాదే.
ప్రపంచంలో ఎక్కడా కనిపించనన్ని ధాన్యపు రకాలకు సింధూ పీఠభూమి ఆలవాలం. గోధుమ, బార్లీ, రాగి, జొన్న, సజ్జలతో పాటు జీలకర్ర ప్రమాణంలో ఉండే బియ్యం తదితరాలు తృణధాన్యాలు; కంది, పెసర, శెనగ, ఉలవ, అనుము, మినుము, అలసంద తదితరాలు పప్పుదినుసులు; నువ్వులు, ఆవాలు, అవిసె, వేరుశనగ వంటివి చమురుగింజలు; వీటికి తోడు పలురకాల దంపులు, కూరగాయలు, పోపుదినుసులు విస్తారంగా పండేవి. పైరుగా కాక, నదీతీరాల్ల పొదలుపొదలుగా చెరుకు యదేచ్ఛగా పెరిగేది. బహుశా ఈ పంటల సమృద్ధి కారణంగా కావచ్చు, శాకాహారానికి ప్రాముఖ్యత పెరిగి, సింధూప్రాంత నివాసాల్లో జంతుబలి ప్రాధాన్యత తగ్గినట్టు కనిపిస్తుంది.
ఖనిజ సంపదలో పలురకాల రంగురాళ్లు కనిపిస్తాయే తప్ప, లోహాలు అరుదు. సింధూ నది ఎగువ ప్రాంతంలో దొరికే కొద్దిపాటి బంగారు మినహా, మిగతా ఏ లోహమూ ఇక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో అందుబాటు కాదు. అందువల్లే ఈ పురాతన నగరాల్లో లోహపరిశ్రమకు చెందిన ఆనవాళ్లు తక్కువగానూ, రంగురాళ్లను పూసలుగా తయారుజేసే పరిశ్రమలు ఎక్కువగానూ కనిపిస్తాయి. అనాది నుండి ఈ నాగరికత వైఢూర్యాలకు ప్రసిద్ధి. ఈ రంగుపూసల అమ్మకం కోసమే ఇక్కడి వారికి మెసొపొటేమియాతో వ్యాపార సంబంధం ఏర్పడింది. గిరాకీని అందుకునే స్థాయికి వృత్తికర్మాగారం పెరిగింది. అంతేగాదు, సరుకు నాణ్యతను ధృవీకరించే ‘బ్రాండింగ్ పద్ధతి కూడా అమలులో ఉండేదని నిరూపించే ఆధారాలు ఆ త్రవ్వకాల్లో బయట పడిన ముద్రికా పరికాలు (seals).
రచన: ఎం.వి.రమణారెడ్డి