టూకీగా ప్రపంచ చరిత్ర 45
నాగరికత
కట్టడాలకు మెసొపొటేమియాలో ఉపయోగించింది ఇటుకలు మాత్రమే. ఆ ప్రాంతాల్లో రాయి అరుదైన పదార్థం. ఎండవేడికి పటిష్టంగా బిగుసుకునే బంకమట్టి కోరినంత దొరుకుతున్న కారణంగా, ఇంటి నిర్మాణానికి ఇటుక తప్ప వేరొకదాన్ని గురించి ఆలోచించే అవసరమే వాళ్లకు కలిగుండకపోవచ్చు. సామూహిక ప్రయత్నంతో తమ పరిసరాలను క్రూరమృగాల నుండి విముక్తి చేసుకోగలగడంతో, బల్లెం చేత్తో పట్టుకుని ఒంటరిగానైనా పొలాల్లో యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛను వాళ్లు సంపాదించుకున్నారు.
చీకూ చింతాలేని జీవితం కావడంతో జనసాంద్రత అదివరకు ఎన్నడూ పెరగనంతగా పెరగడం మొదలెట్టింది. దాని మూలంగా గ్రామాల విస్తీర్ణం పెరిగింది, వాటి సంఖ్య పెరిగింది. అక్కడక్కడ కొన్ని జనావాసాలు గ్రామాల స్థాయిని దాటుకుని ‘పురాలు’గానూ, మరికొన్ని ‘నగరాలు’గానూ ఏర్పడ్డాయి. ఇప్పుడివి పచ్చికబయళ్ల కోసం ఇరుగుపొరుగుతో చావు బతుకులు తేల్చుకునేంత పోరాటానికి దిగే జనపథాలు ఎంతమాత్రం కావు. అవసరమైతే చేదోడువాదోడుగా నిలబడటం నేర్చుకున్న గ్రామాలు; పొలాలను తడుపుకునేందుకు ఏటికాలువల త్రవ్వకాలను ఉమ్మడిగా సమన్వయించుకునే గ్రామాలు. వాళ్లకిప్పుడు నరమేథంతో పురుషులను ఖతం చేసే అవసరం తీరిపోయింది. మిథునాల కోసం ఏ జనపథం నుండో స్త్రీ జనాన్ని దోచుకురావడం అనాగరికమైంది. అందుకోసం వరుసలూ, వియ్యాలూ పుట్టుకొచ్చాయి.
అంతర్గతంగా ఎంత ప్రశాంతత సాధించినా, చుట్టుపక్కలుండే అనాగరిక తెగలతో మెసొపొటేమియాకు ఆటుపోట్లు తప్పలేదు. ఉత్తరంగా ఉండే ఆసియా మైనర్‌లో ఆటవికులు, తూర్పు దిశన మధ్య ఆసియాలో సంచార తెగలు, దక్షిణాన అరేబియా ప్రాంతంలో ఎడారి జాతులు - వాళ్ల నుండి క్రూరమైన దాడులను ఎదురుజూస్తూ ఏ పూటకాపూట వాళ్ల జీవితం బిక్కుబిక్కుమని గడుస్తుండేది. పోరాటానికి తెగించింది దాడిచేసే గుంపు. ఐనా, ఆ దాడులను నిగ్రహించుకుని మెసొపొటేమియన్లు నిలదొక్కుకున్నారంటే, అది కేవలం సంఖ్యాబలం, సమన్వయాల మూలంగా సాధించుకున్నదే. ఎంత నిలదొక్కుకున్నా యుద్ధం వల్ల అంతో ఇంతో నష్టం జరిగే తీరుతుంది. ఆ నష్టం కంటే దాడికి పాల్పడే గుంపుతో బేరం కుదుర్చుకోవడం క్షేమమనే ఆలోచన కొన్నిచోట్ల కలిగిందనటానికి మహాభారతంలోని బకాసురుని వృత్తాంతమే ఆధారం. ప్రాణహానిని ఎదుర్కోవడం కంటే, ఎంత అనుభవించినా తరగని సంపదలో ఎంతోకొంత ఎదుటి పక్షానికి ఒప్పందంగా అప్పగించి, అధిక నష్టాన్ని అరికట్టడం లాభదాయకమనే ఆలోచన భారతంలోన ఏకఛత్రపురవాసులకు కలిగినట్టే మరెంతోమందికి కలిగుండొచ్చు. బండి నిండా పంపించే వంటకాలతో తృప్తిపడకుండా, నరమాంసం కోరుకునే దురాశే బకాసురునికి లేకపోతే, అతని భావితరాలకు బహుశా ఈస్టిండియా కంపెనీవాళ్లు అడ్డుకునే దాకా నిరపాయంగా సాగిపోతూ ఉండేదేమో!
మెసొపొటేమియా, ఈజిప్టు నాగరికతల్లో ఏది మిక్కిలి పురాతనమైందో చరిత్రకారులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్న సందేహం. ఇవి ఒకదాన్నుండి మరొకటి పుట్టుకొచ్చినవా లేక దేనికది స్వతంత్రంగా ఎదిగినవా అనేది గూడా జవాబు దొరకని మరో ప్రశ్న. ఇప్పుడు ఉగాండా దేశంగా ఉన్న తావున పుట్టి, ఉత్తర దిశగా సూడాన్ దేశం నిలువునా ప్రవహించి, ఈజిప్టు ద్వారా మధ్యధరా సముద్రంలో కలిసే ‘నైలు నది’ పరీవాహక ప్రాంతం పొడవునా విస్తరించిన నాగరికతను ‘ఈజిప్టు నాగరికత’ లేదా ‘నైలునది నాగరికత’ అంటారు. స్థూలంగా దీనికీ మెసొపొటేమియా నాగరికతకూ వ్యత్యాసం కనిపించదు. మలిచేందుకు ఒదిగే సున్నితమైన రాయి నైలు ప్రాంతంలో దొరుకుతున్న సౌలభ్యం మూలంగా ఇక్కడి నిర్మాణాలకు రాయిని ప్రధానంగానూ, ఇటుకను సహకారంగానూ వాడుకున్నారు. బయటి నుండి జరిగే దాడుల విషయంలో ఇజిప్షియన్లు అదృష్టవంతులు. వాళ్ల రక్షణకు తూర్పున ఎర్రసముద్రం ఉంది, ఉత్తరాన మధ్యధరా సముద్రం ఉంది. పడమటి దిశలో ఎడారిగా మారుతున్న సహారా కాగా, దక్షిణంగా ఉండేది దాడికి సాహసించలేనంతగా వెనుబడిన నీగ్రో తెగలు.
రచన: ఎం.వి.రమణారెడ్డి