మైఖేల్ మధుసూదన్ దత్ 19వ శతాబ్దపు ప్రముఖ బెంగాలీ కవి, నాటక రచయిత. 1824లో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని జెస్సోర్ సమీపములోని సాగర్‌దారి గ్రామంలో జన్మించారు. బెంగాలీ నాటకరంగ ఆద్యులలో ఒకరు. ఈయన ప్రసిద్ధ కృతి ‘మేఘ్‌నాథ్ బద్ద్ కావ్య’.. విషాదభరిత కావ్యం బెంగాలీ సాహిత్యంలో అద్వితీయమైనది. జీవితంలోని బాధలు, ప్రేమల గురించి ఈయన స్త్రీ గొంతుకతో కూడా అనేక కవితలు రాశారు. బాల్యంనుండే మధుసూదన్ ఆచార వ్యవహారాలలో ఆంగ్లేయుల్లా ఉండాలని ఉవ్విళ్లూరేవారు. హిందూ జమిందారీ కుటుంబంలో పుట్టిన మధుసూదన్, తన కుటుంబం అభీష్టానికి వ్యతిరేకంగా క్రైస్తవ మతాన్ని స్వీకరించి మైఖేల్ అనే పేరు పెట్టుకున్నారు.
అనంతరకాలంలో తన ఆంగ్లేయ, పాశ్చాత్య మోజుకు పశ్చాత్తాపపడి తన మాతృభూమి ఉద్యమాలకు మద్దతునిచ్చారు. ఆ దశలో ఈయన రాసిన కవితలు, గేయాలలో ఆ పశ్చాత్తాపం ప్రతిఫలించింది. మధుసూదన్ దత్‌ను బెంగాలీ సాహిత్యపు గొప్ప కవులలో ఒకరిగా మాత్రమే కాక, బెంగాలీ సానెట్ పితగా కూడా పరిగణిస్తారు. మధుసూదన్ దత్ విద్యాభ్యాసం షేక్‌పూరా గ్రామంలోని పాతమసీదులో పర్షియన్ నేర్చుకోవడంతో ప్రారంభమైంది. అసమానమైన ప్రతిభ, బుద్ధి కలిగిన విద్యార్థిగా చిన్నతనం నుండే ఉపాధ్యాయుల దృష్టిని ఆకర్షించారు.
బాల్యంలో ఇంటి దగ్గర, కలకత్తాలో ఆంగ్ల విద్య, ఐరోపా సాహిత్యంతో పరిచయమేర్పడటం వల్ల దత్‌ను ఆంగ్లేయుల అలవాట్లు, ఆచార వ్యవహరాలు, పద్ధతులు, ఆలోచనా ధోరణి ఆ దారిలో నడిచేలా చేశాయి. దత్ జీవితంలో అలాంటి తొలి ప్రభావానికి హిందూ కళాశాలలో ఆయన గురువు కెప్టేన్ డి.ఎల్.రిచర్డ్‌సన్ కూడా ఒక కారణం. మేఘ్‌నాథ్ బద్ధ్ కావ్యంతో పాటు, ఆయన ఇతర రచనల్లోని తిలోత్తమ, రత్నావళి కూడా ప్రఖ్యాతిగాంచాయి. నేడు దత్ వర్ధంతి. 1873 జూన్ 29న ఆయన కలకత్తాలో మరణించారు. భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ ఈయన సంతతి వారే అని చెబుతారు.
(చదవండి: మహోజ్వల భారతి: చాణక్య నరసింహ)
Comments
Please login to add a commentAdd a comment