
అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ ఇందుకు సాక్ష్యం పలుకుతుంది. ఆయన నిరంతరం స్వేచ్ఛ కోసం పరితపించేవారు. చదువుల కోసం వారణాసి వెళ్లారు. అదే ఆయన జీవితంలో పెద్ద మలుపు అయింది. భారతీయ ఆధ్యాత్మిక చింతన, జాతీయ భావాలు ఆ గంగాతీరంలోనే ఆయనను ముంచెత్తాయి, ఆలోచనలను మలిచాయి. ఆయన జీవితం మీదే కాదు, కవిత్వం మీద కూడా అవే ప్రతిబింబించాయి.
బ్రిటిష్ వారి బెంగాల్ విభజనతో వేలాది మంది తొలిసారి స్వరాజ్య సమరంలోకి అడుగుపెట్టారు. వారణాసిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు భారతి హాజరయ్యారు. మళ్లీ కలకత్తా సభలకు కూడా వెళ్లారు. 1907 నాటి సూరత్ కాంగ్రెస్ సమావేశాలను కూడా భారతి చూశారు. జాతీయ కాంగ్రెస్‌కే చెందిన తిరుమలాచారి 1906 లో ‘ఇండియా’ అనే తమిళ పత్రికను నెలకొల్పారు. ఆయనే ‘బాల భారతి’ పేరుతో ఆంగ్ల పత్రిక కూడా స్థాపించారు. ఈ రెండింటికీ సంపాదకునిగా సుబ్రహ్మణ్య భారతినే తిరుమలాచారి ఎంపిక చేశారు.
ఎడిటర్‌గా ఆయన ఆయన రాసిన రాతలకు అరెస్టు వారంట్లు జారీ అవడంతో భారతి కొందరు మిత్రుల సలహాతో మద్రాసు విడిచిపెట్టి పుదుచ్చేరి వెళ్లిపోయారు. తిరిగి ఆయన పుదుచ్చేరి విడిచిపెట్టి మద్రాసు ప్రెసిడెన్సీలోని కడలూరుకు రాగానే పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల పాటు తమ నిర్బంధంలోనే ఉంచారు. ఆ సమయంలో అనీబిసెంట్, సీపీ రామస్వామి అయ్యర్ జోక్యం చేసుకుని ఆయనను విడిపించారు. అప్పటి నుంచి రాజకీయ ఉద్యమానికి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ సంఘ సంస్కరణోద్యమానికి ఆయన దగ్గరయ్యారు.
ముఖ్యంగా మహిళల పరిస్థితి మీద ఆయన పోరాటం చేశారు. మహిళలను గౌరవించాలన్న ఆశయాన్ని ఆయన ఆచరణలో పెట్టడానికి ప్రధాన కారణం సిస్టర్ నివేదిత. ఆధునిక తమిళ సాహిత్యానికి ఆయన సేవలు నిరుపమానమైనవి. పుదుచ్చేరిలో ఉండగా లభించిన వెసులుబాటుతో భగవద్గీతకు, పతంజలి యోగ సూత్రాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు. భారతి పేరును తమిళ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపిన ‘కణ్ణన్ పట్టు’, కూయిల్ పట్టు’ కావ్యాలు కూడా పుదుచ్చేరిలో ఉండగానే రాశారు.
1921 సెప్టెంబర్ 12న తుదిశ్వాస విడిచేనాటికి సుబ్రహ్మణ్య భారతి వయసు 39 సంవత్సరాలు. అందులో పదేళ్లు అజ్ఞాతంలోనే గడిచాయి. కానీ ఆయన కవిత్వానికి ఒక వెలుగునిచ్చిన ఘనత భారతి సహధర్మ చారిణి చెల్లమ్మాళ్‌దే. తన సోదరుడు, మరొక దగ్గర బంధువు సాయంతో ఆమె మద్రాసులో ఒక ఆశ్రమం స్థాపించి, భారతి రచనలను సంకలనాలుగా వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment