భారత జాతీయ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సుభాస్ చంద్రబోస్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించిన రోజు ఇది (జూన్ 22). ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. 1939 లో సుభాష్ చంద్రబోసు నేతృత్వంలో ఈ పార్టీ ఆవిర్భవించింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వతంత్ర రాజకీయ పార్టీగా తిరిగి దానిని స్థాపించారు. పార్టీకి నేడు ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లో బలమైన ఉనికి ఉంది. పార్టీ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేబబ్రత బిశ్వాస్. స్వాతంత్య్రినంతర కాలంలో, శరత్ చంద్రబోసు (సుభాష్ చంద్రబోసు సోదరుడు), చిత్త బసులు పార్టీ నాయకులుగా ప్రఖ్యాతి గాంచారు. గాంధీజీతో విభేదాలు వచ్చిన సుభాస్ చంద్రబోస్ 1939 ఏప్రిల్ 29న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
అనంతరం కలకత్తాలో నిర్వహించిన ర్యాలీలో ఫార్వర్డ్ బ్లాక్ ఏర్పాటును బహిరంగంగా ప్రకటించారు. పార్టీలో చేరాక ఎవరూ కూడా ఎన్నటికీ బ్రిటిషు వారి వైపు తిరగాల్సిన అవసరం ఉండదని, వారి రక్తంతో సంతకం చేసి, ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూర్తి చెయ్యాలని బోసు ఆ సందర్భంగా ఆదేశించారు. ముందుగా పదిహేడు మంది యువతులు వచ్చి ప్రతిజ్ఞా పత్రంలో సంతకం చేశారు. ప్రారంభంలో ఫార్వర్డ్ బ్లాక్ లక్ష్యం కాంగ్రెస్‌లోని అన్ని వామపక్ష విభాగాలను సమీకరించడం, కాంగ్రెస్ లోపల ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని అభివృద్ధి చేయడం. బోసు ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడయ్యారు. జూన్ చివరిలో బొంబాయిలో ఫార్వర్డ్ బ్లాక్ ప్రాథమిక సమావేశం జరిగింది.
ఆ సమావేశంలో పార్టీ రాజ్యాంగాన్ని, కార్యక్రమాన్నీ ఆమోదిం చారు. జూలైలో సుభాష్ చంద్రబోసు ఫార్వర్డ్ బ్లాక్ కమిటీని ప్రకటించారు. కమిటీ అధ్యక్షులుగా సుభాష్ చంద్రబోసు, ఉపాధ్యక్షులుగా పంజాబ్‌కు చెందిన ఎస్‌ఎస్ కవిషర్, ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీకి చెందిన లాల్ శంకర్ లాల్, కార్యదర్శులు గా బొంబాయికి చెందిన విశ్వంభర్ దయాళు త్రిపాఠి, ఖుర్షీద్ నారిమన్‌లు ఎంపికయ్యారు. ఇతర ప్రముఖ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన మద్దూరి అన్నపూర్ణయ్య, బొంబాయికి చెందిన సేనాపతి బాపట్, హరి విష్ణు కమ్నాథ్, తమిళనాడుకు చెందిన పసుంపన్ యు.ముత్తురామలింగం తేవర్, బీహార్ నుండి షీల్ భద్ర యాగీ ఉన్నారు.
పార్టీ బెంగాల్ ప్రావిన్సు కార్యదర్శిగా సత్య రంజన్ బక్షి నియమితుడయ్యాడు. బోసు తన కొత్త రాజకీయ పార్టీకి మద్దతు కూడగడుతూ దేశవ్యాప్తంగా పర్యటించారు. మరుసటి సంవత్సరం 1940 జూన్ 20–22 న ఫార్వర్డ్ బ్లాక్ తన మొదటి అఖిల భారత సమావేశాన్ని నాగపూర్‌లో నిర్వహించింది. ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్‌ను సామ్యవాద రాజకీయ పార్టీగా ప్రకటించారు. జూన్ 22 ను ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వ్యవస్థాపక తేదీగా తీసుకున్నారు. బ్రిటిషు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటం కోసం మిలిటెంట్ చర్యను కోరుతూ ‘అధికారమంతా భారతీయులకే’ అనే తీర్మానాన్ని ఈ సమావేశం ఆమోదించింది.
(చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు)
Comments
Please login to add a commentAdd a comment