రుక్మిణీదేవి అరండేల్ జీవితం సమ్మోహనపరిచేదిగా ఉంటుంది. ఆమె దార్శనికురాలు. దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలు. నాట్యకారిణి. నృత్య దర్శకురాలు. జంతు ప్రేమికురాలు. సంప్రదాయ భారతీయ కళలు, హస్తకళల్ని ప్రోత్సహించిన వ్యక్తి, వక్త. అన్నిటినీ మించి మానవతావాది. మదురైలో సనాతన సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రుక్మిణీదేవి 16 ఏళ్ల వయసులో తన కన్నా 20 ఏళ్లు పెద్దవాడైన బ్రిటిష్ దివ్యజ్ఞాన సమాజ వర్గీయుడు డాక్టర్ జార్జ్ ఎస్.అరండేల్‌ను పెళ్లి చేసుకుని తన వర్గంలో ప్రకంపనలు సృష్టించారు.
ఆమె పై డాక్టర్‌అనీబిసెంట్, దివ్యజ్ఞాన సమాజ ఉద్యమం, స్వదేశీ ఉద్యమాల ప్రభావం ఉంది. రుక్ష్మిణీదేవి 29 ఏళ్ల వయసులో మైలాపూర్ గౌరి అమ్మ దగ్గర నృత్యం నేర్చుకున్నారు. అనంతరం పండనల్లూర్‌కు చెందిన గురు మీనాక్షీ సుందరం పిళ్లై వద్ద కూడా నృత్యాభ్యాసాన్ని కొనసాగించారు. ఆమె 31 ఏళ్ల వయసులో దివ్యజ్ఞాన సమాజంలో మొదటిసారి నృత్య ప్రదర్శన ఇచ్చారు.
1936 లో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్‌ను ప్రారంభించారు. అదే కళాక్షేత్రగా మారింది. శాస్త్రీయ భారతీ నృత్య రూపమైన సాధిర్‌ను పునరుద్ధరించడంలో (అదే ఇప్పుడు భరతనాట్యం) అరండేల్ రుక్ష్మిణీదేవికి సహాయపడ్డారు. ఇ.కృష్ణయ్యర్ తరువాత సాధిర్‌కు గౌరవనీయతను తీసుకు వచ్చింది అరండేలే. నృత్య రూపకం విధానం ఆవిర్భావానికి అరండేల్ వైతాళికురాలిగా నిలిచారు.
ఆమెలో స్త్రీవాద దృక్పథం లేదా విమోచన పార్శ్యం కూడా ఉండేది. భర్తలు చనిపోయినప్పుడు భార్యలు తల వెంట్రుకలు తీయించుకోవడం పూర్వం ఆచారంగా ఉండేది. రుక్మిణీదేవి తన తండ్రి చనిపోయినప్పుడు తన తల్లికి గుండు గీయించడాన్ని వ్యతిరేకించారు. తన భర్త చనిపోయిన తరువాత కూడా ఆమె తన నుదిటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని యథా ప్రకారం కొనసాగించారు. యువతరానికి, నృత్య చరిత్రకారులకు ఆమె ఒక పరిశీలనాంశం.
నిజంగానే ఆమె పునరుజ్జీవనం తీసుకు వచ్చిన మహిళ. దేశాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఎక్కువ మంది మహిళలకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని తిరస్కరించిన వారూ ఎక్కువమంది లేరు. మొరార్జీ దేశాయ్ 1977లో వెండి పళ్లెంలో పెట్టి ఇచ్చినట్లుగా రాష్ట్రపతి పదవిని ఇవ్వజూపినప్పుడు రుక్మిణీదేవి అరండేల్ నిరాకరించారు. రాష్ట్రపతి భవన్‌లో ఉండటం కన్నా కళాక్షేత్రంలో ఉండడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
– లీలా శామ్‌సన్, అరండేల్ శిష్యురాలు, కళాక్షేత్ర ఫౌండేషన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment