దివ్య నాట్యం
జంతువులు మాట్లాడలేవు. కానీ నేనూ మీరూ వాటిలో మాట్లాడగలం కదా! వాటితో సంభాషణ జరపగలం కదా! అందుకే నేను వాటి మౌనరోదనను ప్రపంచానికి వినిపించేలా చేయాలని నడుం కట్టాను. మీరూ కట్టండి
- రుక్మిణీదేవి అరుండేల్
జీవితం క్షణభంగురం కాదు. అనుక్షణ మాలిక. ప్రతి క్షణంలో చలనం ఉంటుంది. మార్పును తెస్తుంది. మన చుట్టూ ప్రపంచం పరిభ్రమిస్తుంది. మనమూ అనేక పరిభ్రమణలకు లోనవుతాం. ఈ క్రమంలో కేంద్రానికి చేరుతాం. అక్కడ కదలిక ఉండదు. అది సత్యం. అది దివ్యం. ఆ చైతన్యాన్ని పొందడమే దివ్యజ్ఞానం! ఆ దివ్యజ్ఞానాన్ని తాను పొందితే సరిపోతుందా? పదుగురికీ పంచాలి అనుకుంది రుక్మిణి. అప్పటికామె వయసు పదహారు.ప్రముఖ సంస్కృత పండితుడు, పీడబ్యుడీలో ఇంజినీర్ అయిన కె.ఎ.నీలకంఠశాస్త్రి- శేషమ్మాళ్ దంపతులకు 1904 ఫిబ్రవరి 29న రుక్మిణి మధురైలో జన్మించారు. అనీబిసెంట్ నాయకత్వంలోని థియొసాఫికల్ సొసైటీ (దివ్యజ్ఞాన సమాజం) చెన్నైలోని అడయార్ కేంద్రంగా పనిచేస్తోంది. దివ్యజ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన నీలకంఠశాస్త్రి రిటైరైన అనంతరం మధురై నుంచి చెన్నైకు మకాం మార్చారు.
తండ్రి, అంత కంటే ఎక్కువగా అనీబీసెట్ రుక్మిణిపై ప్రభావం చూపారు. థియొసాఫికల్ సొసైటీ తరఫున న్యూ ఇండియా పత్రికను తెచ్చే డా॥జార్జి అరుండేల్తో రుక్మిణికి తన 13వ ఏట పరిచయం ఏర్పడింది. పత్రికకు కవితలు, వ్యాసాలు కంట్రిబ్యూట్ చేసేది. ఆమె మెచ్యురిటీకి, ఉన్నత విలువల పట్ల గల ప్రేమకు అరుండేల్ ఆశ్చర్యపోయేవాడు. 16వ ఏట ఇరువురూ వివాహం చేసుకున్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ యంగ్ థియోసోఫిస్ట్స్ హోదాలో ప్రపంచ పర్యటనలు చేస్తోన్న రుక్మిణీ అరరుండేల్ రష్యన్ నాట్యకారిణి అన్నా పావ్లొవా ప్రదర్శించిన ‘డయింగ్ స్వాన్’ బ్యాలే నృత్యం చూసి వివశురాలైంది. ఆమె స్ఫూర్తితో రష్యన్ బ్యాలే అభ్యసించింది. దివ్యజ్ఞానాన్ని వ్యాప్తి చేసేందుకు నాట్యమే సరైన మాధ్యమం అని రుక్మిణి నిర్ణయించుకుంది. ఏ నృత్యం?
చంద్రగిరికి చెందిన ముద్దు చంద్రరేఖ తంజావూరులోని ఇందిరా మండపంలో పేరిణి నృత్యాన్ని ప్రదర్శించింది. ఈ నృత్యమే తరువాతి కాలంలో భరతనాట్యం అయ్యింది. దేవదాసీలకే ప్రత్యేకమైన ఆలయనృత్యం కాలక్రమంలో రాజదర్బారులకు, కలవారి లోగిళ్లకు పతనం చెందింది. ఈ నృత్యం పరువుగలవారు చేసేది కాదని సమాజం ముద్రవేసింది. ఇటువంటి పరిస్థితుల్లో మెడ్రాస్ మ్యూజిక్ అకాడెమీలో ఇరువురు దేవదాసీలు చేసిన నృత్యం చూసిన రుక్మిణి అరుండేల్ భరతనాట్యం ద్వారా దివ్యజ్ఞానాన్ని వ్యాప్తిచేయాలని భావించింది. ఈ నిర్ణయం సంప్రదాయ బ్రాహ్మణ పెద్దలకు ఆగ్రహాన్ని కలిగించింది. మొదట విదేశీయునితో పెండ్లి. తర్వాత దేవదాసీల శిష్యురాలు. ఇంకేమైనా ఉందా అని చిటపటలాడారు. తమకు వత్తాసు దొరకని నేపథ్యంలో ‘మా అమ్మాయే’ అనడం తర్వాత కాలంలో వింత!
అదలా ఉంచితే మైలాపూర్ గౌరీ అమ్మాళ్, మీనాక్షి సుందరం పిళ్లైల వద్ద రుక్మిణి నాట్యాన్ని నేర్చుకుంది. థియోసాఫికల్ సొసైటీ డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ సందర్భంగా 1935లో అడయార్‌లో రుక్మిణి అరండేల్ తొలిసారి తన నృత్యాన్ని ప్రదర్శించింది. వివిధ దేశాలకు చెందిన థియోసాఫిస్ట్‌లు రుక్మిణిని కాశ్మిక్ డ్యాన్స్ ప్రదర్శించిన ‘దేవి’గా అభివర్ణించారు. మరుసటి సంవత్సరమే రుక్మిణి దేవి -అరండేల్ దంపతులు థియోసాఫికల్ సొసైటీలో కళాక్షేత్రను స్థాపించారు. అడయార్ నదికి మెరీనా బీచ్‌కు మధ్యగల 250 ఎకరాల సువిశాలమైన సహజ ప్రకృతిలో కళాక్షేత్ర దివ్యజ్ఞానాన్ని ప్రసరిస్తోంది. వివిధ దేశాల విద్యార్ధులు ఇక్కడ శిక్షణపొందుతున్నారు. కాంతి కిరణాలై ప్రకాశిస్తున్నారు.
కళాక్షేత్రలో నృత్యమే నేర్పరు. నృత్యం ద్వారా వ్యక్తికి - సమాజానికి, వ్యక్తికి - ఇతర ప్రాణులకూ గల విడదీయలేని అనుబంధాన్ని తెలియజేస్తారు. పంచభూతాలు నువ్వు అవుతావు. నువ్వూ పంచభూతాలవుతావు అనే ఎరుకను కలిగిస్తారు. రుక్మిణి మాంసాహార భక్షణకు, జంతు బలులకు వ్యతిరేకి. ఇంటర్నేషనల్ వెజిటేరియన్ యూనియన్‌కు అధ్యక్షురాలై 1986లో మరణించేవరకూ 31 సంవత్సరాలు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. నృత్యంపై, దివ్యజ్ఞానంపై ఎన్నో పుస్తకాలు రాసారు.
ఇండియా టుడే జాబితాలో నేటి భారతదేశాన్ని రూపొందించిన 100 మందిలో ఒకరుగా రుక్మిణి ఎంపికయ్యారు. సంగీతనాటక అకాడెమీ ఫెలోషిప్ పొందారు. 1956లో పద్మభూషణ్ స్వీకరించారు. భారత పూర్వ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్, రుక్మిణీ అరుండేల్ కంటే వయసులో పెద్ద. ఇరువురూ లీప్ సంవత్సరంలోనే జన్మించారు. ఆయనకు రుక్మిణి పట్ల ఎనలేని గౌరవం, అభిమానం. రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా మొరార్జీ మంత్రి మండలి రుక్మిణీదేవిను నిర్ణయించింది. ఆమె తిరస్కార ముద్రను చూపారు, సున్నితంగా!