
బాల్ రాజ్ భల్లా విప్లవాత్మక స్వాతంత్య్ర సమరయోధుడు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఇతర విప్లవకారులతో కలిసి స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. బాల్ రాజ్ భల్లా ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న గుజ్రాన్ వాలా జిల్లాలోని వజీరాబాద్ తహసీల్‌లో జన్మించారు.
పాఠశాల విద్యను వజీరాబాద్‌లో పూర్తి చేసి, లాహోర్‌లోని డి.ఎ.వి. కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1911లో ఎంఏ పట్టా పొందారు. భల్లా విప్ల కార్యకలాపాలు ఆయన విద్యా సర్టిఫికేట్లను ప్రభుత్వం జప్తు చేయడానికి దారితీశాయి. భల్లా పదిహేడేళ్ల వయసులోనే స్వాతంత్య్ర ఉద్యమంలో చేరారు.
దాదాభాయ్ నౌరోజీ, బంకిం చంద్ర ఛటర్జీ, బాల గంగాధర్ తిలక్, రమేశ్ చందర్ దత్‌ల దార్శనికత, ఆలోచనల నుండి ప్రేరణ పొందారు. తన తండ్రికి సన్నిహితుడైన లాలా లజపతిరాయ్‌కి ఆరాధకుడు. భల్లా ఆధునిక, సాంకేతిక విద్య అవసరాన్ని చాటి చెప్పారు. పాఠ్యాంశాల్లో సంస్కృతం, హిందీతో పాటు ఆంగ్లం, సైన్స్‌ను తప్పనిసరి చేయాలని సూచించారు. భల్లా సంఘ సంస్కర్త కూడా.
అంటరానితనం, కుల వ్యవస్థ, వితంతు పునర్వివాహాలకు వ్యతిరేకంగా పోరాడారు. మరో వైపు వలస ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు కోసం పనిచేశారు. 1919లో గవర్నర్ జనరల్‌పై బాంబు విసిరే కుట్రలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. మూడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలయ్యారు.
తిరిగి 1927లో అరెస్టు అయ్యారు. పోలీసు అధికారి జేపీ సాండర్స్ హత్యకు గురైన లాహోర్ కుట్ర కేసులో భాగస్వామిగా ఉన్నందుకు కూడా రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. తిరుగుబాటుదారులను రాజకీయ ఖైదీలుగా పరిగణించాలని డిమాండ్ చేస్తూ భగత్ సింగ్‌తో కలిసి నిరాహార దీక్ష చేసిన ఖైదీల్లో భల్లా ఒకరు.
మహాత్మా గాంధీ ప్రభావం తర్వాత హింసాత్మక విప్లవ మార్గాలను విడిచిపెట్టారు. హిందీ, పంజాబీ, ఆంగ్ల భాషల్లో ప్రసంగాలు, రచనల ద్వారా గాంధీ మార్గాన్ని ప్రబోధించారు. జర్మనీ ఇంగ్లండ్‌లను కూడా పర్యటించారు. నేడు (జూన్ 10) భల్లా జయంతి.
Comments
Please login to add a commentAdd a comment