Roundup 2022: India Roundup Special Story In Telugu - Sakshi
Sakshi News home page

Roundup 2022: మెరుపులు..మరకలు

Published Mon, Dec 26 2022 5:04 AM | Last Updated on Mon, Dec 26 2022 8:23 AM

Roundup 2022: INDIA Roundup Special Special Story - Sakshi

ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు...
ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు...
‘ఆత్మ నిర్భర్‌’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్‌ మెరుపులు...
అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌–ఎస్‌ చిమ్మిన నిప్పులు...
బ్రిటన్‌ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు...
కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం...
...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని.
సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్‌ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు.
ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం...


మెరుపులు
► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్‌ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్‌భంజ్‌ జిల్లాకు చెందినవారు.
► భారత్‌ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్‌ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) తన నివేదికలో వెల్లడించింది.
► భారత్‌ తొలి ప్రైవేట్‌ రాకెట్‌ విక్రమ్‌–ఎస్‌ నవంబర్‌ 18న శ్రీహరి కోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అనే స్టార్టప్‌ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్‌ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది.
► దేశంలో డిజిటల్‌ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్‌బీఐ  డిసెంబర్‌ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్‌ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది.
► ఆత్మనిర్భర్‌ భారత్‌కు ఊతమిస్తూ  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ప్రచండని అక్టోబర్‌లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్‌ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి.

మరకలు
► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్‌ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్‌ 14న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి.
► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్‌ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్‌పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్‌ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్‌ చేతుల్లోకి  వెళ్లింది.  
► గుజరాత్‌లోని మోర్బిలో అక్టోబర్‌ 30 కుప్పకూలిపోయిన కేబుల్‌ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది.  
► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్‌ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్‌ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్‌ 11న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.


విషాదాలు
► యావత్‌ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్‌ (92); పద్మవిభూషణ్, కథక్‌ దిగ్గజం పండిట్‌ బిర్జు మహరాజ్‌ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.
► సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్‌ యాదవ్‌ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది.
యాత్రలు, విజయాలు, చీలికలు
► కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్‌ జోడో యాత్ర  సెప్టెంబర్‌ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది.
► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్‌ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు.
► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్‌ హిమాచల్‌తో సరిపెట్టుకోగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్‌లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది!
► బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ మరోసారి యూ టర్న్‌ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్‌ బైకొట్టి తిరిగి మహాఘట్‌బంధన్‌లో చేరి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు.
► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్‌నాథ్‌ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు.
► నేషనల్‌ హెరాల్డ్‌ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి.  పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి.


చరిత్రాత్మక తీర్పులు...
► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.  
► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్‌ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్‌ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది.  
► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్‌ రేప్‌లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది.
► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్‌ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది.


విశ్వవేదికపై...
► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్‌ స్వీకరించింది. 2023 నవంబర్‌ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్‌లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది.
► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్‌ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్‌ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది.
► అరుణాచల్‌ప్రదేశ్‌లో తవాంగ్‌ సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్‌ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement