ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మంగళవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్నారు. గూడ అంజయ్య ఇవాళ సాయంత్రం రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలం రాగన్నగూడెంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు.
నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా అంజయ్య ఎన్నో కథలు, పాటలు రాశారు.'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు' అనే పాట ప్రజాదరణ పొందింది. ఆయన వ్రాసిన 'ఊరు మనదిరా' పాట 16 భాషలలో అనువాదం అయింది. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసారు. అంజన్నకు ముగ్గురు కుమార్తెలు. గత నెల 25న ఆయన అనారోగ్యంతో నిమ్స్ లో చేరారు. అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.
గూడ అంజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై గేయాలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణీయమైనవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గూడ అంజయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.