
ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘9.9.2019 కాళోజి నారాయణరావుగారి 105వ జయంతి.
ఈ సందర్భంగా కాళోజిగారి జీవిత విశేషాలను, రచనలను, స్వాతంత్య్ర పోరాట విశేషాలను నేటి యువతీయువకులకు పరిచయం చేయాలనుకున్నాం. మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతి పట్టిన ఆయన జీవిత విశేషాలను దృశ్య రూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో ‘కాళన్న’ సినిమా చేస్తున్నాం. కాళోజికి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వి.ఆర్. విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ మొదలైన మిత్రులతో సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుది రూపం ఇచ్చి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్ సిరాజుద్దీన్.