Telangana poet
-
వెండితెరకు కాళోజి జీవితం
ప్రముఖ రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జీవితం వెండితెరకు రానుంది.‘అమ్మా నీకు వందనం, ప్రణయ వీధుల్లో.. పోరాడే ప్రిన్స్, క్యాంపస్–అంపశయ్య’ వంటి చిత్రాలను తెరకెక్కించిన డా. ప్రభాకర్ జైనీ దర్శకత్వంలో ‘కాళన్న’ పేరుతో కాళోజి బయోపిక్‌కి సన్నాహాలు జరుగుతున్నాయి. జైనీ క్రియేషన్స్ పతాకంపై విజయలక్ష్మి జైనీ నిర్మిస్తారు. ఈ సందర్భంగా ప్రభాకర్ జైనీ మాట్లాడుతూ– ‘‘9.9.2019 కాళోజి నారాయణరావుగారి 105వ జయంతి. ఈ సందర్భంగా కాళోజిగారి జీవిత విశేషాలను, రచనలను, స్వాతంత్య్ర పోరాట విశేషాలను నేటి యువతీయువకులకు పరిచయం చేయాలనుకున్నాం. మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతి పట్టిన ఆయన జీవిత విశేషాలను దృశ్య రూపంలో నిక్షిప్తం చేయాలనే మహోన్నత ఆశయంతో ‘కాళన్న’ సినిమా చేస్తున్నాం. కాళోజికి అత్యంత సన్నిహితులైన అంపశయ్య నవీన్, వి.ఆర్. విద్యార్థి, నాగిల్ల రామశాస్త్రి, పొట్లపల్లి, అన్వర్ మొదలైన మిత్రులతో సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుది రూపం ఇచ్చి త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రవి కుమార్ నీర్ల, సంగీతం: ఘంటసాల విశ్వనాథ్, మహమ్మద్ సిరాజుద్దీన్. -
మూగబోయిన తెలంగాణ పోరాట గళం
► ప్రజాకవి అంజయ్య కన్నుమూత ► అనారోగ్యం, పక్షవాతంతో తుదిశ్వాస విడిచిన పాటల కెరటం ► తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అంజన్న పాటలు ► ‘ఊరు మనదిరా..’ పాటతో ఉప్పెనలై లేచిన ఊళ్లు ► ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైన పాట ► నేడు ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌లో అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్/దండేపల్లి ‘‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. పల్లె మనదిరా.. ప్రతి పనికి మనంరా.. దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో.. జాలీమ్ కౌన్ రే.. ఉస్కా జులుం క్యా రే..’’ అంటూ ఆ గళం గడీల రాజ్యంపై దండెత్తింది! ‘‘కత్తి మనది.. సుత్తి మనది.. పలుగు మనది..’’ అంటూ సమస్త వృత్తులను ఏకం చేసింది!! ‘‘అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకొని మోకాటి బురదల్లో మడిగట్లు దున్నితె గరిసెలెవ్వలివి నిండెరా.. గుమ్ములెవ్వలివి నిండెరా..’’ అంటూ భూస్వామ్య దోపిడీని చీల్చి చెండాడింది!! ‘‘అయ్యోనివా నువు అవ్వోనివా.. తెలంగాణోనికే తోటి పాలోనివా..’’ అంటూ తెలంగాణ ధిక్కారాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చేసింది!! ‘‘పుడితె ఒక్కటి.. సస్తె రెండు.. రాజిగ ఒరి రాజిగో ఇగ ఎత్తుర తెలంగాణ జెండా.. రాజిగ ఒరి రాజిగ..’’ అంటూ తెలంగాణ ఉద్యమాగ్నిని రగిలించింది!!! తెలంగాణ తొలిదశ పోరాట కాలం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు సాగిన ఆ పాటల పోరాట కెరటం ఆలసిపోయింది. పాటల్ని తూటాల్లా మలచి పల్లెల్లో విప్లవాగ్నిని రగిల్చిన ఆ గళం మూగబోయింది. జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ కలం ఇక సెలవంటూ వెళ్లిపోయింది. ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్య(62) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం హయత్‌నగర్ సమీపంలోని రాగన్నగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురవడం, పక్షవాతం రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన అంజయ్య వారం కిందటే డిశ్చార్జి అయ్యారు. మంగళవారం డీహైడ్రేషన్‌తో నీరసించడంతో కుటుంబసభ్యులు డాక్టర్‌ను పిలిపించి ఇంట్లోనే వైద్యం అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం అంజయ్య కన్నుమూశారు. కుటుంబ నేపథ్యమిదీ.. అదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపూర్‌లో లస్మయ్య, లస్మమ్మ దంపతులకు నాలుగో సంతానంగా 1954, నవంబర్ 1న అంజయ్య జన్మించారు. అంజయ్యకు హేమానళినితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు శ్రీలత, కవిత, మమత. వారిలో ఇద్దరికి పెళ్లి అయింది. అంజయ్య ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ లక్సెట్టిపేటలో చదివారు. హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చేశారు. ఫార్మాసిస్టుగా ఉట్నూర్‌లో మొదటగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆదిలాబాద్‌లో కూడా పనిచేశారు. తర్వాత సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. అంజయ్య తల్లి లస్మమ్మ లింగాపూర్లోనే ఉంటోంది. అంజయ్యకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి. ప్రస్తుతం ఒక సోదరుడు, సోదరి మిగిలారు. మిగతా వారు చనిపోయారు. అనారోగ్యానికి గురైనప్పట్నుంచీ అంజయ్య సాహిత్యానికి దూరంగా ఉంటున్నారు. ఆ పాట విప్లవోద్యమ బావుటా.. అంజయ్య రాసిన పాటలు కోట్లాది మంది అణగారిన జనం గుండె చప్పుడుగా, సమాజంలోని ఆధిపత్య ధోరణిపై ఉక్కు పిడికిలిగా, దిక్కుమొక్కులేని జనానికి ఆలంబనగా నిలిచాయి. ఆయన రాసిన ‘ఊరు మనదిరా..’ పాట ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైంది. తెలంగాణ పాటలకు బొడ్రాయిగా నిలిచిన ఆ పాట ఓ కొర్రాయిలా మండి దొరల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ పాట స్ఫూర్తితో ఎందరో యువకులు విప్లవోద్యమంలోకి దూకారు. ఇదే పాటను ఆఫ్రికా విముక్తి ఉద్యమంలో అక్కడ ఉద్యమకారులు తమ భాషలోకి మార్చుకొని పాడుకున్నారు. ‘అయ్యోనివా నువు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా...’ అంటూ అంజయ్య రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ‘ఊరు విడిచి నే పోదునా... ఉరి వేసుకొని సద్దునా...’ పాటలో తెలంగాణ కష్టాలను, బాధలను అంజయ్య ఏకరువు పెట్టాడు. ఆకలి చావులు, వలసవాదంపై ఆయన రాసిన ఎన్నో పాటలు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించాయి. తెలంగాణ సాంస్కృతిక కళాకారులు అంజన్న పాటలను చంటిబిడ్డలా ఎత్తుకొని పల్లెపల్లెన ఆడారు, పాడారు. ఉద్యమ పాటలే కాకుండా సామాజిక సృ్పహతో అంజయ్య అనేక పాటలు రాశారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థులు ఢిల్లీ వె ళ్లే సమయంలో ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ పాట రాశారు. ఆయన రాసిన పాటలు ఎర్రసైన్యం, స్వర్ణక్క, చీమలదండు, ఒసేయ్ రాములమ్మ, చీకటి సూర్యుడు, రైతురాజ్యం వంటి ఎన్నో సినిమాలకు ప్రాచూర్యం తెచ్చాయి. తొలినాళ్లలో విప్లవోద్యమంలో పాల్గొన్న అంజయ్య ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దగ్గరయ్యారు. దళిత, మహిళా పోరాటాల్లో కలిసి పనిచేశారు. అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో తన అస్తిత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం నాయకుడిగా పనిచేశారు. చివరిదాకా పాటే శ్వాసగా.. 1969 నాటి తెలంగాణ తిరుగుబాటు రోజులను అంజన్న ప్రత్యక్షంగా చూశారు. 16వ ఏట నుంచే విప్లవ సాహిత్యాన్ని చదివిన ఆయన.. దళిత కథలు కూడా రాశారు. ఎమర్జెన్సీలో జైలు జీవితాన్ని ఆ చీకటి రోజులను చూసి అనేక పాటలు రాశారు. ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకూ తన జీవిత సహచరి సహకారంతో పాటలను రాస్తూనే ఉన్నారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిట పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా..’ పుస్తకం విడుదలైంది. పాటలతోపాటు నవలలు, నాటకాలు కూడా రచించాడు. నటుడిగా కూడా ప్రతిభ చాటుకున్నారు. ఎర్రసైన్యం, మాభూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి సినిమాల్లో పలు పాత్రల్లో నటించారు. కేసీఆర్‌ను చూడాలన్న కోరిక తీరకుండానే.. పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడాలనే కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట అంజయ్యను పరామర్శించేందుకు వస్తానని సీఎం కార్యాలయం సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమానళిని తెలిపారు. స్వగ్రామానికి భౌతికకాయం అంజయ్య భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి నాంపల్లిలోని గన్‌పార్క్ వద్దకు తీసుకొచ్చారు. కవులు, కళాకారులు, రచయితలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల కోసం భౌతికకాయాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు. అంజన్న పొందిన అవార్డులు.. ► 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుంచి అవార్డు ►1988లో సాహిత్య రత్న బిరుదు ► 2000లో గండెపెండేరా బిరుదు ► 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు ► 2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారం -
మూగవోయిన అంజన్న గళం
నివాళి కడు పేదరికంలో ఉన్నా గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి. అది తీవ్రమైన ఎండల కాలం. నల్లగొండ జిల్లా కోదాడ పట్టణంలో ప్రగతిశీల ప్రజాతంత్ర విద్యార్థి సంఘం (పీడీ ఎస్‌యూ) మొదటి మహాసభ తర్వాత అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మునుగోడ తాలుకా పల్లివెల గ్రామానికి నడచి వెళుతున్నాము. కాలినడ కన తిరగడం వల్ల అప్పటికే చాలామంది కళాకా రుల ఆరోగ్యం దెబ్బతింది. అయినా మొదటి అరు ణోదయ నాయకుడు పి. చలపతి రావు ఆధ్వ ర్యంలో, పట్టుదలతో కార్యక్రమాలు ఇస్తూ వెళు తున్నాం. ఇంతలో అల్లంత దూరాన మోరం కొడుతున్న ఒక రైతు, ‘‘ఊరు మనదిరా, వాడ మన దిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనం రా..’’ ఇలా పాడుతు న్నంతట్లో గూడ అంజయ్య మమ్మల్నందరినీ ఆపి మకుటం ఉన్నదున్నట్లుగా తీసుకుని ‘‘దొర ఏందిరో, వాని జులుం ఏందిరో, నడుమ జాలిం కౌన్‌రే, ఇస్క్ జులుం క్యాహైరే’’ అని రాసి మిగతా భాగం పూర్తి చేసి ఆ రోజు రాత్రి పల్లివెల గ్రామంలో పాడితే వేలాది జనం ఆ పాటను వింటూ ఉర్రూతలూగారు. విప్లవ సాంస్కతికోద్యమంలో వచ్చిన మొదటి పాట అది. ఆ పాట ఇప్పటికీ, ఎప్పటికీ జనం గుండెల్లో మారుమోగుతూనే ఉంది. అనేక మంది ప్రజా కళాకారులకు జవం జీవం ఆ పాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వందలాది గ్రామాల్లో వేలాది సందర్భాల్లో ఆ పాట ప్రజా హృదయాల్లోకి చొచ్చుకుపోయింది. తెలంగాణలో అయితే ఆ పాట వినని, స్పందించని, ఆవేశం ప్రదర్శించని ఊరు లేదంటే అతిశయోక్తి కాదు. మా సాంస్కృతిక ప్రస్థానంలో భాగంగా జూన్ 24, 1975న తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటలో కార్యక్రమం ఇచ్చాము. ఆ కార్యక్రమానికి హాజరైన వారిలో పీడీఎస్‌యూ నాయకుడు జంపాల ప్రసాద్, కె. లలిత, అనూరాధ, అంబిక, స్వర్ణలత, రామసత్తయ్య, ప్రసాదు, బీఏవీ శాండిల్య తదితరులు ఉన్నారు. జూన్ 25వ తేదీ కాకినాడ పట్టణంలో సినిమావీధిలో కార్యక్రమం. దోమాచారి, జనార్ధనరావు, కాశీపతి ఆ సభలో ఉపన్యాసకులు. అదే సమయంలో జోరున వర్షం కురుస్తోంది. తడుస్తున్న జనం ఒక్కరొక్కరుగా లేస్తున్నారు. ఆ సందర్భంలో గూడ అంజయ్య ఊరు మనదిరా అనే పాటను, నేను ఓ అమర కళా వేత్తలారా.. అనే పాటను గళమెత్తిపాడితే జనం అంత వర్షంలో కూడా కిక్కురుమనకుండా నిలబడి పాటలు విన్నారు. ఆనాటి విప్లవ పరిస్థితి, దానికి అనుగుణంగా పుట్టిన పాటలు జనాన్ని ఎంతగా చైతన్యం చేసి కదిలించాయో ఈ ఘటన తెలుపు తుంది. ఆ రోజు శివసాగర్ రాసిన ‘చెల్లీ చెంద్రమ్మా’ నృత్య రూపకాన్ని కూడా ప్రదర్శిం చాము. సీనియర్ కళాకారుడు, కవి గాయకులు కానూరి వెంకటేశ్వరరావు రాసిన ‘ప్రగతి’ కూచి పూడి యక్ష గానం తదితర కళా రూపాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. కాకినాడలో ప్రదర్శన 25 రాత్రి ముగిసింది. కళాకారులందరం ఒక విద్యార్థి నాయకుని రూంలో పడుకోబోతున్నాం. సరిగ్గా 12 గంటలకు జంపాల ప్రసాద్ వచ్చి ‘‘కామ్రేడ్స్! దేశంలో ఇప్పుడే ఎమర్జెన్సీ విధించింది ఇందిరా గాంధీ. ప్రతిపక్షాలను, విప్లవకారులను, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేస్తున్నారు. కామ్రేడ్ సోమచారిగారిని ఇప్పుడే అరెస్టు చేశారు. ఇక అరుణోదయ కార్యక్రమాలన్నీ వాయిదా పడినట్లే. కాబట్టి మిమ్మల్ని అరెస్టు చేస్తారు. జాగ్రత్తగా వెళ్లండి, తర్వాత కలుద్దాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో కాశీపతి, గూడ అంజయ్య, నేను తదితరులం రైల్లో హైదరాబాద్ బయల్దేరాం. దారిలోనే గూడ అంజయ్యను అరెస్టు చేసింది ప్రభుత్వం. కాశీపతి అనంతపూర్ వెళుతూ అరెస్ట య్యాడు. మిగతావాళ్లం తప్పించు కున్నాం. కామ్రేడ్ గూడ అంజయ్య జైల్లో ఉంటూనే అనేక పాటలు రాశాడు. ఉదాహరణకు ‘‘ఇగ ఎగబడుదామురో ఎములడ రాజన్న’’, ‘‘చుక్కలాంటి చుక్కా లో లక్షలాది చుక్కల్లో, ఏ చుక్క లున్నా వయ్యా శ్రీపాద శ్రీహరి’’, ‘‘నల్లగొండ జిల్ల ఇది విప్లవాల ఖిల్లా, ఎర్రై జండా, ఎగరాలి మల్లి మల్లి’’ లాంటి అనేక పాటలు రాశాడు. ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత అరుణోదయ, పీడీఎస్‌యూలో కొనసా గాడు. తర్వాత కొంతకాలానికి ప్రభుత్వ ఉద్యో గిగా మారాడు. అయినా తన కలానికి రాపిడి పెడుతూ నిన్నటి తెలంగాణ ఉద్యమంలో అంజన్న నిర్వహించిన పాత్ర మరువలేనిది. ‘‘అవ్వోనివా, నువ్వు అయ్యోనియా’’ లాంటి పాటలు రాసి, పాడి నూతన రాష్ట్ర ఆవిర్భావంలో తనవంతు బాధ్యత నిర్వర్తించాడు. ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతం లోని దళిత కుటుంబంలో పుట్టిన అంజన్న ప్రపంచం గుర్తింపు కలిగిన కవి, గాయకుడిగా ఎది గిన తీరు ఎంతో ఆదర్శవంతమైనది. ఊరు మన దిరా, ఈ వాడ మనదిరా వంటి గొప్ప పాటలతో భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు విప్లవ సాహి త్యం అదించారు. పుడితే ఒక్కటి, చస్తే రెండు, రాజిగో ఓరి రాజిగా ఎత్తర తెలంగాణ జెండ రాజిగో ఓరి రాజిగా అంటూ తెలంగాణ ఉద్య మాన్ని ముందుకు నడిపించారు. కవిగా, రచ యితగా సాంస్కృతిక రంగ నాయకుడిగా జీవిత కాలం నిబద్ధతతో ప్రజాపక్షాన నిలిచిన అంజన్న జ్ఞాపకాలు చిరస్మరణీయంగా ఉంటాయి. కుటుంబం మొత్తం కడు పేదరికంలో ఉన్నా, గూడ అంజయ్య తన కలాన్ని, గళాన్ని మాత్రం ఆపలేదు. మంచాన పడేవరకు కళాకారుడిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నాడు. ‘దొర ఏందిరో, దొర దోపిడేందిరో’ అని గర్జించిన గళం మూగవోయింది. గళానికి నా వందనం. తెలంగాణ ప్రజాగాయకుడు అంజన్నకు ఒక ప్రియ మిత్రు డుగా, అరుణోదయ కళాకారునిగా అశ్రు నయనా లతో జోహార్లు అర్పిస్తూ, అంజన్న పాట చిరంజీవి, అంజన్న చిరంజీవి. అరుణోదయ రామారావు వ్యాసకర్త అరుణోదయ సాంస్కృతిక సంస్థ నాయకుడు మొబైల్ : 94907 58845 -
ప్రముఖ కవి, రచయిత గూడ అంజయ్య కన్నుమూత
హైదరాబాద్ : ప్రముఖ కవి, గేయ రచయిత గూడ అంజయ్య మంగళవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్నారు. గూడ అంజయ్య ఇవాళ సాయంత్రం రంగారెడ్డి జిల్లా హయాత్ నగర్ మండలం రాగన్నగూడెంలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన 1955లో ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపురంలో జన్మించారు. నలభై ఏళ్లుగా కవిగా, రచయితగా అంజయ్య ఎన్నో కథలు, పాటలు రాశారు.'నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు' అనే పాట ప్రజాదరణ పొందింది. ఆయన వ్రాసిన 'ఊరు మనదిరా' పాట 16 భాషలలో అనువాదం అయింది. తెలంగాణ సాంస్కృతిక సంఘ నాయకునిగా పనిచేసారు. అంజన్నకు ముగ్గురు కుమార్తెలు. గత నెల 25న ఆయన అనారోగ్యంతో నిమ్స్ లో చేరారు. అనంతరం ఆరోగ్యం కుదుటపడటంతో వైద్యులు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. గూడ అంజయ్య మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక సామాజిక అంశాలపై గేయాలు రాసిన అంజయ్య సేవలు చిరస్మరణీయమైనవని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...గూడ అంజయ్య మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. -
కాళోజీకి ఘన నివాళి
తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జేసీ శర్మన్ తదితరులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన రచనలు ఎంత ఉపయోగపడ్డాయో గుర్తుచేసుకున్నారు. మహబూబ్‌నగర్ కల్చరల్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ను తెలంగాణ రాష్ట్ర తొలికవిగా గుర్తించాలని కలెక్టర్ జీడీ ప్రియద ర్శిని కోరారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కాళోజీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వ హించిన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నిరంతర పోరాటం చేసిన కాళోజీ నిత్య చైతన్యశీలి అని కొనియాడారు. ఆయన ప్రాధాన్యతను తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సరసన చేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళోజీ తెలంగాణ యాస, భాష, రచనలు, మాటలు ప్రభావితం చేశాయని అన్నారు. ప్రధానవక్తగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య ఎస్వీ రామారావు మాట్లాడుతూ.. కాళోజీ మాటల్లో కల్తీ ఉండదని మహాకవి దాశరథి కితాబునిచ్చారని గుర్తు చేశారు. ఆయన రాసిన మొదటి రచనను 1953లో అలంపూర్‌లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సమ్మేళనంలో భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆవిష్కరించడం జాతికే గర్వకారణమని అన్నారు. కాళోజీ జీవన గమనాన్ని, కవిత్వాన్ని విడదీయలేమని, ఆయన చెప్పదలుచుకున్న అంశాలను, సందేశాలను కరపత్రాలు, కవితలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరవేశారని గుర్తుచేశారు. ఆంగ్లేయులు, నైజాం నవాబుల పాలనతో పాటు ఆంధ్రాపాలకుల వివక్షను ఎండగట్టి పలుమార్లు జైలుకు వెళ్లారని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ.. నవ తెలంగాణను చూడడానికే కాళోజీ తన కళ్లను దానం చేశారని, ఆయన ఇక్కడ లేకున్నా చూడగలుగుతున్నారని అన్నారు. పీయూ వీసీ భాగ్య నారాయణ, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, మునిసిపల్ చైర్పర్సన్ రాధా అమర్ కాళోజీ సేవలను కొనియాడారు. కాగా ఈ సందర్భంగా నూతన రాష్ట్రంలో తెలుగు విశ్వ విద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అవార్డును పొందిన జిల్లా సాహితీభీష్ముడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తిని నగదు పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ రాంకిషన్, ప్రముఖ కవి పల్లెర్ల రామ్మోహన్ రావు, జిల్లా సాంస్కృతిక మండలి ప్రతినిధులు, కవులు పాల్గొన్నారు. -
ఇదో భువన విజయం
వరుసగా... అనువుుల(కుందావఝల కృష్ణవుూర్తి), దాశరథి కృష్ణమాచార్య (గిరిజావునోహర్బాబు), సురవరం ప్రతాపరెడ్డి(తిరువుల శ్రీనివాసాచార్య), ఆళ్వార్‌స్వామి(దత్తాత్రేయుశర్మ), కాళోజీ(యుల్లారెడ్డి) తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి దాశరథి కృష్ణమాచార్య 89వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. కొన్ని దశాబ్దాలుగా ‘ఆంధ్రప్రదేశ్’లో ప్రాచుర్యంలో ఉన్న ‘భువనవిజయా’న్ని తలపిస్తూ ‘తెలంగాణ విజయా’న్ని గుర్తు చేస్తూ ‘సుకవితాశరథీ! దాశరథీ’ కార్యక్రమాన్ని అపూర్వంగా ప్రదర్శించింది. భువన విజయంలోని అష్టదిగ్గజ కవులు చారిత్రకంగా సమకాలికులు. అలాగే రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన ‘సుకవితాశరథి’లోని తెలంగాణ కవులు దాశరథికి సమకాలికులు, పూర్వీకులు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డిగా తిరుమల శ్రీనివాసాచార్య, దాశరథిగా గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, వట్టికోట అళ్వారుస్వామిగా దత్తాత్రేయశర్మ, వానమామలై వరదాచార్యులుగా మధుసూదనరావు, కాళోజీగా పొద్దుటూరి యల్లారెడ్డి, అనుముల కృష్ణమూర్తిగా కుందావఝల కృష్ణవుూర్తి, చందాల కేశవదాసుగా పురుషోత్తమాచార్య, పల్లా దుర్గయ్యగా ఆచార్య వేణు, ఒద్దిరాజు సీతారామచంద్రరావుగా మడిపల్లి సుబ్బయ్య, ఆయన సోదరుడు ఒద్దిరాజు రాఘవరావుగా వనం లక్ష్మీకాంతరావు.. దాశరథితో ‘తెలంగాణ చారిత్రక, సాంప్రదాయ, ఉద్యమ ఘట్టాలను’ సమకాలీనులుగా పంచుకున్నారు. అప్పటికప్పుడు ఆయా పాత్రలను పోషించిన కవులు సహజంగా రూపొందించుకోవడం విశేషం. రూపకంలో కొన్ని వ్యక్తీకరణలు... వట్టికోట అళ్వారు స్వామి: నిజామాబాద్ జైల్లో దాశరథీ ‘ఓరోరి నైజాము...’ అంటూ నీవు ఆశువుగా కవిత్వం చెబుతుండగా పళ్లు తోముకునేందుకు ఇచ్చిన బొగ్గు ముక్కతో జైలు గోడలపై రాశాను కదా. రాసింది చూసి, రాసింది నేనేననుకుని పోలీసులు వేరే గదిలో వేసి కొట్టారు. దెబ్బలు గట్టిగా తగిల్నయి. నీది గట్టి కవిత్వం! చందాలకేశవదాసు: దాశరథీ... నీకంటే ఎంతో ముందు పుట్టినవాడిని. పరబ్రహ్మ పరమేశ్వరా, పురుషోత్తమ సదానంద అనే ప్రార్థనా గీతము, భలేమంచి చౌకబేరము- మీరజాలగలడా పాటలు రాస్తోన్న కాలం. నిన్ను అప్పట్లో చూడక పోయినా 15వ ఏట నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నావని నీ గురించి విన్నాను. ‘ నీ నినాదం తెలంగాణ మేనిసొమ్ము’! దాశర థి: తెలంగాణ స్వప్నం ఫలించడం వల్ల మనందరం ఇలా బతికి బట్టకట్టాం. తెలంగాణలో కవులు లేరన్న ‘ముడుంబై’ మాటలను పట్టుదలగా తీసుకుని గోలకొండ కవుల సంచికతో మూడు నూర్ల కవులను పరిచయం చేస్తూ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన సమావేశమైన మనం పోతన వారసులం. ‘ఇమ్మనుజేశ్వరాధముల...’ అన్న పోతన నుంచి మన వరకూ, ఇకముందూ, తెలంగాణ కవులు ధిక్కార కవులే! సాహితీరూపకంలో పాల్గొన్న కవులను, క్వశ్చన్ మార్క్(?) శీర్షికతో దాశరథి రచన ‘ఆ చల్లని సముద్రంలో...’ ఆలపించిన దాశరథి గ్రామస్తుడు నందన్రాజును భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ సత్కరించారు. - పున్నా కృష్ణమూర్తి -
రావెళ్ల ఇకలేరు
ముదిగొండ, న్యూస్‌లైన్: తెలంగాణ తొలితరం కవి, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం అస్వస్థతతో కన్నుమూశారు. ముదిగొండమండలం గోకినేపల్లిలోని తన స్వగృహంలో రావెళ్ల తనువుచాలించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు, తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్య పరిచిన రావెళ్ల గోకినేపల్లిలో 1927 జనవరి 31న రైతు కుంటుంబంలో జన్మించారు. భూమి కోసం, భుక్తి కోసం, నిజాం రాచరిక పాలన అంతం కోసం తుపాకి పట్టి దళకమాండర్‌గా పని చేసి ప్రత్యర్థులను గడగడలాడించిన ధీశాలి ఆయన. విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు పార్టీ పట్ల ఆకర్షితులైన రావెళ్ల 1944 లో ఆంధ్రమహాసభలో చేరారు. 1947 ప్రాంతంలో నవభారత, స్వాతంత్రభారత పత్రికలలో నైజాంపాలనను విమర్శిస్తూ అభ్యుదయ జానపదశైలిలో రచనలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో తొలిదశ కమాండర్‌గా పెన్నూ గన్నూ చేతబట్టి బరిలోకి దూకి పీడిత ప్రజల పక్షాన నిలిచి పోరాడారు. రహస్య జీవితం గడుపుతూ పోరాట ఉద్యమం నిర్వహించారు. 1948 అక్టోబర్ నుంచి 1952 డిసెంబర్ వరకు గుల్బర్గా, ఔరంగాబాద్, బీడ్, ఢిల్లీ, ఖమ్మం తదితర జైళ్లలో గడిపి...జైళ్లలో దుస్థితిని మార్చాలని 16 రోజులు నిరాహార దీక్ష చేపట్టడం ద్వారా చదవడం, రాయడం సౌకర్యాన్ని సాధించడం విశేషం. ఢిల్లీ కేంద్ర కారాగారంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ఇంద్రజిత్ గుప్తా, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి దశరధదేవ్, కె ఎన్ సింగ్, బర్మా, కెప్టెన్ మహ్మద్ తదితరులు రావెళ్లకు సహచరులుగా ఉన్నారు. 1952 డిసెంబర్ 8వ తేదీన ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. ఆతరువాత గోకినేపల్లి కవిత కుటీరంలో నిరాడంబర జీవితం గడుపుతూ రచనలు సాగించారు. రావెళ్ల పద్యరచనతో పాటు అనేక వ చన రచనలు సైతం చేశారు. రావెళ్ల కవితా ఖండికల్లో అనంతల్పం, పల్లెభారతి, రాగజ్యోతుల్లాంటివి ముఖ్యమైనవిగా ఉన్నాయి. నాయకుల ఘననివాళి.... రావెళ్ల మృతదేహాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంతాపం ప్రకటించారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, గోకినేపల్లి సర్పంచ్ కొమ్మినేని రమేష్‌బాబు, ఐద్వా నాయకురాలు మచ్చా లక్ష్మి, అడ్వకేటు జేఏసీ నేత బిచ్చాల తిరుమలరావు, బీజేపి జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, గాయకుడు దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, మధిర, పాలేరు నియోజకవర్గాల ఇన్ చార్జీలు బొమ్మెర రామ్మూర్తి, బత్తుల సోమయ్య, నేలకొండపల్లి, ముదిగొండ మండలాద్యక్షులు కొండూరి వేణు, సీతారాములు, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, సీపీఐ మండల కార్యదర్శి రావుల పాటి శ్రీనివాసరావు, టీడీపీ మండల అధ్యక్షుడు సామినేనిరమేష్, బేగ్, అబ్దుల్నబీ రావెళ్ల వెంకటరామారావు మృతదేహాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కాగా, గోకినేపల్లిలో జరిగిన సంతాపసభలో టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్ మాట్లాడుతూ రావెళ్ల వెంకటరామారావు మృతి సాహితీ ప్రపంచానికి తీరని లోటని అన్నారు. ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్‌రావెళ్ల రాసిన తెలంగాణ గేయాన్ని పాడి వినిపించారు. కాగా, గోకినేపల్లిలో మంగళవారం రావెళ్ల కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయానికి అంతిమసంస్కారం నిర్వహించారు. -
తెలంగాణ కవి ‘రావెళ్ల’ కన్నుమూత
తెలంగాణ కవి, సాయుధ పోరాట యోధుడు, రావెళ్ల వెంకటరామారావు(86) మంగళవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలోని ఆయన స్వగృహంలో కన్ను మూశారు. 1929లో జన్మించిన ఈయన నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేయడంతో పాటు తన రచనలు, పాటల ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ గేయాన్ని రాసిన మొదటి కవి రావెళ్ల. ఆయన భౌతికకాయాన్ని ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సందర్శించి సంతాపం ప్రకటించారు.