కాళోజీకి ఘన నివాళి
తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు శతజయంతి వేడుకలను మంగళవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఈ వేడుకలను ప్రభుత్వం అధికారికంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ జీడీ ప్రియదర్శిని, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జేసీ శర్మన్ తదితరులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేయడంలో ఆయన రచనలు ఎంత ఉపయోగపడ్డాయో గుర్తుచేసుకున్నారు.
మహబూబ్‌నగర్ కల్చరల్: ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు ను తెలంగాణ రాష్ట్ర తొలికవిగా గుర్తించాలని కలెక్టర్ జీడీ ప్రియద ర్శిని కోరారు. జిల్లా సాంస్కృతిక మండలి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో కాళోజీ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వ హించిన కలెక్టర్ జీడీ ప్రియదర్శిని మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రసాధన కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నిరంతర పోరాటం చేసిన కాళోజీ నిత్య చైతన్యశీలి అని కొనియాడారు. ఆయన ప్రాధాన్యతను తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సరసన చేర్చాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాళోజీ తెలంగాణ యాస, భాష, రచనలు, మాటలు ప్రభావితం చేశాయని అన్నారు.
ప్రధానవక్తగా పాల్గొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ మాజీ అధ్యక్షుడు ఆచార్య ఎస్‌వీ రామారావు మాట్లాడుతూ.. కాళోజీ మాటల్లో కల్తీ ఉండదని మహాకవి దాశరథి కితాబునిచ్చారని గుర్తు చేశారు. ఆయన రాసిన మొదటి రచనను 1953లో అలంపూర్‌లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్తు సమ్మేళనంలో భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆవిష్కరించడం జాతికే గర్వకారణమని అన్నారు. కాళోజీ జీవన గమనాన్ని, కవిత్వాన్ని విడదీయలేమని, ఆయన చెప్పదలుచుకున్న అంశాలను, సందేశాలను కరపత్రాలు, కవితలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు చేరవేశారని గుర్తుచేశారు.
ఆంగ్లేయులు, నైజాం నవాబుల పాలనతో పాటు ఆంధ్రాపాలకుల వివక్షను ఎండగట్టి పలుమార్లు జైలుకు వెళ్లారని అన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ మాట్లాడుతూ.. నవ తెలంగాణను చూడడానికే కాళోజీ తన కళ్లను దానం చేశారని, ఆయన ఇక్కడ లేకున్నా చూడగలుగుతున్నారని అన్నారు. పీయూ వీసీ భాగ్య నారాయణ, జేసీ శర్మన్, ఏజేసీ రాజారాం, మునిసిపల్ చైర్‌పర్సన్ రాధా అమర్ కాళోజీ సేవలను కొనియాడారు. కాగా ఈ సందర్భంగా నూతన రాష్ట్రంలో తెలుగు విశ్వ విద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అవార్డును పొందిన జిల్లా సాహితీభీష్ముడు డాక్టర్ కపిలవాయి లింగమూర్తిని నగదు పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ రాంకిషన్, ప్రముఖ కవి పల్లెర్ల రామ్మోహన్ రావు, జిల్లా సాంస్కృతిక మండలి ప్రతినిధులు, కవులు పాల్గొన్నారు.