ఇంద్రవెల్లి: ప్రజలు రాచరిక పాలన నుంచి విముక్తి పొంది, ఇందిరమ్మ రాజ్యం కోరుకున్నారని, వారి అభిష్టానికి అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తామని రాష్ట్ర పంచాయతీరా జ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ప్రజా పాలనకు సంబంధించి బుధవారం ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్ష సమావేశానికి వెళ్తూ, మార్గమధ్యలో ఇంద్రవెల్లి స్తూపం వద్ద ఆగారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతో కలిసి ఆదివాసీ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. ఐటీడీఏ పీవో చాహత్ బాజ్‌పాయ్, ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, డీపీవో శ్రీనివాస్‌తో పాటు అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్మృతి వనం ఏర్పాట్లపై ఐటీడీఏ పీవోతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. పేదల ఆశలు నెరవేర్చే దిశగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో గతంలో ఇక్కడ జరిగిన దళిత, ఆదివాసీ దండోరా సభలో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా స్మృతి వనం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగే సభకు 50 వేల మందితో బయలుదేరి వెళ్తున్నట్లు సీతక్క వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment