మూగబోయిన తెలంగాణ పోరాట గళం | telangana great poet guda anjaiah is no more | Sakshi
Sakshi News home page

మూగబోయిన తెలంగాణ పోరాట గళం

Published Wed, Jun 22 2016 8:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

మూగబోయిన తెలంగాణ పోరాట గళం

మూగబోయిన తెలంగాణ పోరాట గళం

► ప్రజాకవి అంజయ్య కన్నుమూత
► అనారోగ్యం, పక్షవాతంతో తుదిశ్వాస విడిచిన  పాటల కెరటం
► తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన అంజన్న పాటలు
► ‘ఊరు మనదిరా..’ పాటతో ఉప్పెనలై లేచిన ఊళ్లు
► ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైన పాట
► నేడు ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్‌లో అంత్యక్రియలు

 
 సాక్షి, హైదరాబాద్/దండేపల్లి
 ‘‘ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా..
 పల్లె మనదిరా.. ప్రతి పనికి మనంరా..
 దొర ఏందిరో.. వాడి పీకుడేందిరో..
 జాలీమ్ కౌన్ రే.. ఉస్‌కా జులుం క్యా రే..’’
 అంటూ ఆ గళం గడీల రాజ్యంపై దండెత్తింది!
 ‘‘కత్తి మనది.. సుత్తి మనది.. పలుగు మనది..’’
 అంటూ సమస్త వృత్తులను ఏకం చేసింది!!
 ‘‘అసలేటి వానల్లో ముసలెడ్లు కట్టుకొని
 మోకాటి బురదల్లో మడిగట్లు దున్నితె
 గరిసెలెవ్వలివి నిండెరా.. గుమ్ములెవ్వలివి నిండెరా..’’
 అంటూ భూస్వామ్య దోపిడీని చీల్చి చెండాడింది!!
 ‘‘అయ్యోనివా నువు అవ్వోనివా..
 తెలంగాణోనికే తోటి పాలోనివా..’’
 అంటూ తెలంగాణ ధిక్కారాన్ని దిక్కులు పిక్కటిల్లేలా చేసింది!!
 ‘‘పుడితె ఒక్కటి.. సస్తె రెండు.. రాజిగ ఒరి రాజిగో
 ఇగ ఎత్తుర తెలంగాణ జెండా.. రాజిగ ఒరి రాజిగ..’’
 అంటూ తెలంగాణ ఉద్యమాగ్నిని రగిలించింది!!!


తెలంగాణ తొలిదశ పోరాట కాలం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు సాగిన ఆ పాటల పోరాట కెరటం ఆలసిపోయింది. పాటల్ని తూటాల్లా మలచి పల్లెల్లో విప్లవాగ్నిని రగిల్చిన ఆ గళం మూగబోయింది. జనం బాధలు, కష్టాలు, కన్నీళ్లకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ కలం ఇక సెలవంటూ వెళ్లిపోయింది. ప్రజాకవి, గాయకుడు గూడ అంజయ్య(62) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం హయత్‌నగర్ సమీపంలోని రాగన్నగూడలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నెల రోజుల క్రితం అనారోగ్యానికి గురవడం, పక్షవాతం రావడంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన అంజయ్య వారం కిందటే డిశ్చార్జి అయ్యారు. మంగళవారం డీహైడ్రేషన్‌తో నీరసించడంతో కుటుంబసభ్యులు డాక్టర్‌ను పిలిపించి ఇంట్లోనే వైద్యం అందించారు. అయినా ఫలితం లేకపోవడంతో సాయంత్రం అంజయ్య కన్నుమూశారు.

కుటుంబ నేపథ్యమిదీ..
అదిలాబాద్ జిల్లా దండపల్లి మండలం లింగాపూర్‌లో లస్మయ్య, లస్మమ్మ దంపతులకు నాలుగో సంతానంగా 1954, నవంబర్ 1న అంజయ్య జన్మించారు. అంజయ్యకు హేమానళినితో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు శ్రీలత, కవిత, మమత. వారిలో ఇద్దరికి పెళ్లి అయింది. అంజయ్య ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. పదో తరగతి, ఇంటర్మీడియట్ లక్సెట్టిపేటలో చదివారు. హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చేశారు. ఫార్మాసిస్టుగా ఉట్నూర్‌లో మొదటగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులు ఆదిలాబాద్‌లో కూడా పనిచేశారు. తర్వాత సినిమా పాటల రచనలో భాగంగా హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. అంజయ్య తల్లి లస్మమ్మ లింగాపూర్‌లోనే ఉంటోంది. అంజయ్యకు ఐదుగురు సోదరులు, ఒక సోదరి. ప్రస్తుతం ఒక సోదరుడు, సోదరి మిగిలారు. మిగతా వారు చనిపోయారు. అనారోగ్యానికి గురైనప్పట్నుంచీ అంజయ్య సాహిత్యానికి దూరంగా ఉంటున్నారు.

ఆ పాట విప్లవోద్యమ బావుటా..
అంజయ్య రాసిన పాటలు కోట్లాది మంది అణగారిన జనం గుండె చప్పుడుగా, సమాజంలోని ఆధిపత్య ధోరణిపై ఉక్కు పిడికిలిగా, దిక్కుమొక్కులేని జనానికి ఆలంబనగా నిలిచాయి. ఆయన రాసిన ‘ఊరు మనదిరా..’ పాట ఏకంగా 16 భాషల్లోకి అనువాదమైంది. తెలంగాణ పాటలకు బొడ్రాయిగా నిలిచిన ఆ పాట ఓ కొర్రాయిలా మండి దొరల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ పాట స్ఫూర్తితో ఎందరో యువకులు విప్లవోద్యమంలోకి దూకారు. ఇదే పాటను ఆఫ్రికా విముక్తి ఉద్యమంలో అక్కడ ఉద్యమకారులు తమ భాషలోకి మార్చుకొని పాడుకున్నారు. ‘అయ్యోనివా నువు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా...’ అంటూ అంజయ్య రాసిన పాట తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ‘ఊరు విడిచి నే పోదునా... ఉరి వేసుకొని సద్దునా...’ పాటలో తెలంగాణ కష్టాలను, బాధలను అంజయ్య ఏకరువు పెట్టాడు. ఆకలి చావులు, వలసవాదంపై ఆయన రాసిన ఎన్నో పాటలు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించాయి.

తెలంగాణ సాంస్కృతిక కళాకారులు అంజన్న పాటలను చంటిబిడ్డలా ఎత్తుకొని పల్లెపల్లెన ఆడారు, పాడారు. ఉద్యమ పాటలే కాకుండా సామాజిక సృ్పహతో అంజయ్య అనేక పాటలు రాశారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థులు ఢిల్లీ వె ళ్లే సమయంలో ‘భద్రం కొడుకో.. నా కొడుకో కొమురన్న.. జర పైలం కొడుకో..’ పాట రాశారు. ఆయన రాసిన పాటలు ఎర్రసైన్యం, స్వర్ణక్క, చీమలదండు, ఒసేయ్ రాములమ్మ, చీకటి సూర్యుడు, రైతురాజ్యం వంటి ఎన్నో సినిమాలకు ప్రాచూర్యం తెచ్చాయి. తొలినాళ్లలో విప్లవోద్యమంలో పాల్గొన్న అంజయ్య ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దగ్గరయ్యారు. దళిత, మహిళా పోరాటాల్లో కలిసి పనిచేశారు. అన్ని ప్రజాస్వామిక ఉద్యమాల్లో తన అస్తిత్వాన్ని చాటుకున్నారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం నాయకుడిగా పనిచేశారు.

చివరిదాకా పాటే శ్వాసగా..
1969 నాటి తెలంగాణ తిరుగుబాటు రోజులను అంజన్న ప్రత్యక్షంగా చూశారు. 16వ ఏట నుంచే విప్లవ సాహిత్యాన్ని చదివిన ఆయన.. దళిత కథలు కూడా రాశారు. ఎమర్జెన్సీలో జైలు జీవితాన్ని ఆ చీకటి రోజులను చూసి అనేక పాటలు రాశారు. ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకూ తన జీవిత సహచరి సహకారంతో పాటలను రాస్తూనే ఉన్నారు. 1970 నుంచి 1978 వరకు అంజయ్య రచించిన, పాడిన పాటలను కవితా సంకలనం పేరిట పుస్తకం విడుదల చేశారు. 1999లో ఆయన స్వీయరచనలో రూపొందించిన ‘ఊరు మనదిరా..’ పుస్తకం విడుదలైంది. పాటలతోపాటు నవలలు, నాటకాలు కూడా రచించాడు. నటుడిగా కూడా ప్రతిభ చాటుకున్నారు. ఎర్రసైన్యం, మాభూమి, దండోరా, చీకటి సూర్యులు వంటి సినిమాల్లో పలు పాత్రల్లో నటించారు.

కేసీఆర్‌ను చూడాలన్న కోరిక తీరకుండానే..
పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడాలనే కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట అంజయ్యను పరామర్శించేందుకు వస్తానని సీఎం కార్యాలయం సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమానళిని తెలిపారు.

స్వగ్రామానికి భౌతికకాయం
అంజయ్య భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి నాంపల్లిలోని గన్‌పార్క్ వద్దకు తీసుకొచ్చారు. కవులు, కళాకారులు, రచయితలు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియల కోసం భౌతికకాయాన్ని ఆదిలాబాద్ జిల్లాలోని స్వగ్రామానికి తరలించారు.

 అంజన్న పొందిన అవార్డులు..
► 1988లో రజనీ తెలుగు సాహితీ సమితి నుంచి అవార్డు
►1988లో సాహిత్య రత్న బిరుదు
► 2000లో గండెపెండేరా బిరుదు
► 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలయశ్రీ సాహితీ అవార్డు
► 2015లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ సాహిత్య పురస్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement