జేసీ సురేందర్‌రావును వేడుకుంటున్న లస్మవ్వ
మంచిర్యాల సిటీ: ప్రముఖ కవి, దివంగత గూడ అంజయ్య మాతృమూర్తి పరిస్థితి దయనీయంగా మారింది. మలిసంధ్యలో ఉన్న ఆమె అర్ధాకలితో అలమటిస్తోంది. పదెకరాల భూమి ఉన్నా.. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె భిక్షాటన చేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇది గమనించిన మాలమహానాడు నాయకులు సోమవారం జాయింట్ కలెక్టర్ వై. సురేందర్‌రావు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగుచూసింది. పదెకరాల భూమికి సంబంధించిన వివరాలు ఇస్తే న్యాయం చేస్తానని జేసీ ఆమెకు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన లస్మవ్వ విలేకరులతో మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నది. ‘నాకు పదెకరాల భూమి ఉండేది. దాంతోనే ఆరుగురు కొడుకులను, ఒక బిడ్డను పెంచి పెద్ద చేసిన. వాళ్లకు అన్నీ దగ్గరుండి చూసుకున్న. కొడుకులు చచ్చిపోయిండ్రు. ఒక్క బిడ్డ మాత్రమే ఉన్నది. కొడుకుల పిల్లలు ఉన్నరు. ఆరుగురిలో ఒకడు పదెకరాలను వాని పేరునే చేయించుకున్నడు. అంజయ్య రెండేళ్ల కిందటనే చచ్చిపాయే. అంజయ్య బతికి ఉన్నప్పుడే ఎవరు పట్టించుకోకపాయే. నేను కట్టుకున్న ఇంటిని కూడా వాళ్లే ఉంచుకున్నరు.
అక్కడిక్కడ అడుక్కొని యాన్నో ఓ కాడ ఉంటున్న. ఎవలన్న పాపమని బుక్కెడు పెడితే తింటున్న. లేదంటే కడుపు మాడ్చుకొని ఉంటున్న. ఈ వయసులో ఎసంటోళ్లకు కూడా ఇసొంటి తిప్పలు రావద్దు. ఎవరైనా ఎన్ని రోజులు పెడుతరు బిడ్డ. ఎందుకు బతుకుతున్నా అని బాధపడుతున్న. దేవుడు జెప్పన తీసుకపోతే మంచిగుండు..’అంటూ లస్మవ్వ ఆవేదన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment