final farewell
-
జాకిర్ హుస్సేన్‌కు ఘనంగా అంతిమ వీడ్కోలు
న్యూయార్క్: ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకిర్ హుస్సేన్ పార్థివ దేహాన్నిఅమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఖననం చేశారు. ఫెర్న్‌వుడ్ సిమెట్రీలో గురువారం ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు. అక్కడికి సమీపంలో జరిగిన సంతాప కార్యక్రమంలో శివమణి తదితర కళాకారులు డ్రమ్స్‌తో జాకిర్ హుస్సేన్‌కు సంగీత నివాళులరి్పంచారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న జాకిర్ హుస్సేన్(73) సోమవారం శాన్ఫ్రాన్సిస్కోలో కన్నుమూయడం తెలిసిందే. ఆయనకు తుది వీడ్కోలు పలికిన వారిలో కుటుంబసభ్యులు, సన్నిహితులతోపాటు సంగీత కళాకారులు, సంగీత ప్రేమికులు మొత్తం 300 మంది వరకు హాజరయ్యారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ శ్రీకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. పద్మ విభూషణ్ గ్రహీత ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ పార్థివ దేహంపై భారత జాతీయ పతాకాన్ని కప్పి, భారత ప్రభుత్వం, ప్రజల తరఫున నివాళులర్పించారు. జాకిర్ హుస్సేన్ భార్య ఆంటోనియా మిన్నెకొలా, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ప్రధాని మోదీ పంపిన సంతాప సందేశాన్ని చదివి వినిపించారు. భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచాన్ని విప్లవాత్మకంగా మార్చిన నిజమైన మేధావి జాకిర్ హుస్సేన్ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఇబ్రహీం రైసీకి ఇరాన్ వీడ్కోలు
టెహ్రాన్: హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలుకోల్పోయిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి దేశ రాజధాని టెహ్రాన్ ప్రజలు ఘన తుది వీడ్కోలు పలికారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లాహ్ అలీ ఖమేనీ సైతం నివాళులరి్పంచారు. బుధవారం సంతాప ర్యాలీలో టెహ్రాన్ సిటీ వీధుల గుండా భారీ వాహనం మీద రైసీ పారి్థవదేహాన్ని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ఇరానీయన్లు పాల్గొని తమ నేతకు తుది వీడ్కోలు పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ బుధవారం టెహ్రాన్ వెళ్లి రైసీకి నివాళులర్పించారు. మహిళా, మానవ హక్కుల హననానికి పాల్పడి ‘టెహ్రాన్ కసాయి’గా పేరుబడినందుకే రైసీ సంతాప ర్యాలీలో తక్కువ మంది పాల్గొన్నారని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానించింది. సంతాప ర్యాలీలో ఖమేనీ పక్కనే తాత్కాలిక దేశాధ్యక్షుడు మహమ్మద్ మొఖ్బర్ ఏడుస్తూ కనిపించారు. బుధవారం ఖమేనీ మినహా మాజీ దేశాధ్యక్షులెవరూ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనకపోవడం గమనార్హం. రైసీ మృతికి సంతాపంగా భారత్‌లోనూ ఒక రోజు సంతాపదినం పాటించారు. -
కిడ్నీ, కాలేయం దానం: ఏఎస్సై పాడె మోసిన సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట ఘటనలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఏఎస్సై మహిపాల్ రెడ్డి మృతి కి పోలీస్ శాఖ కన్నీటి నివాళి అర్పించింది. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో మహిపాల్ రెడ్డి కిడ్నీలు, కాలేయం దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయన దానం అనంతరం కిస్మత్‌పూర్‌లోని మహిపాల్ రెడ్డి నివాసం వద్ద అంత్యక్రియలు జరిగాయి. మహిపాల్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, పోలీసులు వచ్చారు. అదనపు డీజీపీ సజ్జనార్ మహిపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనంతో మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో మహిపాల్ రెడ్డి పాడెను సజ్జనార్ మోశారు. అంత్యక్రియల ఖర్చులకు సజ్జనార్ రూ.50 వేలు వ్యక్తిగత సహాయం చేశారు. మహిపాల్ రెడ్డి జీవితం నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని సజ్జనార్ తెలిపారు. విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పదేపదే చెప్తున్నా వినడం లేదని, మహిపాల్ రెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
బద్దం బాల్రెడ్డికి అంతిమ వీడ్కోలు
హైదరాబాద్: అశేష జనవాహిని అశ్రునయనాల మధ్య బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి అంత్యక్రియలను ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానంలో నిర్వహించారు. శాస్త్రయుక్తంగా నిర్వహించిన కార్యక్రమం అనంతరం చితికి ఆయన పెద్ద కుమారుడు నిప్పంటించారు. బద్దం బాల్‌రెడ్డి అంతిమయాత్ర బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బీజేపీ కార్యాలయానికి, అక్కడి నుంచి మెహిదీపట్నం, టోలిచౌకి, షేక్‌పేట్, రాయదుర్గం మీదుగా వైకుంఠ మహాప్రస్థానం వరకు కొనసాగింది. వేలాదిగా విచ్చేసిన జనం ఆయన కడసారి చూపు కోసం తెల్లవారుజాము నుంచే ఇంటి వద్ద బారులు తీరారు. తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ హోం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జానారెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు జి.కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు ఎంవి.మైసూరారెడ్డి, డీకే సమరసింహారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, నాయకులు ఎగ్గె మల్లెశం, ఎంఎస్ ప్రభాకర్ తదితరులు బద్దం భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. -
అంజయ్యకు కన్నీటి వీడ్కోలు
♦ గద్దర్, ఆర్.నారాయణమూర్తి తదితరుల నివాళి ♦ అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం బాధాకరం: మందకృష్ణ దండేపల్లి: ప్రజా కవి, గాయకుడు, రచయిత గూడ అంజయ్య (62)కు అభిమానులు బుధవారం అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. అనారోగ్యంతో మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచిన ఆయన పార్థివ దేహాన్ని బుధవారం తెల్లవారుజామున స్వగ్రామమైన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలంలోని లింగాపూర్ కు తీసుకొచ్చారు. ప్రజలు, కుటుంబీకులు, బంధువులు, అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు ఉంచారు. ప్రజాకవి గద్దర్, సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటి కొండ రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్కసుమన్, సీపీఎం నేతలు రాములు, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే ఎస్.రామలింగారెడ్డి, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, పలు దళిత సంఘాల నాయకులు, తెలంగాణ సాంస్కృతి సారథి కళాకారులు మృతదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. అనంతరం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంతక్రియలు నిర్వహించారు. కవిగా, గాయకునిగా దేశవ్యాప్త గుర్తింపు, ప్రజాదరణ పొందిన అంజయ్య అంత్యక్రియలను ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించకపోవడం చాలా బాధాకరమని మంద కృష్ణమాదిగ ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ఆయన ఇతర సామాజికవర్గానికి చెంది ఉంటే అంత్యక్రియలను ఎలా నిర్వహించి ఉండేవారో చెప్పనవసరం లేదన్నారు. తీరని లోటు: నారాయణమూర్తి కవి, గాయకుడు దళిత జాతి ముద్దుబిడ్డ గూడ అంజయ్య మరణం దేశానికే తీరని లోటని సినీనటుడు ఆర్.నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన రాసిన పాటలతో తన సినిమాలు విజయం సాధించాయన్నారు. అంజయ్యతో తనది విడదీయరాని అనుబంధమని గుర్తు చేసుకున్నారు. ‘దండేపల్లి’కి అంజయ్య పేరు: గద్దర్ అభిమానుల కోరిక మేరకు దండేపల్లి మండలానికి అంజన్న పేరు పెట్టాలని గద్దర్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బాల్క సుమన్ చెప్పారు. అంజయ్య కొన ఊపిరి దాకా సమాజం గురించే ఆలోచించిన మహోన్నతుడని సీపీఎం నేత రాములు పేర్కొన్నారు. -
మోహన్‌బాబుకు అంతిమ వీడ్కోలు
అధికార లాంచనాలతో జావాన్ మృతదేహానికి అంత్యక్రియలు కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు ఆమదాలవలస: తురకపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ మొయ్యి మోహన్‌బాబు(33) అంత్యక్రియలు నిర్వహించారు. అధికార లాంచనాలతో అంత్యక్రియలు జరిపారు. జమ్మూకశ్మీర్‌లో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మొయ్యి మోహన్‌బాబు మృతి చెందిన విషయం విదితమే. శుక్రవారం రాత్రి తురకపేటకు చేరుకున్న జవాన్ మృతదేహానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. అధికారులు, పోలీసు బలగాలు, నేవీ బలగాలు, కుటుంబ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు అంతిమ వీడ్కోలు పలికారు. తన కుటుంబ సభ్యులు గ్రామంలో తమ సొంత పొలంలో దహనసంస్కారాలు చేశారు. తొలుత స్థానిక తహసీల్దారు కె.శ్రీరాములు, సీఐ డి.నవీన్‌కుమార్ మృతదేహానికి పూలమాలవేశారు. అనంతరం ఇండియన్ నేవీ లెఫ్ట్‌నెంట్ ముప్తి మహమ్మద్ సయ్యద్, జిల్లా సైనిక సంక్షేమ సంస్థ అధికారి జి.సత్యానందం, ఎన్సీసీ మధర్ యూనిట్ అధికారి ఆర్.ప్రభుకుమార్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తర్వాత మృతుని భార్య మీనాక్షి చేతుల మీదుగా మృతదేహంపై జాతీయ జెండాను కప్పించారు. ఎచ్చెర్ల ఆర్మీ రిజర్వ్డ్ పోలీసులు, తూర్పు నేవీ దళం సిబ్బంది గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి అంత్యక్రియలు పూర్తిచేశారు. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు మోహన్‌బాబు ఆకస్మిక మరణంతో తురకపేట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుని భార్య మీనాక్షి, నాలుగేళ్ల కుమారుడు జశ్వంత్, మూడేళ్ల కుమార్తె కోమలితో పాటు తల్లి నాగమ్మ, తండ్రి చిన్నారావు, అన్నదమ్ములు మృతదేహం వద్ద రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ కార్యక్రమంలో ఆర్మీ సుబేధర్ భగత్ సింగ్, హవాల్దార్ కె.ఎల్.రెడ్డి, ఎక్స్ ఆర్మీ హవాల్దార్ ఇప్పిలి సిమ్మన్నతో పాటు అధిక సంఖ్యలో మృతుని స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. -
కామ్రేడ్ పాన్‌సరేకు లాల్‌సలాం!
వేలాది మంది అశ్రునయనాల మధ్య కమ్యూనిస్టు నేతకు అంతిమ వీడ్కోలు సాక్షి, ముంబై/కొల్హాపూర్: ప్రముఖ హేతువాది, సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, టోల్ పన్ను వ్యతిరేక ఉద్యమకారుడు గోవింద్ పాన్‌సరేకు వేలాది మంది తమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ నెల 16న కొల్హాపూర్‌లో దుండగుల కాల్పులకు గురైన పాన్సరే శుక్రవారం అర్థరాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మెరుగైన చికిత్స కోసం 82 ఏళ్ల పాన్సరేను కొల్హాపూర్ నుంచి శుక్రవారం ఉదయం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆయన ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం అధికం కావడంతో మరణించారని జేజే గ్రూప్ ఆస్పత్రుల డీన్ టీపీ లహానే ప్రకటించారు. ఆయన భౌతిక కాయాన్ని శనివారం మధ్యాహ్నం తిరిగి కొల్హాపూర్ తీసుకొచ్చారు. పాన్సరే హత్యను అన్ని రాజకీయ పక్షాలు ముక్త కంఠంతో ఖండించాయి. నిస్వార్థపరుడైన పాన్సరేను హత్య చేయడం హేయమైన చర్య అని రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు పేర్కొన్నారు. ఈ నేరానికి పాల్పడిన దుండగులను శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకోగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, పలువురు ఆయన మంత్రివర్గ సహచరులు, బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఐ, ఆర్పీఐ పార్టీల నేతలు ఆస్పత్రికి వెళ్లి నివాళులర్పించారు. పాన్సరే హత్యకు నిరసనగా, ఆయన హంతకులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలన్నీ ఆదివారం రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. బంద్‌కు సీపీఐ సమా అన్ని వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఎన్సీపీ, ఆర్పీఐ, ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని బీఆర్పీబీఎం పార్టీలు మద్దతు పలికాయి. ఓ ప్రగతిశీల నాయకుడిని మహారాష్ట్ర కోల్పోయిందని, పేదలకు న్యాయం చేకూర్చేందుకు ఆయన చేసిన పోరాటాన్ని రాష్ట్రం సదా గుర్తుంచుకుంటుందని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ పేర్కొన్నారు. పాన్సరే హత్యపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావ్ ఠాక్రే డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులు కాకుండా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రకాశ్ అంబేద్కర్ సూచించారు. ఎర్ర సముద్రాన్ని తలపించిన కొల్హాపూర్ కామ్రేడ్ పాన్‌సరేకు లాల్ సలాం అన్న నినాదాలతో కొల్హాపూర్ శనివారం హోరెత్తిపోయింది. పాన్సరే అంత్యక్రియలకు హాజరైన వేలాది మంది ప్రజలతో కొల్హాపూర్ పట్టణం ఎర్రసముద్రాన్ని తలపించింది.పంచగంగ నదీ తీరంలో పాన్సరే భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన కమ్యునిస్ట్ నాయకులు, కార్యకర్తలతో ఆ పరిసరాలు ఎరుపెక్కాయి. ‘రెడ్ సెల్యూట్ టూ పాన్సరే’, ‘లాల్ సలాం - పాన్సరే అమర్హ్రే’ అన్న నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. దసరా చౌక్‌లో అంతిమ దర్శనం కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. వేలాది మంది ఆయనను చివరిసారిగా చూసి నివాళులు అర్పించారు. సాయంత్రం మూడు గంటల తర్వాత పంచగంగ నదీతీరం వైపు అంతిమయాత్రను ప్రారంభించారు. నదీ తీరంలో పాన్సరే భౌతికకాయనికి ఆయన కోడలు మనమళ్ల చేతులమీదుగా దహన సంస్కారం పూర్తిచేశారు. విమానాశ్రయంలోనే ఒక గంటపాటు భౌతికకాయం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా గోవింద్ పాన్సరే భౌతికకాయం ఒక గంటపాటు విమానాశ్రయంలో ఉండిపోయింది. పాన్సరే మరణానంతరం శనివారం ఉదయం ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానంలో తరలించేందుకు ముంబై ఎయిర్‌పోర్ట్‌కు తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకగంట ఆలస్యంగా కొల్హాపూర్‌కు బయలుదేరాల్సి వచ్చిందని శాసన మండలి సభ్యుడు కపిల్ పాటిల్ ఆరోపించారు. ఒక్క అధికారి కూడా ఎయిర్పోర్ట్ వద్దకి రాలేదన్నారు. ఉదయం 10.20 గంటలకు తాము పాన్సరే భౌతిక కాయాన్ని ఎయిర్‌పోర్ట్‌కు తీసుకొచ్చామని, కానీ 11..54 గంటలకు కొల్హాపూర్‌కు ప్రత్యేక విమానం బయల్దేరిందని చెప్పారు. దీంతో తాము 12.55 గంటలకు కొల్హాపూర్ చేరుకున్నామన్నారు. కాల్పులు జరిపింది మరాఠీ భాషీయులే సాక్షి, ముంబై: గోవింద్ పాన్సరే దంపతులపై కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని భావిస్తున్నారు. గోవింద్ పాన్సరే సతీమణీ ఉమా పాన్సరే పోలీసులకు అందించిన వివరాల మేరకు కాల్పులు జరిపిన దుండగులు మరాఠీ భాషీయులేనని వెల్లడైంది. కోల్హపూర్‌లో చికిత్స పొందుతున్న ఆమె దర్యాప్తు అధికారితో మాట్లాడారు. ఈ నెల 16న తామిద్దరం వాహ్యాళికి వెళ్లిన ప్పుడు తమకు ఎదురైన దుండగులు ‘మోరే యెతే కుటే రహతాత్..? (మోరే ఎక్కడ ఉంటారు..?)’ అని ప్రశ్నించారు. అనంతరం సుమారు 15 నుంచి 17 నిమిషాలకు తాము ఇంటివైపు వెళ్లే సమయంలో మళ్లీ వారిద్దరు మోటర్‌సైకిల్ వచ్చి కాల్పులు జరిపారు’ అని ఆమె పేర్కొన్నారని పోలీసులు తెలిపారు. దుండగులు ముందుగా తన భర్త గోవింద్ పై కాల్పులు జరిపారని, ఆయనకు అడ్డుగా వెళ్లిన తనపై కూడా కాల్పులు జరిపారని చెప్పారు. -
నేదురుమల్లికి కన్నీటి వీడ్కోలు
వాకాడు (నెల్లూరు జిల్లా), న్యూస్‌లైన్: మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయన స్వగ్రామమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకాడులో అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రజల సందర్శనార్థం వాకాడులోని ఆయన ఇంటి ఆవరణలో పార్థివదేహాన్ని ఉంచారు. వేలాదిమంది అభిమానులు, పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు జనార్దన్‌రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర 5.10కి స్వర్ణముఖి నది వద్ద శ్మశానవాటికకు చేరుకుంది. జనార్దన్‌రెడ్డి చితికి ఆయన పెద్దకుమారుడు రామ్‌కుమార్‌రెడ్డి నిప్పంటించారు. హాజరైన పలువురు ప్రముఖులు: మాజీ సీఎం జనార్దన్‌రెడ్డి అంత్యక్రియలకు తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి జేడీ శీలం, ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, చింతామోహన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, సినీనటుడు మోహన్‌బాబు దంపతులు, పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, సీవీ శేషారెడ్డి, టీడీపీ నేతలు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులురెడ్డి, ముంగమూరు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వీసీ రాజారామిరెడ్డి హాజరయ్యారు. -
అంజలికి ‘అంతిమ’ వీడ్కోలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి అపనిందను మోస్తూ అడవిలో అష్టకష్టాలు పడినా బాధ్యతలకు దూరంకాకుండా తన కడుపులో పెరుగుతున్న శ్రీరామచంద్రుని వారసుల్ని కని పెంచి విద్యాబుద్దులు, విలువిద్యలు నేర్పించి వారిని తండ్రి చెంతకు చేర్చిన తరువాతే ఆ సాధ్వి తల్లి అయిన భూదేవి ఒడికి చేరుతుంది. ఆ సన్నివేశంలో అత్యంత సహజంగా నటించి రక్తికట్టించిన అంజలీదేవి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. నటిగా ఎంతో ఖ్యాతిగాంచిన అంజలీదేవి చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు. ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంజలి అంత్యక్రియలు నిర్వహించారు. అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది. -
రామానాయుడికి అంతిమ వీడ్కోలు
గుంటూరు మెడికల్, న్యూస్‌లైన్: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తండ్రి లగడపాటి వెంకటరామానాయుడు (75) సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గుంటూరులో నివాసముంటున్న రామానాయుడు అస్వస్థతకు లోనవడంతో నెలరోజుల క్రితం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించారు. ఊపిరితిత్తుల్లో నిమ్ముచేరి అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. వెంకటరామానాయుడు భౌతిక కాయాన్ని సోమవారం మధ్యాహ్నం గుంటూరు మంగళగిరిరోడ్డులోని సీతారామనగర్ మూడోలైన్లోని స్వగృహంలో సందర్శనార్ధం ఉంచారు. రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచంద్రరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, తెలుగుభాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా జడ్జి ఎస్.ఎం.రఫీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అవినాష్, ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, కేశినేని నాని, నరేంద్ర చౌదరి, గజల్ శ్రీనివాస్ తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఎంపీ లగడపాటిని, కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్దసంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. పెద్దకుమారుడు ఎంపీ లగడపాటి అంత్యక్రియలు నిర్వహించారు. వెంకటరామానాయుడుకు భార్య రామలక్ష్మమ్మ, ఓ కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు. కుమార్తె పద్మ భర్త భాస్కరరావు ల్యాంకో గ్రూప్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఎంపీగా, లగడపాటి శ్రీధర్ సినీనిర్మాతగా కొనసాగుతున్నారు. మూడో కుమారుడు మధుసూదన్ ల్యాంకో మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. -
నెల్సన్ మండేలా సంస్మరణ సభ
-
ఏవీఎస్‌కు కన్నీటి వీడ్కోలు
హైదరాబాద్, న్యూస్‌లైన్: హాస్యనటుడు, నిర్మాత, దర్శకుడు ఏవీ సుబ్రహ్మణ్యం(ఏవీఎస్)కు అభిమానులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. శనివారం మధ్యాహ్నం ఇక్కడి పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో ఏవీఎస్ కుమారుడు ప్రదీప్ కర్మకాండ నిర్వహించారు. తీవ్ర అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం ఏవీఎస్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం 9 గంటలకు ఏవీఎస్ పార్థివదేహాన్ని మణికొండలోని ఆయన ఇంటి నుంచి ప్రజల సందర్శనార్థం ఫిల్మ్ చాంబర్‌కు తరలించారు. ఏవీఎస్ మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఆయన భార్య ఆశ, కుమార్తె ప్రశాంతి, కుమారుడు ప్రదీప్, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. అంతకుముందు సినీ నటులు కోట శ్రీనివాసరావు, పరుచూరి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి ఏవీఎస్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఫిల్మ్ చాంబర్ నుంచి పంజగుట్ట శ్మశాన వాటిక వరకూ జరిగిన అంతిమ యాత్రలో భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పాల్గొన్నారు. ఏవీఎస్ అమర్ రహే! అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఫిల్మ్ చాంబర్లో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఏవీఎస్ భౌతికకాయానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏవీఎస్ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించిన వారిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మురళీమోహన్, దాసరినారాయణరావు, డి. రామానాయుడు, సీపీఐ కార్యదర్శి నారాయణ, మండలి బుద్ధప్రసాద్, ఎం. వెంకయ్యనాయుడు, రఘుబాబు, నాగబాబు, అల్లు అరవింద్, బ్రహ్మానందం, కృష్ణ, విజయనిర్మల, వెంకటేష్, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఎస్వీ.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సాయికుమార్, విజయ్‌చందర్, అశోక్‌కుమార్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జయసుధ, నన్నపనేని రాజకుమారి, శివాజీరాజా, శివకృష్ణ, దాసరి అరుణ్‌కుమార్, పరుచూరి గోపాలకృష్ణ, జమున, గద్దర్, ఆర్.నారాయణమూర్తి, నరేష్, కృష్ణుడు, తదితర ప్రముఖులు ఉన్నారు. ఏవీఎస్‌తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటనీరు పెట్టుకున్నారు.