Murali Nayak: మళ్లీ ఎప్పుడొస్తావ్‌ చిన్నోడా..? | Emotional Farewell To Martyred Jawan Murali Naik In Sathya Sai District, Photos Inside | Sakshi
Sakshi News home page

Murali Nayak: మళ్లీ ఎప్పుడొస్తావ్‌ చిన్నోడా..?

May 12 2025 7:48 AM | Updated on May 12 2025 11:03 AM

Emotional Farewell to Martyr Murali Naik

వీరజవాన్‌ మురళీనాయక్‌కు అంతిమ వీడ్కోలు 

 ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు 

భౌతికకాయం సందర్శించేందుకు తరలివచ్చిన ప్రజలు 

మార్మోగిన జయహో భారత్‌.. జైహింద్‌..  మురళి అమర్ రహే నినాదాలు

కన్నపేగు కన్నీటి వేదన చూసి.. పుట్టిన తండా నుంచి మంచు కొండల శిఖరాల వరకు గుండె తడి చేసుకుంది. సైనిక దుస్తుల్లో కన్నీళ్లను కనిపించకుండా చివరి వీడ్కోలు పలికిన సహచరులను చూస్తూ.. భరతజాతి యావత్తూ సెల్యూట్‌ చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లలో మెదులుతుండగా.. మన వీరుడి భౌతికకాయం చూసి యావత్‌ గూడెం గుండె తరుక్కుపోయింది. దేశాన్ని భద్రంగా గుండెల్లో దాచుకున్న వీరుడా.. ధీరుడా.. కోట్లాది హృదయాల్లో కొలువైన ఓ అమరుడా.. మన దేశం కోసం మళ్లీ ఎప్పుడు  జన్మస్తావ్‌.. అంటూ కల్లితండాతో పాటు యావత్‌ భారత్‌ ప్రార్థిస్తోంది.

సాక్షి, పుట్టపర్తి: కల్లితండా శోకసంద్రంగా మారింది. అగ్నివీర్ మురళీనాయక్‌ అంత్యక్రియలతో యావత్‌ భారతావని కల్లి తండా వైపు చూసింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా ఈ నెల 9న పాకిస్తాన్‌ ముష్కరుల తూటాలకు కశ్మీర్‌లో అశువులు బాసిన ముడావత్‌ మురళీనాయక్‌ అంత్యక్రియలు ఆదివారం ఉదయం  స్వగ్రామం కల్లితండాలో జరిగాయి. 11 గంటల తర్వాత ప్రభుత్వ, సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు. 

మురళితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. దేశం కోసం తండావాసి పోరాటం చేశాడనే గర్వం ఓ వైపు ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది. అగ్నివీర్ మురళీ నాయక్‌ భౌతికకాయం చూసేందుకు ఆదివారం ఉదయం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోప తండాలుగా తరలివచ్చారు. దారులన్నీ కల్లితండా వైపు సాగాయి. మురళీనాయక్‌తో పరిచయం లేకున్నా.. యుద్ధవీరుడు.. దేశం కోసం వీర మరణం పొందిన జవాన్‌ను కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు.  

కల్లితండా నుంచి కాశ్మీర్ వరకు.. 
మురళీనాయక్‌ జన్మించింది ఓ మారుమూల గ్రామం. గోరంట్ల మండల కేంద్రానికి సమీపంలోనే ఉంటుంది. జ్యోతిబాయి, శ్రీరామ్‌నాయక్‌ దంపతులు మురళి జన్మించిన తర్వాత సోమందేపల్లిలోని బంధువుల ఇంట వదిలి..     దంపతులిద్దరూ పొట్టచేత పట్టుకుని ముంబయి వలస వెళ్లారు. ఈ క్రమంలో మురళీనాయక్‌ సోమందేపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతపురంలో కళాశాల విద్య అభ్యసించి.. 2022లో.. 851 లైట్‌ రెజిమెంట్‌లో చేరాడు. తొలుత అసోంలో పని చేసి ఆ తర్వాత కశీ్మర్‌కు బదిలీ అయ్యాడు. పహల్గాంలో పాక్‌ ఉగ్రవాదుల దుశ్చర్య నేపథ్యంలో భారత్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. ఇరు దేశాల మధ్య సరిహద్దున (ఎల్‌ఓసీ – లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌) జరిగిన కాల్పుల్లో మురళీ   నాయక్‌ వీర మరణం పొందాడు. 

మువ్వన్నెల జెండా రెపరెపలు.. 
పాకిస్తాన్‌ ముష్కరులతో దేశం కోసం వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మురళీనాయక్‌ స్వగ్రామం కల్లితండాలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. మురళి భౌతికకాయం చూసేందుకు వచ్చిన వాళ్లలో చాలామంది జాతీయ జెండా చేత  పట్టుకుని ‘భారత్‌ మాతా కీ జై.. జోహార్‌ మురళీనాయక్‌.. మురళీనాయక్‌ అమర్‌ రహే.. జై హింద్‌.. అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఖబడ్దార్‌.. ఖబడ్దార్‌.. పాకిస్తాన్‌ ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. 

మళ్లీ ఎప్పుడొస్తావ్‌ చిన్నోడా..? 
కల్లి తండాలోని మురళీనాయక్‌ ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్‌ చేస్తూ ముందుకు సాగారు. ‘మళ్లీ ఎప్పుడొస్తావ్‌ చిన్నోడా? నీ పుట్టుక ఎవరికీ తెలియదు.. కానీ నీ మరణం యావత్‌ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు’ అంటూ గ్రామంలోని పలువురు చేయి పైకెత్తి నినదించారు. గోరంట్ల, గుమ్మయ్యగారిపల్లి, పుట్లగుండ్లపల్లి నుంచి కల్లి తండా వరకు జవాన్‌కు అశ్రు నివాళి తెలుపుతూ ఫ్లెక్సీలు వెలిశాయి.

‘ఎంతమంది వచ్చినా.. ఎంత డబ్బులు ఇచ్చినా.. మా కొడుకును తెచ్చి ఇవ్వలేరు కదయ్యా. ఒక్కగానొక్క సంతానం. దేశం కోసం ప్రాణాలు వదిలాడు. దేశం మొత్తం గర్వపడుతున్నా.. మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు. ఎవరిని చూసి ఆనందపడాలయ్యా’ 
– మురళినాయక్‌ తల్లి జ్యోతిబాయి

‘జోహార్‌ మురళి నాయక్‌. నీ ధైర్యం ఈ నేలకు గర్వ కారణం. నీ త్యాగం ఈ జాతి గుండెల్లో శాశ్వతం. నీ మరణం వృథా కాదు.’ 
– బెంగళూరు నుంచి అంత్యక్రియలకు 
వచ్చిన కాలేజీ స్నేహితుడు ఎస్‌.మహేందర్‌  

‘యావత్‌ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు. కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు.. ఎప్పుడొస్తాడు.. మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారూ.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు. ఆస్తులు, అంతస్తులు ఎవరి కోసం?’  
– మురళినాయక్‌ తండ్రి శ్రీరామ్‌నాయక్‌

‘ఈరోజు బార్డర్‌లో డ్యూటీ వేశారు. ఉదయం నా నుంచి కమ్యూనికేషన్‌ వస్తే నేను పునర్జన్మ ఎత్తినట్లే. ఏదైనా జరిగితే మా తల్లిదండ్రులను బాగా చూసుకో’  
– స్నేహితుడు వినోద్‌తో చివరిరోజున మురళీనాయక్‌ మాటలు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement