అంజలికి ‘అంతిమ’ వీడ్కోలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి అపనిందను మోస్తూ అడవిలో అష్టకష్టాలు పడినా బాధ్యతలకు దూరంకాకుండా తన కడుపులో పెరుగుతున్న శ్రీరామచంద్రుని వారసుల్ని కని పెంచి విద్యాబుద్దులు, విలువిద్యలు నేర్పించి వారిని తండ్రి చెంతకు చేర్చిన తరువాతే ఆ సాధ్వి తల్లి అయిన భూదేవి ఒడికి చేరుతుంది.
ఆ సన్నివేశంలో అత్యంత సహజంగా నటించి రక్తికట్టించిన అంజలీదేవి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. నటిగా ఎంతో ఖ్యాతిగాంచిన అంజలీదేవి చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు.
ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంజలి అంత్యక్రియలు నిర్వహించారు.
అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.