lavakusha
-
లవకుశ నాగరాజు ఇక లేరు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రాల్లో ‘లవకుశ’ ఒకటి. ఈ చిత్రంలో లవుడి పాత్రలో అలరించిన అనపర్తి నాగరాజు (71) ఇక లేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో శ్వాస సంబంధిత వ్యాధితో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. యన్టీఆర్ శ్రీరామునిగా, అంజలీ దేవి సీతగా నటించిన ‘లవకుశ’ చిత్రానికి సి.పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో లవుడి పాత్రలో నాగరాజు, కుశుడి పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు దాటినా ఇప్పటకీ వారు లవ, కుశలుగానే గుర్తింపు పొందారు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండూ కలగలిపిన లవుడి పాత్రలో నాగరాజు చక్కగా నటించారు. నాగరాజు తండ్రి ఏవీ సుబ్బారావు సినీ నటుడు. అలా నాగరాజు కూడా నటుడిగా రంగప్రవేశం చేశారు. చిన్నప్పుడే నాగరాజుకి నాటకాలంటే ఇష్టం. సుబ్రహ్మణ్యం, నాగరాజు కలిసి కొన్ని నాటకాల్లో కూడా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు నాగరాజు. యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నారు నాగరాజు. ‘సీతారామ కల్యాణం’లో లక్ష్మణుడిగా, ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో పద్మావతి దేవి తమ్ముడిగా.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలు మానుకున్నాక హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో నాగరాజు పూజారిగా చేయడం మొదలుపెట్టారు. ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. ఆయనకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు డి. సురేష్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు. -
ఆకర్షణలకు లొంగకండి
మీరు లక్ష్యసాధన దిశగా వెళ్ళేటప్పుడు మీరు ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేవి రెండుంటాయి. అవి హిత శత్రువు, అహిత శత్రువు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహిత శత్రువు–అది శత్రువని తెలిసిపోతూనే ఉంటుంది. తెలిసికూడా ప్రమాదం చేస్తుంది. హిత శత్రువు మనిషిని ఆకర్షించి నాశనం చేస్తుంది.నేను ఒక ప్రసంగం చేయాలి. చేయబోయే ముందు దేని గురించి ఏమేం మాట్లాడాలో కొంతసేపు ఆలోచించుకుని సిద్ధం కావాలనుకుంటా. ఆ ప్రయత్నంలో కాసేపు కళ్ళుమూసుకుని ఆలోచించడం మొదలుపెడతా..అలా మొదలుపెట్టానో లేదో ‘‘వినుడు వినుడు రామాయణ గాథ...’’అంటూ పెద్దగా ఓ పాట వినిపించింది. ఎక్కడినుంచి అని నాభార్యను అడిగితే పక్కింటి టివిలోనుంచి అని చెప్పింది. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఛానల్లో లవకుశ సినిమా పాట వస్తున్నట్లుందనుకుని మా ఇంట్లో టివి ఆన్ చేసా. ‘లవకుశ’ సినిమానే వస్తున్నది. ఇక అన్నీ మానేసి ఆ సినిమా చూస్తూ కూర్చున్నా. మూడున్నర గంటల తరువాత సినిమా అయిపోగానే ఈ లోకంలోకి వచ్చా. అలసటగా అనిపించి కాస్త తిని పడుకున్నా. లేచేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ప్రసంగానికి వెళ్ళే సమయం సమీపిస్తుండడంతో గబగబా బయల్దేరివెళ్ళా. సరే. చేరుకున్నా. కానీ ఏం మాట్లాడాలి? సిద్ధం కాలేదుగా... అదే హిత శత్రువు. అప్పటికి మనసుకు సంతోషంగా కనబడుతుంది. కానీ పాడు చేసేస్తుంది. దాన్ని గెలవాలంటే మనోబలం ఉండాలి. లక్ష్యం మీకు జ్ఞాపకం వస్తూ ఉండాలి. అకాలంలో అనవసర విషయాల జోలికి వెళ్ళడం అంటే జీవితాలను పాడు చేసుకోవడమే. అక్కరలేని వయసులో సెల్‌ఫోన్. అర్థంలేని మెసేజ్‌లు, వీడియోలు చూసుకోవడం, పనికిమాలిన గ్రూపుల్లో ఉండడం. ఏ లక్ష్యం లేకుండా అస్తమానూ వీథులవెంట తిరగడం... ఏ పనీ లేదు కాబట్టి పక్కింటివాడిని కలిసి కబుర్లాడడం... కాసేపు మంచి పుస్తకం ఎందుకు చదువుకోవు? మంచి విషయాలు ఎందుకు ధ్యానం చేయవు? నీ చదువు నీవు చదువుకుంటూ కూడా నీ మనసుకు నచ్చిన మంచి హాబీలు.. వీటిని విలాసవిద్యలంటారు. వీటిని అభ్యాసం చేయవచ్చు. నీ చదువు నీవు చదువుకుంటూ...ఒక మృదంగం, ఒక వేణువాయిద్యం, ఒక కర్ణాటక సంగీతం... అలా ఏదయినా అభ్యసించవచ్చు. ఒకప్పడు ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఆచార్యుడు, గొప్ప వైద్యుడు అయిన శ్రీపాద పినాక పాణి గారు సంగీతంలో నిష్ణాతుడై చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు. చిట్టచివరకు మహావృద్ధుడై మరణశయ్యపై ఉండి కూడా నేదునూరి కృష్ణ్ణమూర్తిగారిలాంటి విద్వాంసులు, పలువురు శిష్యులు ఆయన మంచం పక్కన నిలబడి కీర్తనలు పాడుతుంటే వింటూ ప్రాణత్యాగం చేసారు. ఆయన ప్రఖ్యాత వైద్యుడయికూడా విలాసవిద్యను కష్టపడి నేర్చుకుని అంత స్థాయికి ఎదిగారు. అందుకే మనిషి తనను ఆకర్షించి పాడుచేసే వాటి వైపుకి వెళ్ళకూడదు. నిగ్రహించుకోగలిగే శక్తి ఉండాలి. అలాగే మీ చదువు మీరు చదువుకుంటూ మీ అభీష్టం మేరకు ఏదో ఒక మంచి విలాసవిద్య నేర్చుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించవచ్చు. లేదా పదిమందికి ఉపకారం చేయడానికి మీరేం చేయగలరో అది చేయండి. ఉపకారం చేయాలన్న భావన ఉండాలే కానీ చెయ్యడానికి లక్ష మార్గాలున్నాయి. విద్యార్థులుగా, ఉడుకు నెత్తురుమీదున్న యువతగా మీ సమయాన్ని వథా చేసుకోకుండా దిశానిర్దేశం మీరే చేసుకుని అటువైపుగా కృషిచేసుకుంటూ సాగిపోవాలన్నదే కలాంగారి అభిమతం. ఇది మీ వ్యక్తిత్వ నిర్మాణానికి, మీ కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే ఉపకరించేదికాదు. జాతినిర్మాణానికి సంబంధించినంత ప్రాధాన్యతగల అంశం. ఆలోచించి మసలుకోండి. -
ఇంకా నా యందు సందేహమేనా...
మలుపు తిప్పిన సన్నివేశం లవకుశ లవకుశలో ప్రతి సన్నివేశం కీలకమైనదే. కాని సీత మీద అనుమానంతో రాముడు ఆమెను అడవులకు పంపే సన్నివేశం మాత్రం విలక్షణమైనది. కథకు వెన్నెముక వంటిది. ఏం జరగబోతోందో రాముడికీ లక్ష్మణునికీ తెలుసు. కాని ఏమి అనుభవించబోతోందో సీతకు తెలియదు. మాతృసమానురాలైన సీతను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టడం లక్ష్మణునికి ఇష్టం లేదు. అలాగని అన్న ఆజ్ఞను ధిక్కరించలేడు. గుండె రాయి చేసుకొని సీత ఉన్న రథాన్ని కారడవులలోకి మళ్లించాడు. అప్పుడు సీతకు, లక్ష్మణునికి మధ్య సాగిన సన్నివేశం తరతరాలకు నిలిచిపోతుంది. సీతాదేవి: నాయనా... లక్ష్మణా! ఇదేమిటి దారి తప్పలేదు కదా? లక్ష్మణుడు: నట్టడవి పోయేవారికి దారి తెన్నూ ఏమిటి తల్లి! సీతాదేవి: అదేమిటి లక్ష్మణా! నీ మొహం కళా విహీన మై చిన్నబోయింది? ఈ పుణ్యాశ్రమ దర్శనం నీకు ఆనందదాయకం కాదా? లేక మీ అన్నగారి ఇష్టంలేని అరణ్యసందర్శన కోరినందుకు కోపమా? లక్ష్మణుడు: ఎంత మాట తల్లీ! పరమ పావని... మాతృసమానురాలివైన నీ మీద నాకు కోపమా తల్లి...! కుసుమ కోమలివైన నీ కష్టాలు తలుచుకుంటే నా మనసులో పొంగే పరితాపం సీత: నాకే కష్టం లేదు లక్ష్మణా! ఈ అరణ్యవాసం నాకు అలవాటైందే కదా! ఈ ప్రకృతి సౌందర్యం ఈ మనోహరారణ్యం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొకప్పుడు నా జీవితకాలమంతా ఇక్కడే గడిపేయాలన్న బుద్ధి పుడుతూ ఉంటుంది. లక్ష్మణుడు (ఏడుస్తూ): అమ్మా! సీతాదేవి: (లక్ష్మణుడిని చూస్తూ) ఆ... అదేంటి లక్ష్మణా! అకారణంగా దుఃఖిస్తున్నావు! లక్ష్మణుడు: నా పాపిష్టి జన్మకు దుఃఖం కాక సంతోషం ఎలా వస్తుందమ్మా? సీతాదేవి: నా మనసు భయాందోళితమవుతోంది! ఎవరికి ఏ ఆపద వచ్చిందో చెప్పు నాయనా! లక్ష్మణుడు: ఆపద కాదు తల్లీ... అపవాదు.. సీతాదేవి: అపవాదమా! నా పైనా? లక్ష్మణా నీవు పొరపాటుగా వినలేదు కదా! లక్ష్మణుడు: లేదు తల్లీ.. సత్యమే చెబుతున్నా! రామాజ్ఞ దాటలేని దుర్బలుడిని అగుట చేత నీ వంటి మహాసాధ్విని అడవుల పాలు జేసిన మహాపాపానికి ఒడిగట్టుకున్నాను తల్లీ! సీతాదేవి: రామాజ్ఞ! రామాజ్ఞా (ఏడుస్తూ) ... తండ్రి రామచంద్రా! ఎంతటి నిర్దయుడివి అయ్యావు, మనసు ఎలా రాయిచేసుకున్నావు, ఇంకా నాయందు సందేహమేనా! లక్ష్మణుడు: తల్లీ! రామచంద్రునకు నీ యందు సంశయము గానీ సందేహము గానీ లేదు. తాను రాజుగా ఉండి రఘువంశ కీర్తికి కళంకం రానీయకూడదని ఇలా చేయవలసి వచ్చిందమ్మా. సీతాదేవి: లక్ష్మణా! అర్ధాంగిని, గర్భవతిని నన్ను అడవి పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇనుమడిస్తుందా? అదీ గాక శ్రీరామచంద్రుడు రాజైతే నేను రాణిని కానా? నాకా బాధ్యత లేదా? నేను మాత్రం ఆయనకి అపకీర్తి రానిస్తానా లక్ష్మణా?(ఏడుస్తూ) లక్ష్మణుడు: అమ్మా! సాక్షాత్ ధర్మస్వరూపిణివి అయిన నీకు ఏం చెప్పగలను తల్లీ! సీతాదేవి: ధర్మస్వరూపులు మీ అన్నగారు, మీ తాతముత్తాతలు గానీ నా వంటి నిర్భాగ్యురాలికి ధర్మం ఎక్కడ ఉంది నాయనా? నేనెంత పాపినైనా నన్ను చేర పిలిచి, జరిగిన సంగతి చెప్పి, నన్ను ఆజ్ఞాపిస్తే అడవులకే కాదు, అగ్నిలో దూకమన్నా నేను వెనుదీస్తానా! ఇందుకేనా నన్ను అగ్నిపరీక్ష చేశారు? ఇందుకేనా అయోధ్యకు తీసుకువచ్చారు? అయ్యో ఇంకెందుకీ పాడు జన్మ! ఆ గంగలో పడి హతమారితే తీరిపోతుంది. లక్ష్మణుడు: అమ్మా నా మీద ఆన! సీతాదేవి: లక్ష్మణా! లక్ష్మణుడు: అంత సాహసం చేయకు తల్లీ, సాహసం చేయకు. సీతాదేవి: నా రామచంద్రుడిని చూసే భాగ్యం లేక పోయిన తరువాత నాకెందుకు లక్ష్మణా ఈ బ్రతుకు? లక్ష్మణుడు: నీ గర్భస్థమైన రవి వంశ వర్ధనుని కోసం తల్లి! సీతాదేవి: నేను వెలి అయితే నా శిశువు అర్హుడవుతాడా! అదీ గాక లోకులకు నా మొహం ఎలా చూపించను! నిన్నెందుకు శ్రీరాముడు త్యజించాడంటే ఏమని చెప్పుకోను! ఇంకెలా జీవించను? లక్ష్మణుడు: అమ్మా రామచంద్రుడు తన హృదయం తనే త్రుంచి వేసినట్టు అర్ధాంగివి గనుక నిన్ను దూరం చేసుకుని ఘోర బాధ అనుభవిస్తున్నాడు. తాను మాత్రం నిన్ను విడిచి ఓర్వగలడా తల్లి. సీతాదేవి: అవును లక్ష్మణా.. అవును వడలు తెలియని దుఃఖంలో ఉండబట్టలేక శ్రీరామచంద్రుడిని అనరాని మాటలన్నా. రామపాదారవింద సేవకు దూరమవడటం నా పురాకృత ప్రారబ్ధం. నేను కష్టాలకే పుట్టాను. నాకు సుఖపడే రాత ఎలా వస్తుంది? లక్ష్మణుడు: అమ్మా నీవంటి లోకోత్తర చరితను నట్టడవిలో ఎట్లా దిగవిడిచి పోగలను! కఠోరమైన రామాజ్ఞను ఎట్లా దాటగలను. నన్ను మన్నించు తల్లీ! మన్నించు. లక్ష్మణుడు: ప్రతి దినమేను కొలుగొంత పాదములంటి నమస్కరించి నీ అతులితమైన జీవనలందిచరింతు తదీయ భావ్యమే గతి యెడబాయె ఇంకెప్పుడు గాంతు పదపద్మముల్ నమశ్శతములు చేయునమ్మా కడసారి గ్రహింపుము జానకి సతి... జానకీసతి తల్లీ సెలవు (అంటూ ఆమెను విడిచి వెళ్లిపోతాడు) - శశాంక్ -
విలన్‌గా బ్రహ్మానందం
బ్రహ్మానందం ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయి, ప్రేక్షకుల్ని నవ్వించేస్తారు. మరి.. ఆయన విలన్‌గా చేస్తే? ఎలా ఉంటుందో ‘లవకుశ’ చిత్రంలో చూడొచ్చు. వరుణ్ సందేశ్ హీరోగా జయశ్రీ శివన్ దర్శకత్వంలో సంగారెడ్డి పేట ప్రకాశ్, వి. సత్యమోహన్‌రెడ్డి, పండుబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం కోసం బ్రహ్మానందం, ప్రభాస్ శ్రీను తదితరులపై చిత్రీకరించిన ప్రచార గీతాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్ సందేశ్ మాట్లాడుతూ - ‘‘నేను తొలిసారి రెండు పాత్రలు చేసిన చిత్రం ఇది. ఈ చిత్రం నాకు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘బ్రహ్మానందంగారిని సంప్రదించినప్పుడు ఇప్పటికి వెయ్యి సినిమాలకు పైగా చేశా.. ఏదైనా వెరైటీ కారెక్టర్ ఉంటే చెప్పమన్నారు. ఈ పాత్ర గురించి చెప్పగానే అంగీకరించారు’’ అని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో శేఖర్ విఖ్యాత్, కాసర్ల శ్యామ్, రామ్‌నారాయణ్ తదితర చిత్రబృందం పాల్గొన్నారు. -
అంజలికి ‘అంతిమ’ వీడ్కోలు
తమిళ సినిమా, న్యూస్‌లైన్ : వెండితెర సీతమ్మగా బాసిల్లిన అలనాటి మేటి నటి అంజలీ దేవికి గురువారం కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె భౌతికకాయానికి గురువారం అంత్యక్రియలు ఘనంగా జరిగాయి. లవకుశ చిత్రంలో సీతమ్మ తల్లి అపనిందను మోస్తూ అడవిలో అష్టకష్టాలు పడినా బాధ్యతలకు దూరంకాకుండా తన కడుపులో పెరుగుతున్న శ్రీరామచంద్రుని వారసుల్ని కని పెంచి విద్యాబుద్దులు, విలువిద్యలు నేర్పించి వారిని తండ్రి చెంతకు చేర్చిన తరువాతే ఆ సాధ్వి తల్లి అయిన భూదేవి ఒడికి చేరుతుంది. ఆ సన్నివేశంలో అత్యంత సహజంగా నటించి రక్తికట్టించిన అంజలీదేవి నిజ జీవితంలోనూ పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. నటిగా ఎంతో ఖ్యాతిగాంచిన అంజలీదేవి చివరి రోజుల్లో ఆధ్యాత్మిక బాటలో పయనించి ధన్యురాలయ్యూరు. ఈ నట శిరోమణికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అభిమానులు, సినీ ప్రముఖులు అంతిమవీడ్కోలు పలికారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు చెన్నై బీసెంట్ నగర్‌లోని శ్మశాన వాటికలో సంప్రదాయ బద్ధంగా అంజలి అంత్యక్రియలు నిర్వహించారు. అంజలీ దేవి భౌతిక కాయాన్ని సందర్శించడానికి అభిమానులు బారులు తీరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు భద్రతను ఏర్పాటు చేసింది.