ఇంకా నా యందు సందేహమేనా...
మలుపు తిప్పిన సన్నివేశం
లవకుశ
లవకుశలో ప్రతి సన్నివేశం కీలకమైనదే. కాని సీత మీద అనుమానంతో రాముడు ఆమెను అడవులకు పంపే సన్నివేశం మాత్రం విలక్షణమైనది. కథకు వెన్నెముక వంటిది. ఏం జరగబోతోందో రాముడికీ లక్ష్మణునికీ తెలుసు. కాని ఏమి అనుభవించబోతోందో సీతకు తెలియదు. మాతృసమానురాలైన సీతను అడవుల్లోకి తీసుకెళ్లి వదిలిపెట్టడం లక్ష్మణునికి ఇష్టం లేదు. అలాగని అన్న ఆజ్ఞను ధిక్కరించలేడు. గుండె రాయి చేసుకొని సీత ఉన్న రథాన్ని కారడవులలోకి మళ్లించాడు. అప్పుడు సీతకు, లక్ష్మణునికి మధ్య సాగిన సన్నివేశం తరతరాలకు నిలిచిపోతుంది.
సీతాదేవి: నాయనా... లక్ష్మణా! ఇదేమిటి దారి తప్పలేదు కదా?
లక్ష్మణుడు: నట్టడవి పోయేవారికి దారి తెన్నూ ఏమిటి తల్లి!
సీతాదేవి: అదేమిటి లక్ష్మణా! నీ మొహం కళా విహీన మై చిన్నబోయింది?
ఈ పుణ్యాశ్రమ దర్శనం నీకు ఆనందదాయకం కాదా? లేక మీ అన్నగారి ఇష్టంలేని అరణ్యసందర్శన కోరినందుకు కోపమా?
లక్ష్మణుడు: ఎంత మాట తల్లీ! పరమ పావని... మాతృసమానురాలివైన నీ మీద నాకు కోపమా తల్లి...! కుసుమ కోమలివైన నీ కష్టాలు తలుచుకుంటే నా మనసులో పొంగే పరితాపం
సీత: నాకే కష్టం లేదు లక్ష్మణా! ఈ అరణ్యవాసం నాకు అలవాటైందే కదా! ఈ ప్రకృతి సౌందర్యం ఈ మనోహరారణ్యం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఒక్కొకప్పుడు నా జీవితకాలమంతా ఇక్కడే గడిపేయాలన్న బుద్ధి పుడుతూ ఉంటుంది.
లక్ష్మణుడు (ఏడుస్తూ): అమ్మా!
సీతాదేవి: (లక్ష్మణుడిని చూస్తూ) ఆ... అదేంటి లక్ష్మణా! అకారణంగా దుఃఖిస్తున్నావు!
లక్ష్మణుడు: నా పాపిష్టి జన్మకు దుఃఖం కాక సంతోషం ఎలా వస్తుందమ్మా?
సీతాదేవి: నా మనసు భయాందోళితమవుతోంది! ఎవరికి ఏ ఆపద వచ్చిందో చెప్పు నాయనా!
లక్ష్మణుడు: ఆపద కాదు తల్లీ... అపవాదు..
సీతాదేవి: అపవాదమా! నా పైనా? లక్ష్మణా నీవు పొరపాటుగా వినలేదు కదా!
లక్ష్మణుడు: లేదు తల్లీ.. సత్యమే చెబుతున్నా! రామాజ్ఞ దాటలేని దుర్బలుడిని అగుట చేత నీ వంటి మహాసాధ్విని అడవుల పాలు జేసిన మహాపాపానికి ఒడిగట్టుకున్నాను తల్లీ!
సీతాదేవి: రామాజ్ఞ! రామాజ్ఞా (ఏడుస్తూ) ... తండ్రి రామచంద్రా! ఎంతటి నిర్దయుడివి అయ్యావు, మనసు ఎలా రాయిచేసుకున్నావు, ఇంకా నాయందు సందేహమేనా!
లక్ష్మణుడు: తల్లీ! రామచంద్రునకు నీ యందు సంశయము గానీ సందేహము గానీ లేదు.
తాను రాజుగా ఉండి రఘువంశ కీర్తికి కళంకం రానీయకూడదని ఇలా చేయవలసి వచ్చిందమ్మా.
సీతాదేవి: లక్ష్మణా! అర్ధాంగిని, గర్భవతిని నన్ను అడవి పాలు చేస్తే రఘువంశ కీర్తి ఇనుమడిస్తుందా? అదీ గాక శ్రీరామచంద్రుడు రాజైతే నేను రాణిని కానా? నాకా బాధ్యత లేదా?
నేను మాత్రం ఆయనకి అపకీర్తి రానిస్తానా లక్ష్మణా?(ఏడుస్తూ)
లక్ష్మణుడు: అమ్మా! సాక్షాత్ ధర్మస్వరూపిణివి అయిన నీకు ఏం చెప్పగలను తల్లీ!
సీతాదేవి: ధర్మస్వరూపులు మీ అన్నగారు, మీ తాతముత్తాతలు గానీ నా వంటి నిర్భాగ్యురాలికి ధర్మం ఎక్కడ ఉంది నాయనా? నేనెంత పాపినైనా నన్ను చేర పిలిచి, జరిగిన సంగతి చెప్పి, నన్ను ఆజ్ఞాపిస్తే అడవులకే కాదు, అగ్నిలో దూకమన్నా నేను వెనుదీస్తానా! ఇందుకేనా నన్ను అగ్నిపరీక్ష చేశారు? ఇందుకేనా అయోధ్యకు తీసుకువచ్చారు? అయ్యో ఇంకెందుకీ పాడు జన్మ! ఆ గంగలో పడి హతమారితే తీరిపోతుంది.
లక్ష్మణుడు: అమ్మా నా మీద ఆన!
సీతాదేవి: లక్ష్మణా!
లక్ష్మణుడు: అంత సాహసం చేయకు తల్లీ, సాహసం చేయకు.
సీతాదేవి: నా రామచంద్రుడిని చూసే భాగ్యం లేక పోయిన తరువాత నాకెందుకు లక్ష్మణా ఈ బ్రతుకు?
లక్ష్మణుడు: నీ గర్భస్థమైన రవి వంశ వర్ధనుని కోసం తల్లి!
సీతాదేవి: నేను వెలి అయితే నా శిశువు అర్హుడవుతాడా! అదీ గాక లోకులకు నా మొహం ఎలా చూపించను! నిన్నెందుకు శ్రీరాముడు త్యజించాడంటే ఏమని చెప్పుకోను! ఇంకెలా జీవించను?
లక్ష్మణుడు: అమ్మా రామచంద్రుడు తన హృదయం తనే త్రుంచి వేసినట్టు అర్ధాంగివి గనుక నిన్ను దూరం చేసుకుని ఘోర బాధ అనుభవిస్తున్నాడు. తాను మాత్రం నిన్ను విడిచి ఓర్వగలడా తల్లి.
సీతాదేవి: అవును లక్ష్మణా.. అవును వడలు తెలియని దుఃఖంలో ఉండబట్టలేక శ్రీరామచంద్రుడిని అనరాని మాటలన్నా. రామపాదారవింద సేవకు దూరమవడటం నా పురాకృత ప్రారబ్ధం. నేను కష్టాలకే పుట్టాను. నాకు సుఖపడే రాత ఎలా వస్తుంది?
లక్ష్మణుడు: అమ్మా నీవంటి లోకోత్తర చరితను నట్టడవిలో ఎట్లా దిగవిడిచి పోగలను!
కఠోరమైన రామాజ్ఞను ఎట్లా దాటగలను.
నన్ను మన్నించు తల్లీ! మన్నించు.
లక్ష్మణుడు: ప్రతి దినమేను కొలుగొంత పాదములంటి నమస్కరించి
నీ అతులితమైన జీవనలందిచరింతు తదీయ భావ్యమే గతి యెడబాయె
ఇంకెప్పుడు గాంతు పదపద్మముల్
నమశ్శతములు చేయునమ్మా కడసారి గ్రహింపుము
జానకి సతి... జానకీసతి
తల్లీ సెలవు
(అంటూ ఆమెను విడిచి వెళ్లిపోతాడు)
- శశాంక్