మీరు లక్ష్యసాధన దిశగా వెళ్ళేటప్పుడు మీరు ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేవి రెండుంటాయి. అవి హిత శత్రువు, అహిత శత్రువు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహిత శత్రువు–అది శత్రువని తెలిసిపోతూనే ఉంటుంది. తెలిసికూడా ప్రమాదం చేస్తుంది. హిత శత్రువు మనిషిని ఆకర్షించి నాశనం చేస్తుంది.నేను ఒక ప్రసంగం చేయాలి. చేయబోయే ముందు దేని గురించి ఏమేం మాట్లాడాలో కొంతసేపు ఆలోచించుకుని సిద్ధం కావాలనుకుంటా. ఆ ప్రయత్నంలో కాసేపు కళ్ళుమూసుకుని ఆలోచించడం మొదలుపెడతా..అలా మొదలుపెట్టానో లేదో ‘‘వినుడు వినుడు రామాయణ గాథ...’’అంటూ పెద్దగా ఓ పాట వినిపించింది. ఎక్కడినుంచి అని నాభార్యను అడిగితే పక్కింటి టివిలోనుంచి అని చెప్పింది. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఛానల్‌లో లవకుశ సినిమా పాట వస్తున్నట్లుందనుకుని మా ఇంట్లో టివి ఆన్ చేసా. ‘లవకుశ’ సినిమానే వస్తున్నది. ఇక అన్నీ మానేసి ఆ సినిమా చూస్తూ కూర్చున్నా. మూడున్నర గంటల తరువాత సినిమా అయిపోగానే ఈ లోకంలోకి వచ్చా. అలసటగా అనిపించి కాస్త తిని పడుకున్నా. లేచేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ప్రసంగానికి వెళ్ళే సమయం సమీపిస్తుండడంతో గబగబా బయల్దేరివెళ్ళా. సరే. చేరుకున్నా. కానీ ఏం మాట్లాడాలి? సిద్ధం కాలేదుగా... అదే హిత శత్రువు. అప్పటికి మనసుకు సంతోషంగా కనబడుతుంది. కానీ పాడు చేసేస్తుంది. దాన్ని గెలవాలంటే మనోబలం ఉండాలి. లక్ష్యం మీకు జ్ఞాపకం వస్తూ ఉండాలి.
అకాలంలో అనవసర విషయాల జోలికి వెళ్ళడం అంటే జీవితాలను పాడు చేసుకోవడమే. అక్కరలేని వయసులో సెల్‌ఫోన్. అర్థంలేని మెసేజ్‌లు, వీడియోలు చూసుకోవడం, పనికిమాలిన గ్రూపుల్లో ఉండడం. ఏ లక్ష్యం లేకుండా అస్తమానూ వీథులవెంట తిరగడం... ఏ పనీ లేదు కాబట్టి పక్కింటివాడిని కలిసి కబుర్లాడడం... కాసేపు మంచి పుస్తకం ఎందుకు చదువుకోవు? మంచి విషయాలు ఎందుకు ధ్యానం చేయవు? నీ చదువు నీవు చదువుకుంటూ కూడా నీ మనసుకు నచ్చిన మంచి హాబీలు.. వీటిని విలాసవిద్యలంటారు. వీటిని అభ్యాసం చేయవచ్చు. నీ చదువు నీవు చదువుకుంటూ...ఒక మృదంగం, ఒక వేణువాయిద్యం, ఒక కర్ణాటక సంగీతం... అలా ఏదయినా అభ్యసించవచ్చు.
ఒకప్పడు ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఆచార్యుడు, గొప్ప వైద్యుడు అయిన శ్రీపాద పినాక పాణి గారు సంగీతంలో నిష్ణాతుడై చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు. చిట్టచివరకు మహావృద్ధుడై మరణశయ్యపై ఉండి కూడా నేదునూరి కృష్ణ్ణమూర్తిగారిలాంటి విద్వాంసులు, పలువురు శిష్యులు ఆయన మంచం పక్కన నిలబడి కీర్తనలు పాడుతుంటే వింటూ ప్రాణత్యాగం చేసారు. ఆయన ప్రఖ్యాత వైద్యుడయికూడా విలాసవిద్యను కష్టపడి నేర్చుకుని అంత స్థాయికి ఎదిగారు. అందుకే మనిషి తనను ఆకర్షించి పాడుచేసే వాటి వైపుకి వెళ్ళకూడదు. నిగ్రహించుకోగలిగే శక్తి ఉండాలి. అలాగే మీ చదువు మీరు చదువుకుంటూ మీ అభీష్టం మేరకు ఏదో ఒక మంచి విలాసవిద్య నేర్చుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించవచ్చు. లేదా పదిమందికి ఉపకారం చేయడానికి మీరేం చేయగలరో అది చేయండి. ఉపకారం చేయాలన్న భావన ఉండాలే కానీ చెయ్యడానికి లక్ష మార్గాలున్నాయి. విద్యార్థులుగా, ఉడుకు నెత్తురుమీదున్న యువతగా మీ సమయాన్ని వథా చేసుకోకుండా దిశానిర్దేశం మీరే చేసుకుని అటువైపుగా కృషిచేసుకుంటూ సాగిపోవాలన్నదే కలాంగారి అభిమతం. ఇది మీ వ్యక్తిత్వ నిర్మాణానికి, మీ కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే ఉపకరించేదికాదు. జాతినిర్మాణానికి సంబంధించినంత ప్రాధాన్యతగల అంశం. ఆలోచించి మసలుకోండి.
ఆకర్షణలకు లొంగకండి
Published Sun, Jun 24 2018 1:33 AM | Last Updated on Sun, Jun 24 2018 1:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment