సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్‌లో మొదలవుతుందని చెప్పారు.
దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment