తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన పౌరాణిక చిత్రాల్లో ‘లవకుశ’ ఒకటి. ఈ చిత్రంలో లవుడి పాత్రలో అలరించిన అనపర్తి నాగరాజు (71) ఇక లేరు. హైదరాబాద్ గాంధీనగర్‌లోని తన నివాసంలో శ్వాస సంబంధిత వ్యాధితో సోమవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. యన్టీఆర్ శ్రీరామునిగా, అంజలీ దేవి సీతగా నటించిన ‘లవకుశ’ చిత్రానికి సి.పుల్లయ్య, సి.ఎస్. రావు దర్శకత్వం వహించారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో లవుడి పాత్రలో నాగరాజు, కుశుడి పాత్రలో సుబ్రహ్మణ్యం నటించారు. ఆ సినిమా వచ్చి 50 ఏళ్లు దాటినా ఇప్పటకీ వారు లవ, కుశలుగానే గుర్తింపు పొందారు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండూ కలగలిపిన లవుడి పాత్రలో నాగరాజు చక్కగా నటించారు.
నాగరాజు తండ్రి ఏవీ సుబ్బారావు సినీ నటుడు. అలా నాగరాజు కూడా నటుడిగా రంగప్రవేశం చేశారు. చిన్నప్పుడే నాగరాజుకి నాటకాలంటే ఇష్టం. సుబ్రహ్మణ్యం, నాగరాజు కలిసి కొన్ని నాటకాల్లో కూడా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో 340కు పైగా చిత్రాల్లో నటించారు నాగరాజు. యన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రాల్లో సుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో తన నటనతో ఆకట్టుకున్నారు నాగరాజు. ‘సీతారామ కల్యాణం’లో లక్ష్మణుడిగా, ‘వెంకటేశ్వర మహాత్మ్యం’లో పద్మావతి దేవి తమ్ముడిగా.. ఇలా పలు చిత్రాల్లో నటించారు. సినిమాలు మానుకున్నాక హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో నాగరాజు పూజారిగా చేయడం మొదలుపెట్టారు. ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించారు. ఆయనకి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. నాగరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు, తెలుగు టీవీ రచయితల సంఘం అధ్యక్షుడు డి. సురేష్ కుమార్ తదితరులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment