ముట్టడిలో దండకారణ్యం
అభిప్రాయం
భారీనీటి ప్రాజెక్టుల కింద భూమి కోల్పోవడమే కాకుండా ముంపునకు గురవుతామని, పైగా ఇవన్నీ అత్యంత నైపుణ్యంతో కూడిన సాంకేతికజ్ఞానంతో నిర్మాణమవుతాయి గనుక ఉపాధి అవకాశం కూడా లేదని దండకారణ్యం ఆదివాసులు ప్రతిఘటిస్తున్నారు.
ఛత్తీస్‌గఢ్‌లో 2014 ఎన్నికల్లో మూడోసారి రమణసింగ్ బీజేపీ ప్రభుత్వం ఏర్పడటమే కాకుండా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం రావడంతో సాల్వా జుడుం వంటి ఫాసిస్టు శక్తులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. మోదీ నవపూర్ రాయపూర్‌కు, దంతెవాడకు వచ్చి మావోయిస్ట్టులకు ‘తుపాకులు వదిలి నాగళ్లు పట్టుకోండి’ అని హితవు చెప్పిన నోటితోనే బహుళజాతి కంపెనీలను ఛత్తీస్‌గడ్‌కు వచ్చి పరిశ్రమలు నెలకొల్పవలసిందిగా ఆహ్వానం పలికాడు. అడవి, నీరు, ఖనిజాల తవ్వకాలకు సకల సదుపాయాలు, పరిశ్రమల నిర్మాణాలకు సకల రాయితీలు సమకూర్చి పెడతానని హామీపడ్డాడు.
జైస్వాల్ అండ్‌కో కంపెనీ, వేదాంత, జిందాల్, ఎస్సార్, టాటా వంటి బహుళజాతి కంపెనీలకు దండకారణ్యాన్ని కట్టబెట్టే ఈ విధ్వంసకరమైన అభివృద్ధి నాగళ్లు పట్టగల చేతులను నరికేస్త్తున్నది. కాళ్లకింద నేలను తొలిచేస్తున్నది. ఉనికిని కాపాడుకోవడానికి కాళ్లకింద నేల కోల్పోకుండా సాముచేస్తున్న ఆదివాసీ ప్రజలను మావోయిస్టులంటూ నిత్యం ఎన్‌కౌంటర్లు చేస్తున్నది. గత రెండుమూడు నెలల్లోనే కనీసం అరవైమంది ఆదివాసీ యువకులను బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపేశారు.
ఇది కేవలం చర్యలు, ప్రతిచర్యల దశ కాదు. 2009లో అంటే మన్మోహన్‌సింగ్ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రారంభమైన గ్రీన్‌హంట్ ఆపరేషన్ పేరిట ప్రజలమీద యుద్ధం ఇపుడు మూడవదశకు చేరుకున్నది. ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్ వంటి పేర్లతో గతంలో సీఆర్‌పీఎఫ్ డైరైక్టర్ జనరల్ విజయకుమార్ సారధ్యంలో జరిగిన కేంద్ర అర్ధసైనిక బలగాల దాడులు ఇపుడు ఆయన ప్రత్యేక సలహాదారుగా, ఐజీ ఎన్‌ఆర్ కల్లూరి నాయకత్వంలో తీవ్రతరమయ్యాయి.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సి.60 కమాండోలు, నారాయణపూర్ నుంచి మాడ్ దాకా సీఆర్‌పీఎఫ్ క్యాంపులు, ఇటు దంతెవాడ, బీజాపూర్, సుకుమా జిల్లాల్లో అడుగడుగుకు పోలీసు క్యాంపులే కాదు, సైనిక శిక్షణాలయాలు నెలకొల్పుతున్నారు. ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన చోదక రహిత విమానాల నుంచి అడవిలో రసాయనిక బాంబులు విసురుతున్నారు. గ్రామాలు తగులబెడుతున్నారు. మహిళ లను సామూహికంగా లైంగిక అత్యాచారానికి గురిచేస్తున్నారు.
ఇపుడు బేలాభాటియా జగదల్పూరునుంచి చేసిన అధ్యయ నాలు, పట్టుదలతో రిజిస్టర్ చేయించిన ఎఫ్‌ఐఆర్‌లు చూసినా, జగదల్పూరులో ఉన్న న్యాయవాదులు శాలిని గెరా, ఇషా ఖండేవాల్ బాధిత ఆదివాసులకు న్యాయసహాయం చేయ డానికి చేస్తున్న ప్రయత్నాలు చూసినా, పత్రికారచయిత మాలి నీ సుబ్రహ్మణ్యం ఏటికి ఎదురీది చేసిన కృషి చూసినా దండ కారణ్యంలో ఎంత బీభత్స దృశ్యమున్నదో అర్థమవుతున్నది.
మాలినీ సుబ్రహ్మణ్యంకు తాను చూసిన వాస్తవాలు రాయడమే ఒక పోరాటమయింది. అందుకామె ఇంటిపై దాడి చేసి వారం రోజుల్లో ఇల్లువదిలి వెళ్లకపోతే చంపేస్తామన్నారు. వదలక తప్పలేదు. ఎక్కడో తలదాచుకోవాల్సి వచ్చింది. కేవలం ఆదివాసుల కేసులే చేపట్టి న్యాయ సహాయం చేయతలపెట్టిన న్యాయవాదులు స్థానికులు కాదని స్థానిక బార్ అసోసియేషన్ కూడా బహిష్కరించింది. బేలాభాటియా ఛత్తీస్‌గఢ్‌లో, ముఖ్యంగా బస్తర్‌లో పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ వేయడానికి చేసేదే పెద్ద పోరాటమని, వేయగలిగితే అదే విజయమని ఇక్కడ బాసగూడ ఘటన తర్వాత జరిగిన ఒక రౌండ్‌టేబుల్ సమావేశంలో చెప్పింది.
మరి సోనీసోరి ఎక్కడికి పోతుంది? విచిత్రమేమంటే వీళ్లెవరూ మావోయిస్టులు కాదు. మావోయిస్టు సానుభూతిపరులు కూడా కాదు. సోనీసోరి ఒక ధనికరైతు కూతురు. తండ్రి ఒకప్పుడు మావోయిస్టుల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నవాడే. ఆమె ఉపాధ్యాయురాలు. అంటే ఆదివాసీ విద్యావంతురాలు. ఆమె ఎస్సార్ కంపెనీకి మావోయిస్ట్టులకు మధ్యన కంపెనీ పైప్‌లైన్ అడ్డుకోకుండా ఉండడానికి దౌత్యం చేసిందని కేసుపెట్టి అరెస్టుచేసి, దారుణమైన లైంగిక చిత్రహింసలకు గురిచేసి దీర్ఘకాలం హింసానిర్బంధాల తర్వాత సుప్రీంకోర్టు జోక్యం వల్ల వదిలేశారు.
ఆమె బయటికివచ్చి ద్విగుణీకృతమైన పట్టు దలతో ఆదివాసుల కోసం పనిచేస్తున్నది. నిన్నకాక మొన్న ఆమె జగదల్పూర్‌నుంచి ఒక మిత్రురాలితో మోటారు సైకిల్‌పై వస్తుంటే ఆమెమీద యాసిడ్‌దాడి జరిగింది. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. అవి ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలని, ఆమెకు చూపు నిలుస్తుందా అన్నది అనుమానమే అని అంటున్నారు. సోనీసోరీ మిగతావాళ్ల వలె ఛత్తీస్‌ఘడ్ వదిలి ఎక్కడికీ వెళ్లలేకపోవచ్చు. కానీ ఆమెకు దేశమంతా వచ్చిన గుర్తింపు వల్ల, ఉపాధ్యాయురాలైనందువల్ల, ఇప్పటికే సుప్రీంకోర్టు, ఎయిమ్స్ వంటి సంస్థల దృష్టినాకర్షించింది కనుక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆదివాసులపక్షాన పోరాడడానికి ఆమె కూడా బయటికి వెళ్లగలదు.
దంతేవాడలో ఆశ్రమం ధ్వంసం చేస్తే హిమాంశు, యూఏపీఏ కింద అరెస్టుచేసి రాజద్రోహనేరం పెట్టి జీవితఖైదు వేస్తే డాక్టర్ వినాయక్‌సేన్ బెయిల్‌పొంది ఛత్తీస్‌గఢ్ బయట ఉండి తమ ప్రజాస్వామిక ఉద్యమాలను నిర్వహించవచ్చు. కాని గడ్చిరోలి, బస్తర్, ఛత్తీస్‌గఢ్, ఒడిస్సా, విశాఖ అడవుల్లోని ఆదివాసులు ఎక్కడికి పోగలరు? ఒక డ్యాం వస్తే, ఒక ఉక్కుఫ్యాక్టరీ వస్తే, వేదాంత, పోస్కోలు వస్తే, బాక్సైట్ గనుల తవ్వకాలకు దుబాయ్ కంపెనీలు వస్తే ఆదివాసులు ఎక్కడికి పోగలరు? మనకు బాగా పరిచయమైన దృష్టాంతం చెప్పాలంటే వాకపల్లి, భల్లగూడ ఆదివాసీ మహిళలవలె సీఆర్‌పీఎఫ్ సామూహిక లైంగిక అత్యాచారాన్ని ప్రతిఘటించి పోరాడి, సాంఘిక బహిష్కరణకు గురై, ప్రభుత్వాల, న్యాయస్థానాల హృదయకవాటాలను తట్టి మళ్లీ వెళ్లి పోరాటమార్గమే ఎంచుకోవడం తప్ప ఏం చేయగలరు? ఇరాన్ విప్లవకాలంలో మహిళలపై జరిగిన లైంగికహింస గురించి ‘చిత్రహింసల కొలిమిలో’ అనే పుస్తకంలో (నవత, యువక అనువాదం) ఆ స్త్రీలు అది కూడా ఒక రాజ్యహింసారూపంగా భావించి ధిక్కరించిన తీరును గగుర్పాటు కలిగేలా చెప్తారు.
ఇవ్వాళ బస్తర్‌లో లైంగిక అత్యాచారం (రేప్) సర్వసాధారణమైన హింసోన్మాద విధానమైపోయిందని, పార్వతి, సోమి, కోసి వంటి ఎందరో ఇది దాచుకోవాల్సిన అభిమానం కాదు, ప్రకటించవలసిన అత్యాచారం అని గుర్తించి ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నారంటుంది బేలాభాటియా.
తమకోసమే కాకుండా మన కోసం, భవిష్యత్ తరాలకోసం ప్రకృతిసంపదను, మానవశ్రమను గౌరవాన్ని కాపాడడానికి తమ ప్రాణాలొడ్డి గ్రీన్‌హంట్ ఆపరేషన్ మూడవదశలో భాగంగా జరుగుతున్న రాజ్యహింసను, సల్వాజుడుం దాడులను ప్రతిఘటిస్తున్న దండకారణ్య ఆదివాసులకోసం పైన పేర్కొన్న ప్రజాస్వామికవాదుల వలె స్పందించవలసిన బాధ్యతనైనా పొరుగున ఉన్న బుద్ధిజీవులు, ప్రజాస్వామిక వాదులు నిర్వహిస్తారా? ముఖ్యంగా తెలుగుసమాజం మళ్లీ ఒకమారు ఈ మూడోదశ ప్రజలపై యుద్ధాన్ని ఎలుగెత్తి ఖండించాలని విజ్ఞప్తి.
- వరవరరావు
వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు
ఇమెయిల్: varavararao@yahoo.com