సాక్షి, భద్రాద్రి : ఏడాది కాలంగా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడంలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా అంటూ ఓ బాధితురాలు ప్రశ్నించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించి తనకు న్యాయం చేసేవారు లేరా అని అర్థించారు. వివరాలు.. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన ఐతం సోనీ గత ఏడాది అక్టోబర్ 20వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. మరుసటి రోజు ఈ విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే అక్కడి ఎస్‌ఐ రాంచరణ్ దొంగతనం కేసు నిలవదంటూ తప్పుదోవ పట్టించి అత్యాచారం కేసు పెట్టించాడు. దీంతో బాలకృష్ణ తనకు, సోనీకి మధ్య అక్రమ సంబంధం ఉందంటూ ప్రచారం చేశాడు.
ఈ ప్రచారంతో గ్రామంలో పరువు పోయిందంటూ సోనీతో పాటు ఆమె భర్త శ్రీనివాస్‌లు గ్రామం విడిచి వెళ్లిపోయారు. తమతో తప్పుడు ఫిర్యాదు చేయించారంటూ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీని సైతం కలిశారు. అయినా లాభం లేకపోవడంతో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవగా ఆయన ఎస్‌ఐ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొన్ని రోజులు సస్పెండ్ చేసి తిరిగి పోస్టింగ్ ఇచ్చారు. గ్రామంలో అవమానం భారం తాళలేక సోనీ, శ్రీనివాస్‌లు ఆత్మహత్యాయత్నం కూడా చేశారు. కలెక్టర్ విచారణకు ఆదేశించగా..విచారణ కమిటీ సోనీకి అనుకూలంగానే నివేదిక ఇచ్చింది. ఎస్‌ఐపై మాత్రం ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం ఎస్పీని కలిసేందుకు వచ్చినా సిబ్బంది కలవనీయకపోవడంతో బాధితురాలు ఎస్పీ కార్యాలయం ముందు బైఠాయించింది. త్రీటౌన్ సీఐ షుకూర్ బాధిత మహిళకు నచ్చజెప్పి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. రెండు రోజుల్లో న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment