సబ్‌డివిజన్ స్థాయిలో త్వరలోనే | Subdivision level as soon as possible | Sakshi
Sakshi News home page

సబ్‌డివిజన్ స్థాయిలో త్వరలోనే

Published Tue, Jan 6 2015 4:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

సబ్‌డివిజన్ స్థాయిలో త్వరలోనే - Sakshi

సబ్‌డివిజన్ స్థాయిలో త్వరలోనే

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘‘జిల్లాలో ఇటీవలి కాలంలో కుటుంబ కలహాలతో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. భార్యాభర్త, తల్లితండ్రి, ప్రేమికులు, బంధువులు, సన్నిహితులు.. ఇలా పలువర్గాల మధ్య మానవసంబంధాలు దెబ్బతిని ఘర్షణలు జరుగుతున్నాయి. వీటి నివారణకుగాను త్వరలోనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సబ్‌డివిజన్ స్థాయిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.’’ అని అంటున్నారు జిల్లా ఎస్పీ తాడిపర్తి ప్రభాకర్‌రావు. ఈ కౌన్సెలింగ్ సెంటర్లలో సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులను కౌన్సెలర్లుగా నియమించి కుటుంబ, మానవసంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని చెబుతున్నారాయన. సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా జిల్లాప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా పలు అంశాలపై ఎస్పీ ప్రభాకరరావు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే....
 
 సాక్షి: నూతన సంవత్సరంలో పోలీసింగ్ ఎలా ఉండబోతోంది? జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంది?
 ఎస్పీ: జిల్లా ప్రజలందరూ ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వారి శ్రేయస్సే లక్ష్యంగా కొత్త ఏడాది మా పోలీసింగ్ ఉండబోతోంది. జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగానే అమలవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా ఎలాంటి ఘటనలు లేకుండానే ముగిశాయి. గత ఏడాది కన్నా జాతీయ రహదారి - 65పై ప్రమాదాలు కూడా తగ్గాయి. అన్ని రకాల నేరాలను అదుపులోనికి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం శ్రమిస్తోంది. జిల్లా ప్రజలంతా ఆనందంగా ఉండేలా శాంతిభద్రతలను పరిరక్షించే కోణంలోనే మా పోలీసింగ్ ఉంటుంది.
 
 సాక్షి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా మీ కార్యకలాపాల్లో ఏమైనా మార్పులు తెచ్చి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం జరుగుతోందా?
 ఎస్పీ: ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలేవీ చేపట్టాలన్న ప్రణాళిక లేకపోయినా ప్రజలకు చేరువయ్యేందుకు మావంతు కృషి చేస్తున్నాం. త్వరలోనే జిల్లాలోని ప్రతి పోలీస్‌స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రిసెప్షన్ కౌంటర్లలో మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఉంచి స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా పనిచేయదల్చుకున్నాం.
 
 జిల్లాలో ఇటీవలి కాలంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలను పరిశీలిస్తే మానవ సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలతో ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు గాను సబ్‌డివిజన్ స్థాయిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాం. త్వరలోనే వీటిని పునఃప్రారంభించి కౌన్సెలింగ్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఇందుకోసం రిటైర్డ్ టీచర్ల లాంటి గౌరవప్రద వృత్తుల్లో ఉన్న వారిని నియమించుకుంటాం. ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్‌లతో పాటు మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు గాను ప్రత్యేక దృషి పెట్టాం.
 
 సాక్షి: మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక సౌకర్యాల కోసం జిల్లాలోని పీఎస్‌లలో పైలట్ ప్రాజెక్టు ఏమైనా చేపట్టారా?
 ఎస్పీ: అవును. జిల్లావ్యాప్తంగా పది పోలీస్‌స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లకు రెస్ట్‌రూమ్‌లు ఏర్పాటు చేసే ప్రణాళిక రూపొందించాం. ఇందుకోసం స్టేషన్‌కు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్‌లో రెస్ట్‌రూమ్‌లో విశ్రాంతి తీసుకునేందుకు బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు కట్టిస్తాం. మేళ్లచెరువు, నల్లగొండ టూటౌన్, నేరేడుచర్ల, నార్కట్‌పల్లి, చిట్యాల, మిర్యాలగూడ వన్‌టౌన్, భువనగిరి టౌన్, సూర్యాపేట, గుడిపల్లి పీఎస్‌లతో పాటు జిల్లా హెడ్‌క్వార్టర్లలో ఈ రెస్ట్‌రూంలు నిర్మిస్తున్నాం.
 
 సాక్షి: యాదగిరిగుట్ట అభివృద్ధిలో పోలీసుశాఖ పరంగా ఏం చేస్తున్నారు?
 ఎస్పీ: యాదగిరిగుట్ట అభివృద్ధి తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్‌శాఖ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా గుట్టలో మహిళా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. చైన్‌స్నాచింగ్, వ్యభిచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాదగిరికొండకు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. సర్కిల్‌ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు లేదానలుగురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో ఈ స్టేషన్ పనిచేస్తుంది. ట్రాఫిక్ నియంత్రణకు కూడా తగినంత మంది కావాలని ప్రభుత్వాన్ని కోరతాం. ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది.
 
 సాక్షి: జాతీయ రహదారిపై ప్రమాదాల పరిస్థితి ఎలా ఉంది?
 ఎస్పీ: గత ఏడాదితో పోలిస్తే ఎన్‌హెచ్-65పై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది కన్నా 18శాతం ప్రమాదాలు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే, జాతీయరహదారిపై కొన్ని నిర్మాణపరంగా మార్పులు జరగాల్సి ఉం ది. ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు కూడా కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. అయితే, జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ముఖ్యంగా పబ్లిక్‌లో మార్పు రావాలి. ప్రాణం చాలా విలువైనదన్న భావన జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు దాటేవారు, వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు మరింత తగ్గుతాయి.

 సాక్షి: ఇటీవలి కాలంలో మావోల పేరిట జిల్లాలో అక్కడక్కడా పోస్టర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో మావోల కార్యకలాపాలే
 వైనా మీ దృష్టికి వచ్చాయా?
 ఎస్పీ: పోలీస్‌శాఖ పరంగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలున్నాయని మేమయితే భావించడం లేదు. అయితే, ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల మావోల పేరుతో పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే, అవి నిజంగా మావోలవా లేక ఆకతాయిలు, బెదిరింపులకు పాల్పడేవారు చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. పసిగట్టేందుకు సమయం పట్టవచ్చు. కానీ, నల్లగొండలో ఆర్‌ఎస్‌యూ పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరగాల్సి ఉంది. అయితే, దీనిని ఆర్‌ఎస్‌యూ సానుభూతిపరులే ఏర్పాటు చేశారా లేక ఇతర విద్యార్థి సంఘాల నేతల పనా అనేది నిఘాలో తేలుతుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement