special police
-
ఢిల్లీలో రూ. 2 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ: ఢిల్లీలోని రమేష్ నగర్లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. గురవారం ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్‌ను పట్టుబడింది. పట్టుబడిన కొకైన్ విలువ రూ. 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. వారం రోజుల్లో ఇప్పటివరకు సుమారు 7 వేల కోట్ల విలువైన కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.ఢిల్లీ స్పెషల్ పోలీసులు జీపీఎస్ ద్వారా డ్రగ్స్ సరఫరాదారుని ట్రాక్ చేసి.. పశ్చిమ ఢిల్లీలోని రమేష్ నగర్లో ఓ వ్యక్తిని పట్టుకున్నారు. నిందితులు లండన్‌కు పరార్ అయినట్లు తెలిపారు. అక్కడ లభించిన డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల్లో రూ. 7,500 కోట్ల విలువైన 762 కిలోల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఇక.. గత వారం ఢిల్లీలో 500 కిలోల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలో దాడులు చేసి.. డ్రగ్స్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని విమానాశ్రయంలో జస్సీ అలియాస్ జితేంద్ర పాల్ సింగ్‌ను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అతను లండన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు. వీరికి దేశంలోని పలు నేరాలు, అక్రమ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న పాన్ ఇండియా నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. -
కశ్మీర్లో ఉగ్ర దాడి.. పోలీసు వీరమరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో పోలీసు అధికారి ఒకరు నేలకొరగగా, సీఆర్పీఎఫ్ జవాను గాయపడ్డారు. ఈ ఘటన పుల్వామా జిల్లా పింగ్లానా ప్రాంతంలో తనిఖీల సమయంలో చోటుచేసుకుంది. వీరమరణం పొందిన పోలీసును స్పెషల్ పోలీస్ విభాగానికి చెందిన జావిద్ అహ్మద్ దార్గా గుర్తించారు. క్షతగాత్రుడైన జవానును ఆస్పత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో అదనపు బలగాలను రంగంలోకి దించి, పారిపోయిన ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఉగ్రదాడిని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, రాజకీయ పార్టీలు ఖండించాయి. మరోఘటన.. షోపియాన్ జిల్లా బస్కచాన్ ప్రాంతంలో చేపట్టిన కార్డన్ సెర్చ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన షోపియాన్ జిల్లా నౌపొరా వాసి అహ్మద్ భట్ హతమయ్యాడు. -
730 మంది టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లు ఏఆర్‌కు మార్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) మార్పు ప్రక్రియకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఇటీవల కొత్తగా 3,805 మంది బెటాలియన్‌లో చేరడంతో 2005, 2006, 2007 బ్యాచ్‌లకు చెందిన 730 మంది కానిస్టేబుళ్లను టీఎస్ఎస్పీ శుక్రవారం రిలీవ్ చేసింది. వీరంతా శనివారం వారికి కేటాయించిన జిల్లా యూనిట్లలో రిపోర్టు చేశారు. దీనికి సంబంధించిన ఆదేశాలను గతేడాది డిసెంబరులోనే ప్రభుత్వం జారీ చేసినప్పటికీ సిబ్బంది కొరత కారణంగా అవి అమలు కాలేదు. 2008, 2009 బ్యాచ్‌ల కానిస్టేబుళ్ల ఏఆర్ కన్వర్షన్‌కు సంబంధించిన ఫైల్‌ను కూడా ఉన్నతాధికారులు ఆమోదించారని సమాచారం. -
ఎన్నికలపై అధికారుల డేగ కన్ను..
మద్దూరు (కొడంగల్) : ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు పెట్టే ఖర్చు పర్యవేక్షణకు అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల ఏర్పాట్లు అక్రమ మద్యం, డబ్బు పంపిణీ, ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, అనుమతి లేకుండా ప్రచార కార్యక్రమాలు చేపట్టడం లాంటి వాటిని నిరోధించేందుకు ఎనిమిది రకాల బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. వీరు ప్రతీ అంశాన్ని నేరుగా పరిశీలకులు, ఎన్నికల అధికారికి సమాచారమిస్తారు. ఈ మేరకు ఆయా బృందాల వివరాలు, పనితీరుపై ప్రత్యేక కథనం. వ్యయ పరిశీలకులు వ్యయపరిశీలకులుగా ఐఏఎస్, ఐఆర్ఎస్, సెంట్రల్ ఎక్సైజ్ అధికారులను నియమించారు. ప్రతీ జిల్లాకు నియోజకవర్గాల సంఖ్యకనుగుణంగా పరిశీలకులను నియమించారు. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు నులుగురు వ్యయ పరిశీలకులను నియమించారు. నిఘా బృందాలు ఈ బృందాలు నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ఉంటాయి. జిల్లాలో ఒక్కో నియోజవర్గానికి మూడు నుంచి నాలుగు చొప్పున చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో డీటీ స్థాయి అధికారితో పాటు ముగ్గురు ,లేదా నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. అకౌంటింగ్ టీం జిల్లాలో మొత్తం 12 బృందాలు ఉంటాయి. ఒక్కో బృందంలో ఒక అధికారి, ఒక సహాయకుడు ఉంటారు. వీరు వీడియో వ్యూయింగ్ బృందాలు పంపిన సామగ్రి లెక్కలు చూసి వాటికి ఎన్నికల నిబంధనల ప్రకారం ధరలు నిర్ణయిస్తారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ప్రతీ నియోజకవర్గంలో మూడు, ఆపై సంఖ్యలో ఉంటాయి. ఒక్కో బృందానికి నాయకత్వం వహించే అధికారికి మెజిస్టీరియల్ అధికారాలు ఉంటాయి. ఇలా జిల్లాలో మొత్తం 5 నియోజకవర్గాలకు 60మంది ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పనిచేస్తుంటారు. బృందంలో ఒక వాహనం, ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుళ్ళు, ఒక ఏఎస్సై, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలపై సమాచారమొస్తే ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని రికార్డు చేస్తారు. వీడియో నిఘా బృందాలు పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో ఒక్కో రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. సహాయ వ్యయ పరిశీలకులు పరిశీలకులకు సాయంగా ఉండేందుకు సహాయ వ్యయపరిశీలకులను నియోజకవర్గానికి ఒకరిని నియమించారు. ప్రతీ నియోజకవర్గానికి ఆదాయ పన్ను అధికారి (ఐటీఓ) హోదా లేదా ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న అధికారులు ఉంటారు. అభ్యర్థులకు సంబంధించిన అన్ని రకాల వ్యయాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఈ అధికారి వద్ద ఒక్కో అభ్యర్థి పేరుతో ఒక్కో రిజిస్టర్ ఏర్పాటు చేస్తారు. షాడో రిజిస్టర్‌గా పిలిచే దీనిలో అభ్యర్థికి సంబంధించిన వివిధ కమిటీలు ఇచ్చిన వివరాలు పొందుపరుస్తారు. అభ్యర్థులు చూపే ఎన్నికల ఖర్చుతో షాడో రిజిస్టర్ ఖర్చులు పోల్చి చూసి తేడా ఉంటే సంజాయిషీ కోరతారు. అంతిమంగా అభ్యర్థుల ఖర్చుల్లో వీరు చెప్పిందే ఫైనల్‌గా ఉంటుంది. వీడియో నిఘా బృందాలు వీడియో నిఘా బృందం నియోజకవర్గానికొకటి ఉంటుంది. ప్రతీ బృందలో ఒక అధికారి, ఒక వీడియోగ్రాఫర్ ఉంటారు. వీరు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు ,ర్యాలీలు, ఇతర ప్రచార కార్యక్రమాలను చిత్రీకరిస్తారు. ఒకే సమయంలో ఎక్కువ కార్యక్రమాలు ఉంటే అదనపు వీడియో గ్రాఫర్‌ను నియమించుకునే అధికారం ఆ అధికారికి ఉంటుంది. -
స్పెషల్ ప్రొటెక్షన్
ప్రపంచస్థాయి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యూదాద్రి శ్రీలక్ష్మీనారసింహస్వామి దేవస్థానం భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సాయుధ దళం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపారు. మొత్తంగా ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. దీంతో యూదాద్రి చుట్టూ భద్రత బలగాలు నిరంతరం పర్యవేక్షించనున్నాయి - సాక్షి, యాదాద్రి సాక్షి, యాదాద్రి : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయదల్చిన తెలంగాణ ప్రభుత్వం అదేస్థాయిభద్రతకు పెద్దపీట వేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సుమారు రూ.వెరుు్య కోట్ల వ్యయ ప్రతిపాదనతో యాదాద్రి అభివృద్ధికి వడివడిగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. దేశ ప్రధాని సైతం ప్రత్యేకంగా గుర్తించిన యాదాద్రి క్షేత్రానికి భద్రతకు సీఎం ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పోలీస్ ఉన్నతాధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి యాదాద్రి దేవస్థానం రక్షణకు పోలీస్ దళాన్ని ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేశారు. అయితే కేసీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి 8సార్లు యాదగిరిగుట్టకు వచ్చారు. అలాగే రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ సైతం ఇప్పటికే యాదాద్రిస్వామిని దర్శించుకున్నారు. వీవీఐపీలు, వీఐపీలు వచ్చిన ప్రతిసారి పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించడం కోసం జిల్లా నలుమూలల నుంచి సిబ్బందిని రప్పిస్తున్నారు. దీని వల్లవ్యయ ప్రయాసలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రత్యేక పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో యాదాద్రి పోలీస్ వ్యవస్థపై సమీక్ష కూడా నిర్వహించారు. ఇదీ స్వరూపం.. యాదాద్రి పుణ్యక్షేత్రం భద్రత బాధ్యతలను చూడడానికి ఏసీపీ స్థాయిలో అధికారి పర్యవేక్షణలో ప్రత్యేక పోలీస్ డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో కొండపైన అప్హిల్ పోలీస్ స్టేషన్, సీసీఎస్, మహిళా పోలీస్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, ప్రస్తుతం ఉన్న యాదగిరి గుట్ట పీఎస్‌తోపాటు మరో పీఎస్ ఏర్పాటు అవుతుంది. వీటికి స్టేషన్ హౌస్ అధికారులుగా ఇన్స్పెక్టర్లు ఉంటారు. దీంతోపాటు ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో కలిపి మొత్తం 300 మంది వరకు అదనంగా రానున్నారు. సాయుధ దళం ఏర్పాటు యూదాద్రికి వీవీఐపీలు వచ్చినపుడు, అత్యవసర పరిస్థితుల్లో రక్షణ బాధ్యతలను చూడడానికి సాయుధ దళాన్ని ఏర్పాటు చేస్తారు. రిజర్వ్‌పోలీస్, అక్టోపస్ గ్రేహౌండ్స్ పోలీస్‌లు నిరంతరం అందుబాటులో ఉంటారు. ఇందులో మొత్తం మూడు ప్లాటూన్ల సాయుధ పోలీస్‌లు నిరంతరం యాదాద్రిక్షేత్ర రక్షణ బాధ్యతలను చూస్తుంటారు. ఇందులో 25 మంది అక్టోపస్ పోలీస్ దళం ఉంటుంది. స్థలం కేటాయింపు యాదాద్రి క్షేత్రం అభివృద్ధికోసం కేటాయించిన భూమిలోనే 13 ఎకరాల స్థలం యాదాద్రి ప్రొటెక్షన్ ఫోర్స్కోసం కేటాయించారు. ఇందులోనే ప్రధాన కార్యాలయాలు, పరేడ్ గ్రౌండ్, శిక్షణ కేంద్రం క్వార్టర్లు నిర్మిస్తారు. పోలీస్ యంత్రాంగానికి కావల్సిన స్థలాన్ని వైటీడీఏ ఇప్పటికే కేటాయించింది. దీంతో ఇకనుంచి యూదాద్రి పుణ్యక్షేత్రం ప్రత్యేక సాయుధ దళం భద్రత పరిధిలోకి వెళ్లనుంది. -
'ఇప్పటికైనా సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలి'
విశాఖ/అలహాబాద్: ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని ఏపీ బీజేపీ ప్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. సోమవారం అలహాబాద్ నుంచి మీడియాతో మాట్లాడిన ఆయన సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై స్పందించారు. ఏపీ ప్రభుత్వం ప్రచార సాధనాలను నిలిపివేయడాన్ని ఆయన ఖండించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే తగిన ఆధారాలతో చట్టపరంగా పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రచార సాధనాలను అడ్డుకోవడమనేది సముచితం కాదని విష్ణుకుమార్ రాజు హితవు పలికారు. కాగా, సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దఎత్తునా నిరసనజ్వాల వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రజాస్వామ్య వాదులు, ప్రజాసంఘాల నేతలు మద్దతు తెలుపుతూ.. పలు జిల్లాలో భారీ ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. -
పోలవరంలో పోలీస్ యాక్షన్
సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలో అధికార, అనధికార వర్గాలు పుష్కర పనుల్లో మునిగితేలుతుంటే.. పోలీసు అధికారులు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ ఉద్యోగుల పనిపట్టడంలో తలమునకలయ్యారు. ‘నువ్వెంత... నీ స్థాయెంత’ అని అవహేళన చేసిన ట్రాన్స్ట్రాయ్ బాధ్యులకు ఖాకీ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. ఓ దశలో ట్రాన్స్ట్రాయ్ ముఖ్య బాధ్యుడిని రహస్య ప్రదేశానికి తరలించాలని భావించిన పోలీస్ అధికారులకు ఉన్నతస్థాయి రాజకీయ వర్గాలనుంచి ఫోన్ రావడంతో చితకబాది వదిలేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలు విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మావోయిస్ట్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో దాదాపు 40 మంది ప్రత్యేక పోలీసులు కాపలా ఉంటున్నారు. వీరికి భోజనం, వసతి ఏర్పాట్లను ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్ట్రాయ్ చూస్తోంది. వారానికి ఒకటి రెండుసార్లు జిల్లా పోలీస్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి.. విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసులకు మార్గదర్శకాలు ఇవ్వడం, వారి ఇబ్బందులు తెలుసుకోవడం, కొత్త వ్యక్తుల వివరాలు సేకరించడం జరుగుతోంది. కాగా, పోలీసు సిబ్బంది విషయంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చిన్నచూపు చూడటం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందు జిల్లా పోలీస్ అధికారి ఒకరు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. ఆ సందర్భంలో పోలీస్ అధికారికి, కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నీ సంగతి చూస్తానంటే.. నీ సంగతి చూస్తానంటూ ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. రెండురోజుల్లో నీ విషయం తేల్చేస్తానంటూ ట్రాన్స్ట్రాయ్ బాధ్యుడు పోలీస్ అధికారిపై రెచ్చిపోయాడు. ఈ వ్యవహారాన్ని జిల్లా అధికారి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. 20న ఏరియల్ సర్వే పేరుతో.. ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న పుష్కర ఘాట్ల ఏరి యల్ సర్వే పేరుతో రాష్ట్రస్థాయి పోలీస్ అధికారి హెలికాప్టర్లో పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయానికి ఏలూరు రేంజి పోలీస్ అధికారి, జిల్లా అధికారి వెళ్లారు. ఆ ముగ్గురూ నేరుగా ట్రాన్స్ట్రాయ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిబంధనలను అతిక్రమించి లోనికి వెళ్లకూడదంటూ కాంట్రాక్ట్ ఏజెన్సీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రగిలిపోయిన పోలీసు అధికారులు అక్కడ కనబడినవాళ్లని కనబడినట్టు బాదేశారు. లాఠీలు విరిగేలా కుమ్మేశారు. క్షతగాత్రులు భీతావహులై పరుగులు పెట్టినా వదల్లేదు. కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడికి సైతం పోలీసు దెబ్బలు రుచి చూపించారు. ఓ దశలో అతన్ని అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తరలిద్దామని భావించిన పోలీసు అధికారులకు అదే సమయంలో టీడీపీ ఎంపీ నుంచి ఫోన్ వచ్చింది. ట్రాన్స్ట్రాయ్ అధినేత అయిన సదరు ఎంపీ తన ఫోన్ నుంచి అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతతో రాష్ర్ట పోలీస్ అధికారితో మాట్లాడించారు. దీంతో ట్రాన్స్ట్రాయ్ బాధ్యుడిని వదిలివేసి అక్కడి నుంచి పోలీసు అధికారులు వెనుదిరిగారు. తమపై ట్రాన్స్ట్రాయ్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారంటూ పోలవరం పోలీస్ స్టేషన్లో ఐపీసీ 341, 353, 506 సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు. ట్రాన్స్ట్రాయ్ వర్గాల్లో ఆగ్రహం కాగా, పోలీసు అధికారులు తమపై భౌతిక దాడులు చేయడాన్ని ట్రాన్స్ట్రాయ్ వర్గాలు సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నత్తనడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఏ కారణం చూపించాలోనని యోచిస్తున్నట్టు సమాచారం. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని ఎవరికి వారు నోరునొక్కుంటున్న ఈ వ్యవహారం ఎటుతిరిగి ఎటొస్తుందో చూడాల్సిందే. -
సబ్‌డివిజన్ స్థాయిలో త్వరలోనే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘‘జిల్లాలో ఇటీవలి కాలంలో కుటుంబ కలహాలతో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. భార్యాభర్త, తల్లితండ్రి, ప్రేమికులు, బంధువులు, సన్నిహితులు.. ఇలా పలువర్గాల మధ్య మానవసంబంధాలు దెబ్బతిని ఘర్షణలు జరుగుతున్నాయి. వీటి నివారణకుగాను త్వరలోనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సబ్‌డివిజన్ స్థాయిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.’’ అని అంటున్నారు జిల్లా ఎస్పీ తాడిపర్తి ప్రభాకర్‌రావు. ఈ కౌన్సెలింగ్ సెంటర్లలో సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులను కౌన్సెలర్లుగా నియమించి కుటుంబ, మానవసంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని చెబుతున్నారాయన. సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీస్‌శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా జిల్లాప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ప్రతి పోలీస్‌స్టేషన్‌లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా పలు అంశాలపై ఎస్పీ ప్రభాకరరావు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.... సాక్షి: నూతన సంవత్సరంలో పోలీసింగ్ ఎలా ఉండబోతోంది? జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంది? ఎస్పీ: జిల్లా ప్రజలందరూ ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వారి శ్రేయస్సే లక్ష్యంగా కొత్త ఏడాది మా పోలీసింగ్ ఉండబోతోంది. జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగానే అమలవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా ఎలాంటి ఘటనలు లేకుండానే ముగిశాయి. గత ఏడాది కన్నా జాతీయ రహదారి - 65పై ప్రమాదాలు కూడా తగ్గాయి. అన్ని రకాల నేరాలను అదుపులోనికి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం శ్రమిస్తోంది. జిల్లా ప్రజలంతా ఆనందంగా ఉండేలా శాంతిభద్రతలను పరిరక్షించే కోణంలోనే మా పోలీసింగ్ ఉంటుంది. సాక్షి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా మీ కార్యకలాపాల్లో ఏమైనా మార్పులు తెచ్చి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం జరుగుతోందా? ఎస్పీ: ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలేవీ చేపట్టాలన్న ప్రణాళిక లేకపోయినా ప్రజలకు చేరువయ్యేందుకు మావంతు కృషి చేస్తున్నాం. త్వరలోనే జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రిసెప్షన్ కౌంటర్లలో మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఉంచి స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా పనిచేయదల్చుకున్నాం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలను పరిశీలిస్తే మానవ సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలతో ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు గాను సబ్‌డివిజన్ స్థాయిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాం. త్వరలోనే వీటిని పునఃప్రారంభించి కౌన్సెలింగ్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఇందుకోసం రిటైర్డ్ టీచర్ల లాంటి గౌరవప్రద వృత్తుల్లో ఉన్న వారిని నియమించుకుంటాం. ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్‌లతో పాటు మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు గాను ప్రత్యేక దృషి పెట్టాం. సాక్షి: మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక సౌకర్యాల కోసం జిల్లాలోని పీఎస్‌లలో పైలట్ ప్రాజెక్టు ఏమైనా చేపట్టారా? ఎస్పీ: అవును. జిల్లావ్యాప్తంగా పది పోలీస్స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లకు రెస్ట్రూమ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక రూపొందించాం. ఇందుకోసం స్టేషన్‌కు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్లో రెస్ట్రూమ్లో విశ్రాంతి తీసుకునేందుకు బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు కట్టిస్తాం. మేళ్లచెరువు, నల్లగొండ టూటౌన్, నేరేడుచర్ల, నార్కట్‌పల్లి, చిట్యాల, మిర్యాలగూడ వన్‌టౌన్, భువనగిరి టౌన్, సూర్యాపేట, గుడిపల్లి పీఎస్‌లతో పాటు జిల్లా హెడ్క్వార్టర్లలో ఈ రెస్ట్‌రూంలు నిర్మిస్తున్నాం. సాక్షి: యాదగిరిగుట్ట అభివృద్ధిలో పోలీసుశాఖ పరంగా ఏం చేస్తున్నారు? ఎస్పీ: యాదగిరిగుట్ట అభివృద్ధి తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్‌శాఖ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా గుట్టలో మహిళా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. చైన్‌స్నాచింగ్, వ్యభిచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాదగిరికొండకు పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. సర్కిల్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు లేదానలుగురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో ఈ స్టేషన్ పనిచేస్తుంది. ట్రాఫిక్ నియంత్రణకు కూడా తగినంత మంది కావాలని ప్రభుత్వాన్ని కోరతాం. ప్రత్యేకంగా మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. సాక్షి: జాతీయ రహదారిపై ప్రమాదాల పరిస్థితి ఎలా ఉంది? ఎస్పీ: గత ఏడాదితో పోలిస్తే ఎన్‌హెచ్-65పై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది కన్నా 18శాతం ప్రమాదాలు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే, జాతీయరహదారిపై కొన్ని నిర్మాణపరంగా మార్పులు జరగాల్సి ఉం ది. ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు కూడా కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. అయితే, జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ముఖ్యంగా పబ్లిక్‌లో మార్పు రావాలి. ప్రాణం చాలా విలువైనదన్న భావన జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు దాటేవారు, వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు మరింత తగ్గుతాయి. సాక్షి: ఇటీవలి కాలంలో మావోల పేరిట జిల్లాలో అక్కడక్కడా పోస్టర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో మావోల కార్యకలాపాలే వైనా మీ దృష్టికి వచ్చాయా? ఎస్పీ: పోలీస్‌శాఖ పరంగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలున్నాయని మేమయితే భావించడం లేదు. అయితే, ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల మావోల పేరుతో పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే, అవి నిజంగా మావోలవా లేక ఆకతాయిలు, బెదిరింపులకు పాల్పడేవారు చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. పసిగట్టేందుకు సమయం పట్టవచ్చు. కానీ, నల్లగొండలో ఆర్ఎస్యూ పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరగాల్సి ఉంది. అయితే, దీనిని ఆర్ఎస్యూ సానుభూతిపరులే ఏర్పాటు చేశారా లేక ఇతర విద్యార్థి సంఘాల నేతల పనా అనేది నిఘాలో తేలుతుంది. -
విధ్వంసానికి మావోయిస్టుల యత్నం
తిప్పికొట్టిన పోలీసు బలగాలు చర్ల: ఖమ్మం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురంలో బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్‌ను పేల్చివేసేందుకు ఆదివారం రాత్రి మావోయిస్టు అగ్రనేతలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సుమారు 50 మంది మిలీషియా సభ్యు లు వచ్చారు. ముందస్తు సమాచారంతో ప్రత్యేక పోలీసు బలగాలు ప్రతిఘటించాయి. తొలుత మావోయిస్టులపైకి కాల్పులు జరిపారు. ప్రజలకు ఇబ్బంది తలెత్తకూడదని గాలిలోకి కాల్పులు జరిపి అప్రమత్తం చేశారు. పోలీసు చర్యతో మావోయిస్టులు పారి పోయారు. బీఎస్ఎన్ఎల్కు సుమారు రూ. 25 లక్షల మేర ఆస్తినష్టం తప్పింది. ఘటనాస్థలిలో మూడు తుపాకులు, విల్లంబులు, ప్రెటోల్‌బాటిళ్లు, మారణాయుధాలను మావోయిస్టులు వదిలి వెళ్లగా.. సోమవారం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఒత్తిడిలో ప్రత్యేక పోలీస్..
మంచిర్యాల రూరల్ : నిత్యం ప్రాణాలు ఫణంగా పెడతారు.. ప్రజలకు రక్షణ కల్పిస్తారు.. ప్రజాప్రతినిధుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుగా పెడతారు.. ఎంతటి అభయారణ్యం లోనైనా విధులు నిర్వర్తిస్తారు.. అయినా వారికీ ఇబ్బం దులు తప్పడం లేదు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం. అయితే.. ప్రజాస్వామ్య సంరక్షణకు అహర్నిషలు కృషి చేస్తున్న ప్రత్యేక పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సమయానికి సెలవులు దొరక్క.. కుటుంబాలకు దూరంగా ఉండలేక.. వెనువెంటనే డ్యూటీలు కేటాయించడం.. సెలవు రోజుల్లోనూ ఇతరత్రా పనులకు వినియోగించడంతో మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో వారు ఒత్తిడికి గురై విచక్షణ కోల్పోతున్న సంఘటనలూ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్.అడెల్ (పీసీ నంబర్ 1486) ఎన్నికల విధులతోపాటు, అసెంబ్లీ రక్షణ కోసం పది రోజులపాటు హైదరాబాద్‌లోనే ఉండి మూడు రోజుల క్రితమే బెటాలియన్‌కు వచ్చాడు. రెండో శనివారం, ఆదివారం కలిసి వస్తుందని, తనకు సెలవు కావాలని అడిగితే అధికారులు మంజూరు చేయలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అతను గార్డు విధులకు వెళ్లి భవనం పెకైక్కాడు. తన ఎస్ఎల్ఆర్ తుపాకీతో గాల్లోకి 20 రౌండ్ల కాల్పులు గాల్లోకి జరపడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెనువెంటనే విధులతో సతమతం.. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒకేసారి మూడు రకాల ఎన్నికలు రావడం అధికారులకు, పోలీసులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మార్చి నెల నుంచి మొదలుకుని మే నెల చివరి వరకు మూడు నెలల పాటు మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించారు. ఎన్నికలకు ముందే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందు కు 13వ పోలీసు బెటాలియన్‌లోని కానిస్టేబుళ్లను వివి ధ ప్రాంతాల్లో విధులకు పంపించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే వెంటనే ప్రాదేశిక ఎన్నికల కోసం మరో చోటకు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల విధు లు ఇలా ఒకదాని తరువాత మరోటి ఇలా మూడు నెలలు ప్రత్యేక పోలీసులు విధులకు హాజరయ్యారు. ఎన్నికల విధులు తప్పనిసరి కావడంతో, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, ఎన్నికలు జరిగినా ఫలితాలు వెలువడేందుకు కొంత ఆలస్యం కావడంతో బ్యాలెట్ బాక్సులకు, ఈవీఎంలకు భద్రత కల్పించ డం, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్బావ వేడుకల నిర్వహణ, వెనువెంటనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఏర్పడిన అసెంబ్లీకి ప్రత్యేక భద్రత ఇలా నాలుగు నెలలుగా విధుల్లోనే ప్రత్యేక పోలీసులు తమ సేవలందించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత అసెంబ్లీ రక్షణ విధులను కేటాయించారు. ఇటీవలే విధులు నిర్వహించిన పోలీసులు వారి బెటాలియన్లకు తిరిగి వెళ్లగా, వారికి బెటాలియన్‌లోనే ఇతరత్రా విధులను కేటాయించారు. దీంతో సెలవులున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి వారిది. అధికారులు చెప్పిన పనులు చేయకపోతే, వారికి అనుమతులు, సెలవుల మంజూరు చేయకపోవడంతోనే వీరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. సెలవున్నా అనుమతి ఉండదు.. బెటాలియన్‌లో పనిచేసే పోలీసులను నెలరోజులు బయట డ్యూటీకి పంపిస్తుంటారు. వీరికి బయట డ్యూటీ చేస్తే నాలుగు రోజులు సెలవు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఏటా 15 సీఎల్స్, 30 ఈఎల్స్ కూడా ఉన్నాయి. ఆదివారం, పండుగలకు కూడా సెలవులను వాడుకునే అవకాశం ఉంది. కానీ.. బయట డ్యూటీకి వెళ్లి బెటాలియన్‌కు తిరిగి వచ్చిన కానిస్టేబుళ్లకు అధికారులు సెలవులు ఇవ్వకుండా వారికి బెటాలియన్‌లోనే ఇతర విధులను కేటాయిస్తున్నారు. సెలవులు కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే అధికారుల ఇళ్లల్లో వారు చెప్పిన పనులు చేస్తేనే అనుమతి లభిస్తుందని గుడిపేట ప్రత్యేక పోలీసులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఏ కానిస్టేబుల్ అనుకూలంగా ఉంటే వారికి సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించడం, ఇతర డ్యూటీలు వేయకపోవడం, అందరిపై అజమాయిషీ చెలాయించే అధికారం ఇవ్వడంతో ఇతర కానిస్టేబుళ్లకు మింగుడు పడడం లేదు. దీంతో వీరు మరింత మానసికంగా కుంగిపోయి, విచక్షణ కోల్పోతున్నట్లు బెటాలియన్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు బెటాలియన్‌లో జరిగే అక్రమాలపై ఉన్నత స్థాయి అధికారి గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపిస్తే కానిస్టేబుళ్లు ఎదుర్కొనే సమస్యలు, బెటాలియన్లలో జరిగే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని ప్రత్యేక పోలీసులు కోరుతున్నారు. కేసీఆర్ హామీ కోసం ఎదురుచూపు.. పోలీసులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారానికి ఒకసారి సెలవు తప్పనిసరిగా తమ ప్రభుత్వం ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో పోలీసు వర్గాల్లో ఆనందం నెలకొంది. రోజుల తరబడి సెలవులు లేకుండా పనిచేయడంతో పోలీసులకే కాకుండా, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారానికోసారి సెలవు మంజూరు చేస్తామని సీఎం హామీతో కనీసం ఒక్క రోజైనా తమ కుటుంబంతో గడపవచ్చని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవోల ప్రకారం ప్రత్యేక పోలీసులకు అందే సెలవులు సక్రమంగా అందేలా, బెటాలియన్‌లోని అధికారులను ఆదేశించాలని, కానిస్టేబుళ్లకు ఎలాంటి సమస్య వచ్చినా, వెంటనే స్పందించేలా ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
క్యాట్‌ఫిష్ కేంద్రాలు ధ్వంసం
చింతామణి, న్యూస్‌లైన్ : తాలూకాలో అక్రమంగా నిర్వహిస్తున్న నిషిద్ధ క్యాట్‌ఫిష్ కేంద్రాలను అధికారులు ధ్వంసం చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్నసంద్ర గ్రామంలో జరిగిన సంఘటన వివరాలు... చిన్నసంద్ర గ్రామంలో నిషేధిత క్యాట్‌ఫిష్ కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన జిల్లా అధికారి వాటిని తొలగించాలని ఆదేశించారు. వారికి ఇచ్చిన మూడు నెలల గడువు కూడా ముగి సింది. గతంలో క్యాట్‌ఫిష్ కేంద్రాలను తొలగించడానికి వెళ్లిన అధికారులపై నిర్వాహకులు దాడి చేసిన విషయం తెల్సిందే. దీంతో ముందుజాగ్రత్త చర్యగా 144 సెక్షన్ జారీ చేసిన తహసిల్దార్ కృష్ణస్వామి మంగళవారం ఉదయం జిల్లా న ుంచి ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించి దాదాపు 50 క్యాట్‌ఫిష్ కేంద్రాలను ధ్వంసం చేశారు. క్యాట్‌ఫిష్ పెంపకం సుప్రీం కోర్టులో పెండింగ్ ఉన్నందున వాటిని పెంచడానికి అవకాశం కల్పించాలని బెంగళూరుకు చెందిన న్యాయవాది ఆనంద్ తహసిల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. వీటిని ఖాతరు చేయని తహసిల్దార్, డీఎస్పీలు దగ్గరుండి క్యాట్‌ఫిష్ కేంద్రాలను ధ్వంసం చేయించారు. ఈ మేరకు చిన్నసంద్ర, చెందనహళ్లి చుట్టు పక్కల వ ుూడు కిలోమీటర్ల మేర కు మంగళవారం సాయంత్రం వరకు 144 సెక్షన్ విధించారు.