పోలవరంలో పోలీస్ యాక్షన్ | Police Action in POLAVARAM | Sakshi
Sakshi News home page

పోలవరంలో పోలీస్ యాక్షన్

Published Tue, Jul 28 2015 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

Police Action in POLAVARAM

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :జిల్లాలో అధికార, అనధికార వర్గాలు పుష్కర పనుల్లో మునిగితేలుతుంటే.. పోలీసు అధికారులు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్‌ట్రాయ్ ఉద్యోగుల పనిపట్టడంలో తలమునకలయ్యారు. ‘నువ్వెంత... నీ స్థాయెంత’ అని అవహేళన చేసిన ట్రాన్స్‌ట్రాయ్ బాధ్యులకు ఖాకీ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. ఓ దశలో ట్రాన్స్‌ట్రాయ్ ముఖ్య బాధ్యుడిని రహస్య ప్రదేశానికి తరలించాలని భావించిన పోలీస్ అధికారులకు ఉన్నతస్థాయి రాజకీయ వర్గాలనుంచి ఫోన్ రావడంతో చితకబాది వదిలేశారు.
 
 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన పూర్వాపరాలు విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై మావోయిస్ట్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు ప్రాంతంలో దాదాపు 40 మంది ప్రత్యేక పోలీసులు కాపలా ఉంటున్నారు. వీరికి భోజనం, వసతి ఏర్పాట్లను ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్‌ట్రాయ్ చూస్తోంది.  వారానికి ఒకటి రెండుసార్లు జిల్లా పోలీస్ అధికారులు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లి.. విధుల్లో ఉన్న ప్రత్యేక పోలీసులకు మార్గదర్శకాలు ఇవ్వడం, వారి ఇబ్బందులు తెలుసుకోవడం, కొత్త వ్యక్తుల వివరాలు సేకరించడం జరుగుతోంది.
 
 కాగా, పోలీసు సిబ్బంది విషయంలో కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, చిన్నచూపు చూడటం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పుష్కరాల ప్రారంభానికి వారం రోజుల ముందు  జిల్లా పోలీస్ అధికారి ఒకరు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి వెళ్లారు. ఆ సందర్భంలో పోలీస్ అధికారికి, కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. నీ సంగతి చూస్తానంటే.. నీ సంగతి చూస్తానంటూ ఒకరినొకరు హెచ్చరించుకున్నారు. రెండురోజుల్లో నీ విషయం తేల్చేస్తానంటూ ట్రాన్స్‌ట్రాయ్ బాధ్యుడు పోలీస్ అధికారిపై రెచ్చిపోయాడు. ఈ వ్యవహారాన్ని జిల్లా అధికారి సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.
 
 20న ఏరియల్ సర్వే పేరుతో..
 ఈ నేపథ్యంలోనే ఈ నెల 20న పుష్కర ఘాట్ల ఏరి యల్ సర్వే పేరుతో రాష్ట్రస్థాయి పోలీస్ అధికారి హెలికాప్టర్‌లో పోలవరం నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. అదే సమయానికి ఏలూరు రేంజి పోలీస్ అధికారి, జిల్లా అధికారి వెళ్లారు. ఆ ముగ్గురూ నేరుగా ట్రాన్స్‌ట్రాయ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిబంధనలను అతిక్రమించి లోనికి వెళ్లకూడదంటూ కాంట్రాక్ట్ ఏజెన్సీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో రగిలిపోయిన పోలీసు అధికారులు అక్కడ కనబడినవాళ్లని కనబడినట్టు బాదేశారు. లాఠీలు విరిగేలా కుమ్మేశారు. క్షతగాత్రులు భీతావహులై పరుగులు పెట్టినా వదల్లేదు.
 
 కాంట్రాక్ట్ ఏజెన్సీ బాధ్యుడికి సైతం పోలీసు దెబ్బలు రుచి చూపించారు. ఓ దశలో అతన్ని అక్కడి నుంచి రహస్య ప్రదేశానికి తరలిద్దామని భావించిన పోలీసు అధికారులకు అదే సమయంలో టీడీపీ ఎంపీ నుంచి ఫోన్ వచ్చింది. ట్రాన్స్‌ట్రాయ్ అధినేత అయిన సదరు ఎంపీ తన ఫోన్ నుంచి అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతతో రాష్ర్ట పోలీస్ అధికారితో మాట్లాడించారు. దీంతో ట్రాన్స్‌ట్రాయ్ బాధ్యుడిని వదిలివేసి అక్కడి నుంచి పోలీసు అధికారులు వెనుదిరిగారు. తమపై ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారంటూ పోలవరం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ 341, 353, 506 సెక్షన్ల కింద ఇరువురిపై కేసు నమోదు చేశారు.

 ట్రాన్స్‌ట్రాయ్ వర్గాల్లో ఆగ్రహం
 కాగా, పోలీసు అధికారులు తమపై భౌతిక దాడులు చేయడాన్ని ట్రాన్స్‌ట్రాయ్ వర్గాలు సీరియస్‌గా  తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నత్తనడకన నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే దీనికి ఏ కారణం చూపించాలోనని యోచిస్తున్నట్టు సమాచారం. విషయం బయటకు తెలిస్తే పరువుపోతుందని ఎవరికి వారు నోరునొక్కుంటున్న ఈ వ్యవహారం ఎటుతిరిగి ఎటొస్తుందో చూడాల్సిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement