నోరునొక్కుకుంటున్న పోలీస్, ట్రాన్స్‌ట్రాయ్ వర్గాలు
కలకలం రేపిన ‘సాక్షి’ కథనం
సాక్షి ప్రతినిధి, ఏలూరు:పోలీసు అధికారులు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్ట్ ఏజెన్సీ ట్రాన్స్‌ట్రాయ్ బాధ్యుల మధ్య తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న వివాదం పునరావృతం కాకుండా ఇరువర్గాలూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారం కిందట చోటుచేసుకున్న ఈ ఘటనలో ఎవరిది తప్పు.. ఎవరిది ఒప్పు అని తవ్వుకోకుండా ఇంతటితో ఆ విషయాన్ని వదిలేద్దామని భావిస్తున్నారు. పోలీసు అధికారులను తక్కువ చేసి మాట్లాడటం.. ప్రతిగా పోలీసులు దాడి చేయడం వంటి ఘటనలు రచ్చకెక్కకుండా ఎవరికి వారు మారుమాట్లాడకుండా నోరునొక్కేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ‘పోలవరంలో పోలీస్ యాక్షన్’ శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం అటు ట్రాన్స్‌ట్రాయ్, ఇటు పోలీసు వర్గాల్లో కలకలం రేపింది. మూడోకంటికి తెలియకుండా పోలవరం కొండల్లో జరిగిన పోలీస్ ఆపరేషన్‌పై పక్కా సమాచారంతో కథనం రావడంతో ఇరువర్గాలూ ఉలిక్కిపడ్డాయి.
‘పోలీస్ బాస్‌కు సారీ చెప్పేశాం’
‘ఈనెల 20న పోలవరంలో జరిగింది నిజంగా దురదృష్టకర ఘటన. అందుకే పోలీస్ బాస్‌కు సారీ చెప్పేశాం’ అని ట్రాన్స్‌ట్రాయ్ అధినేత, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడారు. పేరు రాయడానికి ఇష్టపడని ఆయన ఆ రోజు ఏం జరిగిందనేది ఇలా చెప్పుకొచ్చారు. ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో ఓ కొండపై హెలిప్యాడ్ ఉంది. పక్కనే ఉన్న కొండపై ట్రాన్స్‌ట్రాయ్ గెస్ట్‌హౌస్ ఉంది. రాష్ట్రస్థాయి పోలీసుఅధికారి హెలికాప్టర్ దిగి గెస్ట్‌హౌస్‌కు నడుచుకుంటూ వస్తుండగా ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బంది అడ్డుకున్నారు. అదే సమయంలో రోడ్డు నిర్మాణం జరుగుతుండటంతో పనికి ఇబ్బంది అవుతుందని అడ్డుకున్నారే కానీ వేరే ఉద్దేశం కాదు. అందునా ఆయన పోలీస్ ఉన్నతాధికారి అని కూడా వాళ్లకు తెలియదు.
ఉన్నతాధికారి వస్తున్నారని పోలీసులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. బాస్‌ను ఆపడంతో ఆగ్రహించిన పోలీసులు ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బందిపై ప్రతాపం చూపించారు. ఎప్పుడో ఉదయం 11.30 గంటలకు ఘటన జరిగితే రాత్రికి మా జిల్లా ఎస్పీ ద్వారా నాకు తెలిసింది. వెంటనే పోలీస్ ఉన్నతాధికారికి ఫోన్‌చేసి సారీ చెప్పేశాను. విషయం పెద్దది కాకుండా ఆయన కూడా పెద్దమనసుతో మావాళ్లను వదిలేశారు’ అని ఆ ఎంపీ చెప్పుకొచ్చారు. గతంలో కూడా పోలీసు అధికారులకు, ట్రాన్స్‌ట్రాయ్ ఉద్యోగులకు మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఏమో ఉండొచ్చు.. ఇకనైనా సమన్వయంతో పని చేయమని మా వాళ్లకు సూచించా’ అని చెప్పారు.
చాలా సున్నితమైన విషయం
ఇదే విషయమై జిల్లా పోలీస్ అధికారి మంగళవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘ఇది చాలా సున్నితమైన విషయం. పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ సిబ్బందికి, పోలీసులకు మధ్య గ్యాప్ వచ్చిందంటే వేరేగా ఉంటుంది. జరిగింది చిన్న ఘటనే’ అన్నారు.
కేసుల్లేవ్
కాగా, ఇరువర్గాలూ రాజీపడిన నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బందిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ ట్రాన్స్‌ట్రాయ్ సిబ్బందిపై కేసు నమోదు చేసిన పోలవరం పోలీసులు ఇప్పుడు అలాంటిదేం లేదని వాదిస్తున్నారు. ఉన్నతాధికారులకు సంబంధించిన విషయం కాబట్టి వారు ఎక్కడైనా కేసు పెట్టొచ్చు.. తీసేయొచ్చు అని పోలవరం పోలీసులు వ్యాఖ్యానిస్తున్నారు.
‘ఇంతటితో వదిలేద్దాం’
Published Wed, Jul 29 2015 1:20 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement