ఒత్తిడిలో ప్రత్యేక పోలీస్..
మంచిర్యాల రూరల్ : నిత్యం ప్రాణాలు ఫణంగా పెడతారు.. ప్రజలకు రక్షణ కల్పిస్తారు.. ప్రజాప్రతినిధుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుగా పెడతారు.. ఎంతటి అభయారణ్యం లోనైనా విధులు నిర్వర్తిస్తారు.. అయినా వారికీ ఇబ్బం దులు తప్పడం లేదు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం. అయితే.. ప్రజాస్వామ్య సంరక్షణకు అహర్నిషలు కృషి చేస్తున్న ప్రత్యేక పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సమయానికి సెలవులు దొరక్క.. కుటుంబాలకు దూరంగా ఉండలేక.. వెనువెంటనే డ్యూటీలు కేటాయించడం.. సెలవు రోజుల్లోనూ ఇతరత్రా పనులకు వినియోగించడంతో మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో వారు ఒత్తిడికి గురై విచక్షణ కోల్పోతున్న సంఘటనలూ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి.
శుక్రవారం సాయంత్రం మంచిర్యాల మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్.అడెల్ (పీసీ నంబర్ 1486) ఎన్నికల విధులతోపాటు, అసెంబ్లీ రక్షణ కోసం పది రోజులపాటు హైదరాబాద్‌లోనే ఉండి మూడు రోజుల క్రితమే బెటాలియన్‌కు వచ్చాడు. రెండో శనివారం, ఆదివారం కలిసి వస్తుందని, తనకు సెలవు కావాలని అడిగితే అధికారులు మంజూరు చేయలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అతను గార్డు విధులకు వెళ్లి భవనం పెకైక్కాడు. తన ఎస్‌ఎల్‌ఆర్ తుపాకీతో గాల్లోకి 20 రౌండ్ల కాల్పులు గాల్లోకి జరపడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
వెనువెంటనే విధులతో సతమతం..
ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒకేసారి మూడు రకాల ఎన్నికలు రావడం అధికారులకు, పోలీసులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మార్చి నెల నుంచి మొదలుకుని మే నెల చివరి వరకు మూడు నెలల పాటు మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించారు. ఎన్నికలకు ముందే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందు కు 13వ పోలీసు బెటాలియన్‌లోని కానిస్టేబుళ్లను వివి ధ ప్రాంతాల్లో విధులకు పంపించారు.
మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే వెంటనే ప్రాదేశిక ఎన్నికల కోసం మరో చోటకు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల విధు లు ఇలా ఒకదాని తరువాత మరోటి ఇలా మూడు నెలలు ప్రత్యేక పోలీసులు విధులకు హాజరయ్యారు. ఎన్నికల విధులు తప్పనిసరి కావడంతో, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, ఎన్నికలు జరిగినా ఫలితాలు వెలువడేందుకు కొంత ఆలస్యం కావడంతో బ్యాలెట్ బాక్సులకు, ఈవీఎంలకు భద్రత కల్పించ డం, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్బావ వేడుకల నిర్వహణ, వెనువెంటనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఏర్పడిన అసెంబ్లీకి ప్రత్యేక భద్రత ఇలా నాలుగు నెలలుగా విధుల్లోనే ప్రత్యేక పోలీసులు తమ సేవలందించారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత అసెంబ్లీ రక్షణ విధులను కేటాయించారు. ఇటీవలే విధులు నిర్వహించిన పోలీసులు వారి బెటాలియన్‌లకు తిరిగి వెళ్లగా, వారికి బెటాలియన్‌లోనే ఇతరత్రా విధులను కేటాయించారు. దీంతో సెలవులున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి వారిది. అధికారులు చెప్పిన పనులు చేయకపోతే, వారికి అనుమతులు, సెలవుల మంజూరు చేయకపోవడంతోనే వీరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది.
సెలవున్నా అనుమతి ఉండదు..
బెటాలియన్‌లో పనిచేసే పోలీసులను నెలరోజులు బయట డ్యూటీకి పంపిస్తుంటారు. వీరికి బయట డ్యూటీ చేస్తే నాలుగు రోజులు సెలవు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఏటా 15 సీఎల్స్, 30 ఈఎల్స్ కూడా ఉన్నాయి. ఆదివారం, పండుగలకు కూడా సెలవులను వాడుకునే అవకాశం ఉంది. కానీ.. బయట డ్యూటీకి వెళ్లి బెటాలియన్‌కు తిరిగి వచ్చిన కానిస్టేబుళ్లకు అధికారులు సెలవులు ఇవ్వకుండా వారికి బెటాలియన్‌లోనే ఇతర విధులను కేటాయిస్తున్నారు.
సెలవులు కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే అధికారుల ఇళ్లల్లో వారు చెప్పిన పనులు చేస్తేనే అనుమతి లభిస్తుందని గుడిపేట ప్రత్యేక పోలీసులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఏ కానిస్టేబుల్ అనుకూలంగా ఉంటే వారికి సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించడం, ఇతర డ్యూటీలు వేయకపోవడం, అందరిపై అజమాయిషీ చెలాయించే అధికారం ఇవ్వడంతో ఇతర కానిస్టేబుళ్లకు మింగుడు పడడం లేదు. దీంతో వీరు మరింత మానసికంగా కుంగిపోయి, విచక్షణ కోల్పోతున్నట్లు బెటాలియన్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు బెటాలియన్‌లో జరిగే అక్రమాలపై ఉన్నత స్థాయి అధికారి గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపిస్తే కానిస్టేబుళ్లు ఎదుర్కొనే సమస్యలు, బెటాలియన్లలో జరిగే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని ప్రత్యేక పోలీసులు కోరుతున్నారు.
కేసీఆర్ హామీ కోసం ఎదురుచూపు..
పోలీసులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారానికి ఒకసారి సెలవు తప్పనిసరిగా తమ ప్రభుత్వం ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో పోలీసు వర్గాల్లో ఆనందం నెలకొంది. రోజుల తరబడి సెలవులు లేకుండా పనిచేయడంతో పోలీసులకే కాకుండా, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారానికోసారి సెలవు మంజూరు చేస్తామని సీఎం హామీతో కనీసం ఒక్క రోజైనా తమ కుటుంబంతో గడపవచ్చని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవోల ప్రకారం ప్రత్యేక పోలీసులకు అందే సెలవులు సక్రమంగా అందేలా, బెటాలియన్‌లోని అధికారులను ఆదేశించాలని, కానిస్టేబుళ్లకు ఎలాంటి సమస్య వచ్చినా, వెంటనే స్పందించేలా ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.