Battalion
-
బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్‌లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.కాగా తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారువరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు. అయితే మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. -
దేశంలోనే కడప బెటాలియన్‌కు ప్రత్యేక స్థానం
వైవీయూ: కడప 30 ఆంధ్రా బెటాలియన్‌కు రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రత్యేకస్థానం ఉందని తిరుపతి ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్ అన్నారు. గురువారం కడప ఎన్సీసీ నగర్‌లోని 30 ఆంధ్రా బెటాలియన్‌లో ఎన్సీసీ కేడెట్స్ డ్రిల్‌కోసం రూ.54 లక్షల నిధులతో నిర్మించనున్న డ్రిల్ స్క్వేర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్నల్ గంగా సతీష్ మాట్లాడుతూ కడప నగరంలోని 30 ఆంధ్రా బెటాలియన్ అన్ని సౌకర్యాలతో బాగుందన్నారు. ఎన్సీసీ హబ్‌గా కడపను తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఆలిండియా ట్రెక్కింగ్ క్యాంపులు, ఏక్‌భారత్.. శ్రేష్ట్భారత్ క్యాంపులను సైతం ఇక్కడే కేటాయించామన్నారు. జాతీయస్థాయిలో తిరుపతి గ్రూప్ పరిధిలోని ఎన్సీసీ కేడెట్స్ ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. కోవిడ్–19 కారణంగా అనుకున్న ప్రణాళికల ప్రకారం పూర్తిస్థాయి అభివృద్ధి సాధ్యం కాలేదని, కోవిడ్ తగ్గిన వెంటనే మరిన్ని అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయన్నారు. జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ ఎన్సీసీ బెటాలియన్ అభివృద్ధికి చక్కటి సహకారం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎన్సీసీ కేడెట్స్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నారని పేర్కొన్నారు. జై జవాన్ నుంచి జైకిసాన్కు.. దేశానికి సేవచేసే అవకాశం లభించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తిరుపతి గ్రూప్ కమాండర్ కల్నల్ గంగా సతీష్ అన్నారు. పలు యుద్ధాల్లో పాల్గొని ప్రస్తుతం ఎన్సీసీకి సేవలందించడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు జైజవాన్ పాత్రలో ఉన్న నేను మేనెల నుంచి స్వచ్ఛంద పదవీవిరమణ చేసి జైకిసాన్‌గా మారతానన్నారు. 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ దినేష్‌కుమార్ ఝా మాట్లాడుతూ తెలుగువ్యక్తి గ్రూప్ కమాండర్‌గా ఉండటంతో పాటు కడప బెటాలియన్ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందించారన్నారు. అనంతరం ఈనెలాఖరున పదవీ విరమణ చేయనున్న కల్నల్ గంగా సతీష్‌ను ఎన్సీసీ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు మేజర్ సి. విజయభాస్కర్, జి. చక్రధర్, పి.వి. సుబ్బారెడ్డి, డా. ఆర్. నీలయ్య, ఎం. వివేకానందరెడ్డి, మహేష్, సూర్యనారాయణరెడ్డి, ఇమాంఖాసీం, జయచంద్ర, ఎన్సీసీ సిబ్బంది శంకర్, శివప్రసాద్, చలమారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: ఆరుగురి దారుణ హత్య వెనుక కారణలివేనా?! కరోనా: ఒంటరితనం.. ఆపై వెన్నాడిన భయం -
బెటాలియన్‌కు బురిడీ!
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని అత్యంత కీలకమైన బలగాల యూనిట్ బెటాలియన్‌లో సంక్షేమ విభాగపు నిధులకు గండిపడింది. ప్రతీ బెటాలియన్‌లో బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీ సర్ వింగ్ ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. బెటాలియన్‌లో క్యాంటీన్, గ్యాస్, పెట్రోల్ పంప్, కామన్ గుడ్ ఫండ్ తదితరాల మెయింటెనెన్స్ మొత్తం ఈ బెటాలియన్ వెల్ఫే ర్ ఆఫీసర్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారులను బురిడీ కొట్టించి కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. చెక్కులపై సంతకాలు ఫోర్జరీ యూసఫ్‌గూడలోని మొదటి పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెల్ఫేర్ వింగ్‌లో పనిచేస్తున్నాడు. ప్రతీ నెలా మెయింటెనెన్స్ కింద వచ్చే డబ్బులను బ్యాంకులో జమ చేయడం, అకౌంట్ బుక్కులు, చెక్కులను అప్డేట్ చేస్తూ ఉండటం ఇతడి విధి. బ్యాంకుల్లో జమ చేయాల్సిన నగదును సొంత ఖాతాలో జమ చేసుకోవడం, బ్యాంకు చలానా కట్టినట్టుగా స్టాంప్, బ్యాంకు అధికారుల సంతకాలు తానే పెట్టి ఆడిటింగ్ ఫైళ్లలో పెట్టేవాడు. ఇలా 2013 నుంచి 2018 మార్చి వరకు మొత్తం రూ.40 లక్షల మేర శ్రీకాంత్ కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. బ్యాంకులో నగదు జమ చేసినట్టుగా ప్రతీ నెలా పాస్‌బుక్ అప్డేట్ చేయడం కోసం తన ఇంట్లోనే అప్డేట్ చేసే సాఫ్ట్వేర్, ప్రింటర్‌ను పెట్టుకున్నాడు. ఇలా ప్రతీ నెలా గ్యాస్, క్యాంటీన్, ఇతర మెయింటెనెన్స్ కింద వచ్చిన నిధులను పక్కదారి పట్టించినట్టు తేలింది. కానిస్టేబుల్‌పై కేసు నమోదు... కుంభకోణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంది. చెక్కులపై సంతకాలు చేయడం, వాటి డిపాజిట్, తదితర వ్యవహారాలన్నింటిపై ప్రతీ మూడు నెలలకోసారి ఆడిటింగ్ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బాంకుల్లో ఉన్న నగదును కూడా చెక్ చేయాలి. కేవలం పాస్‌బుక్‌లను ఆధారంగా చేసుకొని ఆడిటింగ్ చేయడం, శ్రీకాంత్‌పై ఆరోపణలున్నా సంబంధిత ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్కాంలో గతంలో పనిచేసిన వెల్ఫేర్ అధికారులతో పాటు కమాండెంట్లపై విచారణ జరపాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. 2013 నుంచి జరిగిన ఈ స్కాంలో ఆ సమయాల్లో పనిచేసిన బెటాలియన్ వెల్ఫేర్ అధికారులు, కమాండెంట్ల నుంచి సంబంధిత నగదును రికవరీ చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. గతంలోనే ఇలాంటి అవినీతి ఆరోపణల వ్యవహారంపై ‘సాక్షి’కథనాలు ప్రచురించింది. బెటాలియన్ వెల్ఫేర్ అధికారులతో పాటు ఎంటీవో (మోటార్ ట్రాన్స్పోర్ట్ అధికారి) పోస్టు కోసం భారీ స్థాయిలో పైరవీలు సాగుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. కొంతమంది రిజర్వ్ ఇన్స్పెక్టర్లు బదిలీ అయినా.. మళ్లీ అక్కటే అటాచ్మెంట్ పేరుతో పాతుకుపోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా బయటపడింది... గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న ఈ కుంభకోణం ఓ చెక్కు వల్ల బయటపడింది. మార్చి 13న శ్రీకాంత్ తన స్నేహితుడు ఖాతాలో రూ.రెండు లక్షల చెక్కును బదిలీ చేశాడు. మొదటి బెటాలియన్‌కు సంబంధించి వివిధ బ్యాంకుల్లో 13 ఖాతాలున్నాయి. శ్రీకాంత్ నగదు జమచేసే బ్యాంకు ఎస్బీహెచ్ కాగా, బ్యాంకుల విలీనం వల్ల ఎస్బీహెచ్ ఎస్బీఐలో విలీనం అయ్యింది. మార్చి వరకు పాత బ్యాంకు చెక్కులు చెలామణి కావడంతో పాత డేట్‌తో ఒక చెక్కును ఎస్బీఐ అకౌంట్ ద్వారా తన స్నేహితుడి ఖాతాకు రూ.రెండు లక్షలు పంపించాడు. అయితే ఈ ఎస్బీఐ ప్రధాన ఖాతాకు సంబందించిన సంక్షిప్త సందేశాలు ఏఆర్ఎస్ఐకి వెళ్లింది. ఈ సందర్భంగా రూ.రెండు లక్షల చెక్కుకు సంబంధించి తామేమి లావాదేవీలు జరపలేదని గ్రహించి ఏఆర్ఎస్ఐ బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా, శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ పాత ఎస్బీహెచ్ చెక్కును బదిలీ చేసినట్టు తెలిపారు. దీంతో సందేహం వచ్చి బ్యాంకు పాసుబుక్‌లో ఉన్న నగదు, బ్యాంకులో డిపాజిట్లో ఉన్న నగదును టాలీ చేశారు. ఇక్కడే శ్రీకాంత్ అసలు కథ బయటపడింది. -
‘పోలవరం’లో ప్రత్యేక బెటాలియన్
పోలవరం: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని బెటాలియన్ ఐజీ ఆర్కే మీనా, డీఐజీ సూర్యచంద్రం, ఎస్పీ కోటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో మరింత భద్రత పెంచేందుకు వీలుగా ప్రత్యేక బెటాలియన్‌ను ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నామన్నారు. బెటాలియన్‌ను ఏర్పాటు చేస్తే అవసరమైన వసతులు కల్పించడంతో కోసం ప్రాజెక్ట్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాజెక్ట్ వద్ద ఇప్పటికే భద్రత నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. -
రైలు పట్టాలపై ఆర్మీ ఆఫీసర్ మృతదేహం
విశాఖపట్నం : మణిపూర్ బెటాలియన్‌కి చెందిన ఆర్మీ ఆఫీసర్ బుధవారం ఉదయం విశాఖ రైల్వే స్టేషన్ మూడో నంబరు ప్లాట్‌ఫాం సమీపంలో పట్టాలపై శవమై కనిపించాడు. విధి నిర్వహణలో ఉన్న స్టేషన్ సూపరింటెండెంట్ కె.సన్యాసిరావు ఉదయం ఏడు గంటల సమయంలో మృతదేహాన్ని గమనించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాడు. వారు వచ్చి రెండు భాగాలుగా విడిపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. బీహార్ రాష్ట్రం రాజ్‌పూర్‌కు చెందిన పి.రంగేష్‌కుమార్‌గా గుర్తించారు. ఆయన లాన్స్‌నాయక్(ఎల్.ఎన్.కె) కేడర్‌లో మణిపూర్ ఆర్మీ బె టాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో గల 13వ ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ నిమిత్తం వచ్చాడు. మృతుని వద్ద దొరికిన పాస్‌పోర్టు, అతను శిక్షణ పొందుతున్న ఎన్సీసీ క్యాంపు ఆఫీసు నుంచి సమాచారాన్ని సేకరించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసుని విశాఖరైల్వే జీఆర్పీపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒత్తిడిలో ప్రత్యేక పోలీస్..
మంచిర్యాల రూరల్ : నిత్యం ప్రాణాలు ఫణంగా పెడతారు.. ప్రజలకు రక్షణ కల్పిస్తారు.. ప్రజాప్రతినిధుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుగా పెడతారు.. ఎంతటి అభయారణ్యం లోనైనా విధులు నిర్వర్తిస్తారు.. అయినా వారికీ ఇబ్బం దులు తప్పడం లేదు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయం. అయితే.. ప్రజాస్వామ్య సంరక్షణకు అహర్నిషలు కృషి చేస్తున్న ప్రత్యేక పోలీసులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. సమయానికి సెలవులు దొరక్క.. కుటుంబాలకు దూరంగా ఉండలేక.. వెనువెంటనే డ్యూటీలు కేటాయించడం.. సెలవు రోజుల్లోనూ ఇతరత్రా పనులకు వినియోగించడంతో మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో వారు ఒత్తిడికి గురై విచక్షణ కోల్పోతున్న సంఘటనలూ అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల మండలంలోని గుడిపేట 13వ ప్రత్యేక పోలీసు బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్.అడెల్ (పీసీ నంబర్ 1486) ఎన్నికల విధులతోపాటు, అసెంబ్లీ రక్షణ కోసం పది రోజులపాటు హైదరాబాద్‌లోనే ఉండి మూడు రోజుల క్రితమే బెటాలియన్‌కు వచ్చాడు. రెండో శనివారం, ఆదివారం కలిసి వస్తుందని, తనకు సెలవు కావాలని అడిగితే అధికారులు మంజూరు చేయలేదు. దీంతో కోపోద్రిక్తుడైన అతను గార్డు విధులకు వెళ్లి భవనం పెకైక్కాడు. తన ఎస్ఎల్ఆర్ తుపాకీతో గాల్లోకి 20 రౌండ్ల కాల్పులు గాల్లోకి జరపడం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెనువెంటనే విధులతో సతమతం.. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఒకేసారి మూడు రకాల ఎన్నికలు రావడం అధికారులకు, పోలీసులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. మార్చి నెల నుంచి మొదలుకుని మే నెల చివరి వరకు మూడు నెలల పాటు మున్సిపల్, ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించారు. ఎన్నికలకు ముందే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందు కు 13వ పోలీసు బెటాలియన్‌లోని కానిస్టేబుళ్లను వివి ధ ప్రాంతాల్లో విధులకు పంపించారు. మున్సిపల్ ఎన్నికలు పూర్తికాగానే వెంటనే ప్రాదేశిక ఎన్నికల కోసం మరో చోటకు, ఆ తరువాత సార్వత్రిక ఎన్నికల విధు లు ఇలా ఒకదాని తరువాత మరోటి ఇలా మూడు నెలలు ప్రత్యేక పోలీసులు విధులకు హాజరయ్యారు. ఎన్నికల విధులు తప్పనిసరి కావడంతో, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండడం, ఎన్నికలు జరిగినా ఫలితాలు వెలువడేందుకు కొంత ఆలస్యం కావడంతో బ్యాలెట్ బాక్సులకు, ఈవీఎంలకు భద్రత కల్పించ డం, జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్బావ వేడుకల నిర్వహణ, వెనువెంటనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఏర్పడిన అసెంబ్లీకి ప్రత్యేక భద్రత ఇలా నాలుగు నెలలుగా విధుల్లోనే ప్రత్యేక పోలీసులు తమ సేవలందించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత అసెంబ్లీ రక్షణ విధులను కేటాయించారు. ఇటీవలే విధులు నిర్వహించిన పోలీసులు వారి బెటాలియన్లకు తిరిగి వెళ్లగా, వారికి బెటాలియన్‌లోనే ఇతరత్రా విధులను కేటాయించారు. దీంతో సెలవులున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి వారిది. అధికారులు చెప్పిన పనులు చేయకపోతే, వారికి అనుమతులు, సెలవుల మంజూరు చేయకపోవడంతోనే వీరు తీవ్రంగా ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. సెలవున్నా అనుమతి ఉండదు.. బెటాలియన్‌లో పనిచేసే పోలీసులను నెలరోజులు బయట డ్యూటీకి పంపిస్తుంటారు. వీరికి బయట డ్యూటీ చేస్తే నాలుగు రోజులు సెలవు ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. ఇవి కాకుండా ఏటా 15 సీఎల్స్, 30 ఈఎల్స్ కూడా ఉన్నాయి. ఆదివారం, పండుగలకు కూడా సెలవులను వాడుకునే అవకాశం ఉంది. కానీ.. బయట డ్యూటీకి వెళ్లి బెటాలియన్‌కు తిరిగి వచ్చిన కానిస్టేబుళ్లకు అధికారులు సెలవులు ఇవ్వకుండా వారికి బెటాలియన్‌లోనే ఇతర విధులను కేటాయిస్తున్నారు. సెలవులు కావాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే అధికారుల ఇళ్లల్లో వారు చెప్పిన పనులు చేస్తేనే అనుమతి లభిస్తుందని గుడిపేట ప్రత్యేక పోలీసులు ఆరోపిస్తున్నారు. పై అధికారులకు ఏ కానిస్టేబుల్ అనుకూలంగా ఉంటే వారికి సెలవులు వాడుకునేందుకు అవకాశం కల్పించడం, ఇతర డ్యూటీలు వేయకపోవడం, అందరిపై అజమాయిషీ చెలాయించే అధికారం ఇవ్వడంతో ఇతర కానిస్టేబుళ్లకు మింగుడు పడడం లేదు. దీంతో వీరు మరింత మానసికంగా కుంగిపోయి, విచక్షణ కోల్పోతున్నట్లు బెటాలియన్ పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు బెటాలియన్‌లో జరిగే అక్రమాలపై ఉన్నత స్థాయి అధికారి గానీ, సిట్టింగ్ జడ్జితో గానీ విచారణ జరిపిస్తే కానిస్టేబుళ్లు ఎదుర్కొనే సమస్యలు, బెటాలియన్లలో జరిగే అక్రమాలన్నీ వెలుగు చూస్తాయని ప్రత్యేక పోలీసులు కోరుతున్నారు. కేసీఆర్ హామీ కోసం ఎదురుచూపు.. పోలీసులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారానికి ఒకసారి సెలవు తప్పనిసరిగా తమ ప్రభుత్వం ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో పోలీసు వర్గాల్లో ఆనందం నెలకొంది. రోజుల తరబడి సెలవులు లేకుండా పనిచేయడంతో పోలీసులకే కాకుండా, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారానికోసారి సెలవు మంజూరు చేస్తామని సీఎం హామీతో కనీసం ఒక్క రోజైనా తమ కుటుంబంతో గడపవచ్చని పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జీవోల ప్రకారం ప్రత్యేక పోలీసులకు అందే సెలవులు సక్రమంగా అందేలా, బెటాలియన్‌లోని అధికారులను ఆదేశించాలని, కానిస్టేబుళ్లకు ఎలాంటి సమస్య వచ్చినా, వెంటనే స్పందించేలా ప్రభుత్వం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.