సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలోని అత్యంత కీలకమైన బలగాల యూనిట్ బెటాలియన్‌లో సంక్షేమ విభాగపు నిధులకు గండిపడింది. ప్రతీ బెటాలియన్‌లో బెటాలియన్ వెల్ఫేర్ ఆఫీ సర్ వింగ్ ఒకటి ప్రత్యేకంగా ఉంటుంది. బెటాలియన్‌లో క్యాంటీన్, గ్యాస్, పెట్రోల్ పంప్, కామన్ గుడ్ ఫండ్ తదితరాల మెయింటెనెన్స్ మొత్తం ఈ బెటాలియన్ వెల్ఫే ర్ ఆఫీసర్ పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే ఈ విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్ ఉన్నతాధికారులను బురిడీ కొట్టించి కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది.
చెక్కులపై సంతకాలు ఫోర్జరీ
యూసఫ్‌గూడలోని మొదటి పోలీస్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ వెల్ఫేర్ వింగ్‌లో పనిచేస్తున్నాడు. ప్రతీ నెలా మెయింటెనెన్స్ కింద వచ్చే డబ్బులను బ్యాంకులో జమ చేయడం, అకౌంట్ బుక్కులు, చెక్కులను అప్‌డేట్ చేస్తూ ఉండటం ఇతడి విధి. బ్యాంకుల్లో జమ చేయాల్సిన నగదును సొంత ఖాతాలో జమ చేసుకోవడం, బ్యాంకు చలానా కట్టినట్టుగా స్టాంప్, బ్యాంకు అధికారుల సంతకాలు తానే పెట్టి ఆడిటింగ్ ఫైళ్లలో పెట్టేవాడు. ఇలా 2013 నుంచి 2018 మార్చి వరకు మొత్తం రూ.40 లక్షల మేర శ్రీకాంత్ కుంభకోణానికి పాల్పడ్డట్టు బెటాలియన్ విభాగం గుర్తించింది. బ్యాంకులో నగదు జమ చేసినట్టుగా ప్రతీ నెలా పాస్‌బుక్ అప్‌డేట్ చేయడం కోసం తన ఇంట్లోనే అప్‌డేట్ చేసే సాఫ్ట్‌వేర్, ప్రింటర్‌ను పెట్టుకున్నాడు. ఇలా ప్రతీ నెలా గ్యాస్, క్యాంటీన్, ఇతర మెయింటెనెన్స్ కింద వచ్చిన నిధులను పక్కదారి పట్టించినట్టు తేలింది.
కానిస్టేబుల్‌పై కేసు నమోదు...
కుంభకోణానికి పాల్పడ్డ కానిస్టేబుల్ శ్రీకాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఫిర్యాదు చేశారు. అయితే ఇక్కడ ఉన్నతాధికారులు పాత్రపై కూడా విచారణ జరపాల్సి ఉంది. చెక్కులపై సంతకాలు చేయడం, వాటి డిపాజిట్, తదితర వ్యవహారాలన్నింటిపై ప్రతీ మూడు నెలలకోసారి ఆడిటింగ్ జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో బాంకుల్లో ఉన్న నగదును కూడా చెక్ చేయాలి. కేవలం పాస్‌బుక్‌లను ఆధారంగా చేసుకొని ఆడిటింగ్ చేయడం, శ్రీకాంత్‌పై ఆరోపణలున్నా సంబంధిత ఉన్నతాధికారులు చూసీచూడనట్టుగా వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ స్కాంలో గతంలో పనిచేసిన వెల్ఫేర్ అధికారులతో పాటు కమాండెంట్లపై విచారణ జరపాలని పోలీస్ శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. 2013 నుంచి జరిగిన ఈ స్కాంలో ఆ సమయాల్లో పనిచేసిన బెటాలియన్ వెల్ఫేర్ అధికారులు, కమాండెంట్ల నుంచి సంబంధిత నగదును రికవరీ చేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. గతంలోనే ఇలాంటి అవినీతి ఆరోపణల వ్యవహారంపై ‘సాక్షి’కథనాలు ప్రచురించింది. బెటాలియన్ వెల్ఫేర్ అధికారులతో పాటు ఎంటీవో (మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అధికారి) పోస్టు కోసం భారీ స్థాయిలో పైరవీలు సాగుతున్నట్టు ఉన్నతాధికారులు గుర్తించారు. కొంతమంది రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయినా.. మళ్లీ అక్కటే అటాచ్‌మెంట్ పేరుతో పాతుకుపోవడాన్ని పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఇలా బయటపడింది...
గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న ఈ కుంభకోణం ఓ చెక్కు వల్ల బయటపడింది. మార్చి 13న శ్రీకాంత్ తన స్నేహితుడు ఖాతాలో రూ.రెండు లక్షల చెక్కును బదిలీ చేశాడు. మొదటి బెటాలియన్‌కు సంబంధించి వివిధ బ్యాంకుల్లో 13 ఖాతాలున్నాయి. శ్రీకాంత్ నగదు జమచేసే బ్యాంకు ఎస్‌బీహెచ్ కాగా, బ్యాంకుల విలీనం వల్ల ఎస్‌బీహెచ్ ఎస్‌బీఐలో విలీనం అయ్యింది. మార్చి వరకు పాత బ్యాంకు చెక్కులు చెలామణి కావడంతో పాత డేట్‌తో ఒక చెక్కును ఎస్‌బీఐ అకౌంట్ ద్వారా తన స్నేహితుడి ఖాతాకు రూ.రెండు లక్షలు పంపించాడు.
అయితే ఈ ఎస్‌బీఐ ప్రధాన ఖాతాకు సంబందించిన సంక్షిప్త సందేశాలు ఏఆర్‌ఎస్‌ఐకి వెళ్లింది. ఈ సందర్భంగా రూ.రెండు లక్షల చెక్కుకు సంబంధించి తామేమి లావాదేవీలు జరపలేదని గ్రహించి ఏఆర్‌ఎస్‌ఐ బ్యాంకుకు వెళ్లి సంప్రదించగా, శ్రీకాంత్ అనే కానిస్టేబుల్ పాత ఎస్‌బీహెచ్ చెక్కును బదిలీ చేసినట్టు తెలిపారు. దీంతో సందేహం వచ్చి బ్యాంకు పాసుబుక్‌లో ఉన్న నగదు, బ్యాంకులో డిపాజిట్‌లో ఉన్న నగదును టాలీ చేశారు. ఇక్కడే శ్రీకాంత్ అసలు కథ బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment