సాక్షి, నిజామాబాద్: రాత్రి వేళల్లో దొంగతనాలు, దోపిడీలను అరికట్టేందుకు నిర్వహించే పెట్రోలింగ్ విధులను పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధుల కోసమే నియమితులైన సి బ్బంది, వారిని పర్యవేక్షించే అధికారులు తమకేమీ పట్టనట్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో నిజామాబాద్ నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా తరచూ దోపిడీలు, దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు, దుకాణ సముదాయాలను సైతం దొంగలు యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు.
ఈ ఘటనలు పరిశీలిస్తే పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కార్తికేయ చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల సుమారు 35 మందికి మెమోలు జారీ చేశారు. ఇందులో ఎస్‌ఐలు, ఎస్‌హెచ్‌ఓలు సైతం ఉన్నారు. వారి వారి పోలీస్‌స్టేషన్లలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందిపై పర్యవేక్షణ లేకుండా అలసత్వం వహించినందుకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకా రం ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలి. షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎన్ని గంటలకు ఏఏ రూట్లో తిరగాలి.. ఏ పాయింట్ వద్ద ఎన్నిగంటలకు హాజరుకావాలి. వంటివన్నింటిని ప్రత్యేకంగా చార్ట్ రూపొందించి నిర్దేశిస్తారు. ఆ మేరకు పెట్రోలింగ్ విధులు నిర్వర్తించాలి. అయితే పోలీసు అధికారుల నిర్లక్ష్యం కార ణంగా సిబ్బంది ఈ విధులను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు.
జీపీఆర్‌ఎస్‌తో గుర్తింపు..
అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను అధికారులు సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెట్రోలింగ్ వాహనాలకు జీపీఆర్‌ఎస్ పరికరాన్ని అమర్చారు. పరికరం అమర్చితే ఆ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది.. ఎక్కడ ఎంత సేపు ఆగింది.. అనేది పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో రికార్డు అవుతుంది. ఇలా రికార్డులను ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు అలసత్వం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్య లు చేపడుతున్నారు.
సిబ్బంది కొరత..
మరోవైపు పోలీసుశాఖలో ఖాళీలతో కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపై భారం పడుతోంది. ఆయా పోలీస్‌స్టేషన్లకు సరిపడా కానిస్టేబుళ్లు లేరు. దీంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం పెరుగుతోంది. దీనికి తోడు ఏమైనా ప్రత్యేక ఉత్సవాలు, వీఐపీల పర్యటనలు, సభలు, సమావేశాలు జరిగినప్పుడు కింది స్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం కూడా పెట్రోలింగ్ విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారు తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment