CP Kartikeya
-
నిజామాబాద్‌లో స్వయంగా తనిఖీలు చేసిన సీపీ కార్తికేయ
-
నిజామాబాద్‌లో వాహనాలను తనిఖీ చేసిన సీపీ కార్తికేయ
-
ప్రజలకు చేరువగా పోలీస్ ఠాణాలు
సాక్షి, నిజామాబాద్: ఒకప్పుడు పోలీస్ స్టేషన్లు అంటే అల్లంత దూరం ఉండేవారు జనాలు. అయితే ఇప్పుడు తీరు మారింది. పోలీసులు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్, 5ఎస్ విధానం అందులో భాగమే. ప్రధానంగా 5ఎస్ విధానం ద్వారా పోలీస్ స్టేషన్లను ఆదర్శంగా మారుస్తున్నారు. స్టేషన్‌కు వెళ్లి ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు పోలీసులు యాక్షన్ మార్చారు. ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదుదారులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. వారి ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వారికి కేసుల పూర్వాపరాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. రిసెప్షన్ సెంటర్, రికార్డు రూం, కేసుల ఆన్లైన్, ఫిర్యాదుదారులకు సమాచారం, విచారణ గది, సిటిజన్ చార్ట్.. ఇలా ఓ పద్ధతి ప్రకారం ముందుకు సాగుతున్నారు! వినియోగించుకోవాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసుస్టేషన్లను ఆధునీకంగా తీర్చిదిద్దాలని, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు మెరుగైన సేవలు అందించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే పోలీస్స్టేషన్లలో 5ఎస్ విధానంతో పాటు మరికొన్ని కొత్త పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. గతేడాది కాలంలో ఈ పద్ధతులు ఆయా పోలీస్స్టేషన్లలో అమలు చేసేందుకు సీపీ కార్తికేయ అధికారులకు సూచించారు. పలుమార్లు సమీక్షలు నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు కమిషనరేట్ పరిధిలో 4వ టౌన్ పోలీసు స్టేషన్ మాత్రమే పూర్తిస్థాయిలో అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. స్టేషన్‌కు నూతన హంగులు.. జిల్లా కేంద్రంలోని 4వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్నతాధికారులు ఆదేశాలు పక్కా అమలవుతున్నాయి. సిటిజన్ ఫ్రెండ్లీ టాస్క్‌గా సీపీ కార్తికేయ వివరించారు. ఈ పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా ఫిర్యాదులు తీసుకునేందుకు రిసిప్షన్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఓ మహిళా కానిస్టేబుల్ అందుబాటులో ఉంటారు. ఫిర్యాదుల సేకరణ త్వరగా తీసుకోవడం, బాధితులకు న్యాయం జరిగేలా ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ సిటిజన్ ఏర్పాటు చేశారు. దీనిలో అన్ని వివరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రతి ఫిర్యాదుదారుడికి ఫోన్ చేసిన వారి కేసు వివరాలు, కేసు పురోగతి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. పోలీసుస్టేషన్‌ను నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఫిర్యాదుదారుడికి సౌకర్యం... ప్రత్యేక ఆన్లైన్ కేంద్రం, స్టేషన్‌కు వచ్చేవారికి సౌకర్యాలు, విచారణ గది, రిసెప్షన్ కౌంటర్, సిటిజన్ చార్ట్‌ను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా చెట్ల పెంపకం, పార్కింగ్ స్థలంతో పాటు చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ప్రతి ఫిర్యాదుదారుడికి సౌకర్యాలు కల్పించారు. మంచినీటి సదుపాయంతోపాటు బాధలను సమస్యలను చెప్పుకునేవారికి ప్రత్యేక రిసెప్షన్ అందుబాటులో ఉంది. 5ఎస్ విధానంలో ఉండే అంశాలు ఇక్కడ అమలు అవుతున్నాయి. డయల్ 100 కాల్స్ వస్తే 5 నిమిషాల్లో స్పందించి వారికి ఫీడ్ బ్యాక్‌ను అందించే సదుపాయం ఉంది. ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేయడం, ఆ సమాచారాన్ని ఫిర్యాదుదారుడికి ఎప్పటికప్పుడు అందించనున్నారు. ప్రతి శనివారం కోర్టు డ్యూటీ ఆఫీసర్ ద్వారా మీటింగ్ పెట్టించి మిగితా సిబ్బంది వర్టికల్ విధానం ద్వారా పకడ్బందీగా అమలయ్యేలా చేస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా ఎవరి పని వారికి విభజించారు. పోలీసుస్టేషన్లో జోన్లను విభజించి నోడల్ ఆఫీసర్, డివిజన్ అసిస్టెంట్ ప్రతి జోన్‌కు సిబ్బందిని కేటాయిస్తున్నారు. ప్రతి నెల 5ఎస్ విధానంపై సమీక్ష నిర్వహించి జిల్లాలోనే 4వ టౌన్ మిగితా పోలీసుస్టేషన్‌కు ఆదర్శంగా నిలుస్తుందని సీపీ ప్రశంసిస్తున్నారు. మిగితా స్టేషన్ల సిబ్బందికి ఆదేశిస్తున్నారు. మెరుగైన సేవలు అందిస్తాం.. స్టేషన్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఆధునీకరించి 5ఎస్ విధానం అమలు చేస్తున్నాం. ప్రతి ఫిర్యాదుదారుడికి తక్షణమే న్యాయం చేకూర్చడం, ఫిర్యాదు తీసుకోవడంలో స్పందన, ప్రత్యేక రిసిప్షన్, సౌకర్యాలు ఏర్పటు చేశాం. మరింత మెరుగైన సేవలు తీసుకువస్తాం. ప్రజలకు సేవలు కొనసాగిస్తాం. –లక్ష్మయ్య, 4వ టౌన్ ఎస్ఐ -
అభాసుపాలైన టాస్క్‌ఫార్స్..!
సాక్షి, నిజామాబాద్: టాస్క్‌ఫోర్స్.. ఈ పేరు వింటేనే అసాంఘిక శక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టాలి. పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా నియమించే ఈ విభాగానికి సీపీకి ఉండే అధికారాలన్నీ ఉంటాయి. సీపీ పరిధి ఏ మేరకు ఉంటుందో ఆంత పరిధిలో టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించవచ్చు. స్థానిక పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తున్న చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు నియమించిన విభాగం ఇది. మరి ఇలాంటి విభాగమే జిల్లాలో అభాసు పాలుకావడం ఇప్పుడు పోలీసువర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్మూర్ డివిజన్లో భారీ స్థాయిలో కొనసాగుతున్న ఓ పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ విభాగం దాడి చేసింది. ఈ ఘటనలో విభాగం ఇన్చార్జిగా ఉన్న సీఐ సత్యనారాయణ ఇద్దరు అధికార పార్టీ నేతలను కేసు నుంచి తప్పించేశారనే ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసు ఉన్నతాధికారులు ఆయనపై ఆకస్మిక బదిలీ వేటు వేశారు. ఆయనను ఏఆర్ వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆ విభాగం పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. కమిషనరేట్‌లో ప్రత్యేకం.. ప్రత్యేక అధికారాలు కలిగిన టాస్క్‌ఫోర్స్ విభాగం కేవలం పోలీసు కమిషనరేట్ ఉన్న చోట మాత్రమే ఏర్పాటు చేస్తారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వం వహిస్తున్న విభాగంలో సుమారు పది మంది వరకు ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఉంటారు. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు లభిస్తే చాలు విభాగం జిల్లా అంతట ఎక్కడైనా ఆకస్మిక దాడులు (రైడ్స్) నిర్వహించవచ్చు. సెర్చ్ వారెంట్ కూడా ఈ విభాగానికి అవసరం లేదు. మరి అంతటి అధికారాలున్న ఈ విభాగం అధికార పార్టీ నేతలకు వంతపాడటం తీవ్ర విమర్శలకు దారితీసింది. స్థానిక పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల చెప్పుచేతల్లో పనిచేయడం సర్వసాధారణమై పోవడమే పోలీసుశాఖ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. మరి అలాంటిది ప్రత్యేక అధికారాలు కలిగిన ఈ విభాగం కూడా అదే అధికార పార్టీ నేతలకు తొత్తుగా వ్యవహరించడంతో స్థానిక పోలీసులకు, ఈ ప్రత్యేక విభాగానికి ఏం తేడా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉత్తర్వులు వెనక్కి తీసుకుందామా..? టాస్క్‌ఫోర్స్ సీఐపై బదిలీ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేసిన పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయాన్ని మార్చుకునే యోచనలో ఉన్నారు. సీఐని వెకెన్సీ రిజర్వుకు బదిలీ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేసే యోచనలో ఉన్నట్లు ఆ శాఖలో చర్చ జరుగుతోంది. ఈవిషయమై సీపీ కార్తికేయను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. -
పోలీసు శాఖలో.. 'మెమో' కలకలం
సాక్షి, నిజామాబాద్: రాత్రి వేళల్లో దొంగతనాలు, దోపిడీలను అరికట్టేందుకు నిర్వహించే పెట్రోలింగ్ విధులను పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ విధుల కోసమే నియమితులైన సి బ్బంది, వారిని పర్యవేక్షించే అధికారులు తమకేమీ పట్టనట్లు అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీంతో నిజామాబాద్ నగరంతో పాటు, జిల్లా వ్యాప్తంగా తరచూ దోపిడీలు, దొంగతనాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా నగరంలోని ప్రధాన వ్యాపార కూడళ్లు, దుకాణ సముదాయాలను సైతం దొంగలు యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. ఈ ఘటనలు పరిశీలిస్తే పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీపీ కార్తికేయ చర్యలకు ఉపక్రమించారు. ఇటీవల సుమారు 35 మందికి మెమోలు జారీ చేశారు. ఇందులో ఎస్ఐలు, ఎస్హెచ్ఓలు సైతం ఉన్నారు. వారి వారి పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బందిపై పర్యవేక్షణ లేకుండా అలసత్వం వహించినందుకు నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకా రం ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలి. షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తుంటారు. ఎన్ని గంటలకు ఏఏ రూట్లో తిరగాలి.. ఏ పాయింట్ వద్ద ఎన్నిగంటలకు హాజరుకావాలి. వంటివన్నింటిని ప్రత్యేకంగా చార్ట్ రూపొందించి నిర్దేశిస్తారు. ఆ మేరకు పెట్రోలింగ్ విధులు నిర్వర్తించాలి. అయితే పోలీసు అధికారుల నిర్లక్ష్యం కార ణంగా సిబ్బంది ఈ విధులను తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. జీపీఆర్ఎస్తో గుర్తింపు.. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పోలీసు వ్యవస్థలో జరుగుతున్న లోపాలను అధికారులు సరి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా పెట్రోలింగ్ వాహనాలకు జీపీఆర్ఎస్ పరికరాన్ని అమర్చారు. పరికరం అమర్చితే ఆ వాహనం ఎక్కడెక్కడ తిరిగింది.. ఎక్కడ ఎంత సేపు ఆగింది.. అనేది పూర్తి స్థాయిలో ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఇలా రికార్డులను ఆధారంగా చేసుకుని ఉన్నతాధికారులు అలసత్వం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్య లు చేపడుతున్నారు. సిబ్బంది కొరత.. మరోవైపు పోలీసుశాఖలో ఖాళీలతో కింది స్థాయిలో పనిచేసే సిబ్బందిపై భారం పడుతోంది. ఆయా పోలీస్స్టేషన్లకు సరిపడా కానిస్టేబుళ్లు లేరు. దీంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం పెరుగుతోంది. దీనికి తోడు ఏమైనా ప్రత్యేక ఉత్సవాలు, వీఐపీల పర్యటనలు, సభలు, సమావేశాలు జరిగినప్పుడు కింది స్థాయి సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. తగినంత సిబ్బంది లేకపోవడం కూడా పెట్రోలింగ్ విధులు నిర్వర్తించడం ఇబ్బందిగా మారు తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
జిల్లాలో ఉగ్రవాదులు లేరు: సీపీ కార్తికేయ
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామంలో గాంధీ విగ్రహానికి కొంత మంది అ సాంఘిక శక్తులు గాంధీ ముఖానికి బొగ్గుతో రాసి కాగితాల దండ వేయడంపై పోలీసుశాఖ సీరియస్‌గా దర్యాప్తు జరుపుతోందని సీపీ కార్తికేయ ఒక ప్రకటనలో తెలిపారు. సమాజంలోని అసాంఘిక శక్తుల ఆట కట్టించి, కూకటి వేళ్లతో పెకిలిస్తామని సీపీ పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా ఫొటోలు, వీడియోలు వస్తే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావద్దని, ఇతరు లు పోస్టుచేయవద్దని సూచించారు. సో షల్ మీడియాపై పూర్తి స్థాయి దృష్టి సారించామన్నారు. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దన్నారు. నిజామాబాలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం లేదన్నారు. ఈ విషయంలో నిజామాబాద్ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని స్పష్టం చేశారు. -
హుండీ ఎత్తుకెళ్లిన దొంగల అరెస్ట్
సాక్షి, నిజామాబాద్: కొద్ది రోజుల క్రితం జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో జరిగిన చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ నిందితులను లింగం, రమేశ్, నరేశ్‌లుగా గుర్తించారు. వీరు పాత నేరస్థులేనని తెలిపారు. కాగా వీరి దగ్గరి నుంచి రూ.1,02,450 హుండీ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో 15 రోజుల కింద అర్ధరాత్రి వినాయక్‌నగర్‌లోని శ్రీనగర్‌కాలనీలో మూడు బంగారు దుకాణాల్లో చోరీలకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు సీపీ కార్తికేయ బుధవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. మహారాష్ట్రకు చెందిన అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తించామన్నారు. మహారాష్ట్రలోని జాల్నా జిల్లాకు చెందిన దీపక్‌సింగ్ గ్యాంగ్ నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలకు పాల్పడిందన్నారు. వినాయక్‌నగర్‌లో మూడు బంగారు దుకాణాల్లో మొత్తం ఐదుగురు చోరీకి పాల్పడి నగదును దోచుకెళ్లారన్నారు. సీసీ పుటేజీల ఆధారంగా వీరు టాటా సుమోలో వచ్చి, దోపిడీ చేసి పారిపోయిన దృశ్యాలను పరిశీలించామన్నారు. నవీపేటలో సీసీ పుటేజీని పరిశీలించగా దీన్ని గుర్తించామన్నారు. దీపక్‌సింగ్‌పై నిఘా పెట్టి విచారణ చేపట్టగా ఇదే గ్యాంగ్ చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. గతంలో ఆర్మూర్‌లో వరుసగా షెట్టర్ చోరీలు, ఇటీవల బోధన్‌లో చోరీ, నిజామాబాద్‌లో మూడు బంగారు దుకాణాల్లో చోరీ ఇదే గ్యాంగ్ చేసిందన్నారు. నాందేడ్ జిల్లాకు చెందిన షేక్‌సద్దామ్, దీపక్‌సింగ్‌ను అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. వారి నుంచి 4 కిలోల వెండి, మూడు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దుండగులు వినియోగించిన బైక్‌లు, టాటా సుమోను స్వాధీనం చేసుకున్నామన్నారు. దీపక్‌సింగ్ ముఠా నిజామాబాద్, మహారాష్ట్రలో వరుస చోరీలకు పాల్పడుతుందని అంతర్రాష్ట్ర దొంగల ముఠాగా కొనసాగుతుందని సీపీ వెల్లడించారు. నగర సీఐ నరేష్, 4వ టౌన్ ఎస్ఐ లక్ష్మయ్య, కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. -
ప్రజాసేవలో తెలంగాణ పోలీసు
రెంజల్(బోధన్): సమాజంలో జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించేందకు రాష్ట్ర పోలీసు వ్యవస్థ కృషి చేస్తోందని సీపీ కార్తికేయ అన్నారు. అందుకు అవసరమైన ఆదేశాలకు జిల్లా పోలీసు యంత్రాంగానికి జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తమ పోలీసులు అంకితభావంతో పనిచేస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రెంజల్ మండలం నీలా గ్రామంలో గురువారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని హైస్కూల్లో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ మాట్లాడారు. జాగ్రత్తలే మనిషికి బలం అని అన్నారు. ఎదుటివారి మాటలను నమ్మకుండా జాగ్రత్తగా వ్యవహరించినప్పుడే మోసాల నుంచి తమను తమం కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. అపరిచితులు తమ ఏటీఎం కార్డు గురించి అడిగితే పిన్ నంబరు, ఓటీపీలను చెప్పవద్దన్నారు. ఖాతాదారులకు బ్యాంకుల నుంచి గాని పోలీసుల నుంచి ఎలాంటి సమాచారం ఫోన్ ద్వార అడగరని తెలిపారు. మత సామరస్యానికి సంబంధిచి జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. మహిళల భద్రతకు షీటీంలకు ఏర్పాటు చేశామన్నారు. దేవుని గుడికి ఎంత నమ్మకంతో వెళతారో ఆదే నమ్మకం పోలీసులపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామన్నారు. గల్ఫ్ మోసాలను నియంత్రించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఇతర దేశాలకు పంపిస్తామని వస్తే ముందుగా వారి సమాచారాన్ని సమీపంలోని స్టేషన్లో అందించాలన్నారు. గ్రామాల్లో ఇంటర్ పూర్తి చేసిన యువకులకు ఉచితంగా పోలీసు శాఖ ద్వార శిక్షణ అందింస్తుననట్లు తెలిపారు. పోలీసు జీతంతో పాటు వీఆర్వో జీతాలకు ప్రీపెరయ్యె వారికి సైతం శిక్షణ దోహదపడుతుందన్నారు. సమావేశంలో అదనపు డీసీపీ(ఆడ్మిన్) ఆకుల రాంరెడ్డి, బోధన్, ఆర్మూర్, ఎస్బీఐ, ఏఆర్ ఏసీపీలు రఘు, శివకుమార్, మహేశ్వర్, రవీందర్, 8 మంది సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
పేపర్ లెస్ విధానానికి అలవాటుపడాలి
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీస్‌స్టేషన్‌లో ఇక నుంచి పేపర్ లెస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని పోలీస్ కమిషనర్ కార్తికేయ అధికారులకు సూచించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణకు సంబంధిత ఏసీపీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో సమీక్ష నిర్వహించారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది పేపర్ లెస్ విధానాన్ని వాడుకలోకి తీసుకురావాలని సూచించారు. అందుకోసం సంబంధిత అధికారులు పోలీస్‌స్టేషన్‌లో కేసుల అన్ని వివరాలు ట్యాబ్స్ లేదా, ప్యాడ్లను ఉపయోగించాలన్నారు. ఇందులో పోలీస్‌స్టేషన్‌లో కేసుల వివరాలు, కోర్టు పనులలో అన్ని విషయాలను పొందుపర్చాలన్నారు. దీంతోపాటు క్రైం క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్కింగ్ సిస్టంలో పోలీస్‌స్టేషన్‌లోని ఎఫ్ఐఆర్, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలని సూచించారు. జిల్లాలో సమస్యత్మాక ప్రాంతాలలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులను త్వరగా పూర్తి చేసి దోషులను అరెస్టు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎన్బీడబ్ల్యూఎస్లపై ప్రత్యేకంగా డివిజన్ పరిధిలో టీమ్స్‌లు ఏర్పాటు చేసి త్వరగా ఎగ్జిక్యూట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలగు చట్టవ్యతిరేక కార్యాకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి లాడ్జీల్లో ఎప్పటికప్పుడు ముమ్మరంగా తనిఖీలు చేయాలన్నారు. నేరాలు అరికట్టేందుకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులను పక్కగా నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. అదే పనిగా నేరాలకు అలవాటు పడిన నేరస్తులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. సమావేశంలో అదనపు డీసీపీలు శ్రీధర్‌రెడ్డి, ఆకుల రాంరెడ్డి, ఆర్మూర్, బోధన్, ఏఆర్ ఏసీపీలు శివకుమార్, రఘు, సీహెచ్ మహేశ్వర్, అన్ని సబ్ డివిజన్ల పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, సీసీఆర్బీ ఎస్ఐ రాజేశ్వర్‌గౌడ్, ఆర్ఐలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఏటీఎం వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి : సీపీ కార్తికేయ
నిజామాబాద్క్రైం: నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ల పరిధిలోని ప్రజలకు ఏటీఎం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆదివారం సీపీ కార్తికేయ విలేకరులతో వెల్లడించారు. మీ ఏటీఎం పిన్ నెంబర్రు ఇతరులకు తెలియజేయకూడదు. మీ బ్యాంకింగ్ లావాదేవీలు ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలి. బ్యాంక్‌ల వద్ద ఇతరులను ఎవరిని నమ్మవద్దు. ఇతరులను నమ్మినట్లయితే వారు మోసం చేస్తున్న విషయం తెలియనివ్వరు. అనంతరం మీ ఖాతా డబ్బులు సులువుగా డ్రా చేసుకొని తీసుకెళ్లుతారు. ఎవరైన బ్యాంక్ నుంచి ఫోన్ చేసి బ్యాంక్ మేనేజర్ లేదా ఇతర సిబ్బందిని మాట్లాడుతున్నాను. మీ ఏటీఎం వివరాలు లేదా ఖాతా వివరాలు ఎలాంటివి అడిగిన తెలుపరాదు. ఎవరైన మీకు ఫోన్‌చేస్తే మీరు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులకు, దగ్గరలోని పోలీస్‌స్టేషన్ సిబ్బందికి, కంట్రోల్ సెల్ నం.9490618000 సమాచారం అందించండి. ఏటీఎం పిన్ నెంబర్‌ను కార్డు పేపర్ మీదా రాసిపెట్టుకోరాదు. ప్రతి ఒక్కరూ ఏటీఎం పిన్ నెంబర్ జ్ఞాపకం ఉంచుకోవాలి. మీ బ్యాంక్, ఏటీఎం లావాదేవీలు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి. మనం ఏటీఎం కార్డు మిషన్‌లో పెట్టినప్పుడు/కార్డు స్లాట్‌లో మనకు అంతరాయం అనిపిస్తే అలాంటి సమయంలో బ్యాంకు అధికారులకు, సంబంధిత పోలీసుస్టేషన్ వారికి తేలియజేయడంలో ఆలస్యం చేయవద్దు. -
ఇందూరులో కార్డన్ సెర్చ్
నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్): ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రజల ఇంటి తలుపులు తట్టడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు రండని పిలుపులతో ఏమైందోనంటూ భయపడ్డారు. కిటికీలో నుంచి చూస్తే ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో పోలీసులు వచ్చారేంటి అని కంగారుపడ్డారు. కొందరు తమ బయటకు వచ్చేందుకు భయపడ్డారు. అలాంటి వారిని బయటకు రప్పించేందుకు పోలీసులు ముందస్తుగా వారితో పరిచయం ఉన్న వ్యక్తిని వెంట తీసుకెళ్లి అతడితో ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రప్పించారు. అనంతరం పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నేరాలను అరికట్టేందుకే: సీపీ కార్తికేయ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించాం. ఇండ్లున్నవారు పరిచయం లేనివారికి ఇల్లు అద్దెకు ఇవ్వరాదు. కొత్త వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి పూర్తి సమాచారం తెలుసుకోవాలి. ఆధార్ కార్డు పరిశీలించాలి. కొత్త వ్యక్తులు తిరిగితే పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలి. సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో తనిఖీలు.. నేరాల నియంత్రణలో భాగంగా నగరంలోని ఒకటో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో గల ఎరుకలవాడ, ఇస్లాంపురా, కోజాకాలనీ, అశోక్‌నగర్, మహబుబ్ భాగ్, మిర్చి కంపౌడ్ ప్రాంతాల్లో సీపీ కార్తికేయ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 4.30 నుంచి 6.30 గంటల వరకు కార్డన్ సెర్చ్ చేశారు. అదనపు డీసీపీ ఆకుల రాంరెడ్డి, ముగ్గురు ఏసీపీలు, 12 మంది సీఐలు, ముగ్గురు ఆర్ఐలు, 16మంది ఎస్ఐలు, 250 మంది పోలీసులు, 40 మంది మహిళా కానిస్టేబుళ్లు కార్డన్ సెర్చ్‌లో పాల్గొన్నారు. వారు 12 బృందాలుగా తనిఖీ చేశారు. అనుమానితులను ఆరాతీసి, క్రిమినల్స్ ఎవరైనా షెల్టర్ తీసుకున్నారా?, పాత నేరస్తులు ఉన్నారా లేదా ఆరాతీశారు. ప్రతి వాహనం డాక్యూమెంట్లను పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు, నెంబర్ ప్లేట్లు లేని మొత్తం 67 బైకులు, 7 ఆటోలు, ఒక జీపును పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని గాంధీగంజ్‌కు తరలించారు. ఐదుగురు పాత రౌడీ షీటర్లను, 10 మంది అనుమానితులను ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో 25 బైకులు, మూడు ఆటోలు, ఒక జీపు ఉంది. ధ్రుపత్రాలు లేనివారికి ఒకటో టౌన్ ఎస్‌హెచ్‌వో నాగేశ్వర్రావు రూ.28,500 జరిమానాలు విధించారు. -
లైంగిక వేధింపుల నుంచి కాపాడే బాధ్యత అధికారులదే
పోలీస్ కమిషనర్ కార్తికేయ నిజామాబాద్ క్రైం : బాలికలను వేధింపుల నుంచి కాపాడే బాధ్యత ప్రతి ప్రభుత్వ అధికారిపై ఉందని పోలీస్ కమిషనర్ కార్తికేయ అన్నారు. శనివారం సీపీ కార్యాలయంలో చైల్డ్‌లైన్ 1098 నిజామాబాద్ ఆధ్వర్యంలో బాలల వారోత్సవాల్లో భాగంగా పీఎంసీఎస్వో 2012 యాక్ట్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ కార్తికేయ మాట్లాడుతూ బాలికల విషయంలో ప్రభుత్వ శాఖలు అన్ని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అన్ని డివిజన్లకు పోస్టర్లను పంపాలని 1098 సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ వెంకన్న, సీసీఆర్బీ సీఐ సుధాకర్, ఏవో గులాం మొహినొద్దీన్, ఐటీ కేర్ ఇన్చార్జి గంగాధర్, బాలల సంరక్షణ సమితి ప్రతినిధులు శ్రీరాంచంద్ నాయక్, నరసింహం, 1098 సిబ్బంది కో-ఆర్డినేటర్స్ స్వప్న, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.