తల్లీకూతుళ్లను వారి ఇంటి వద్ద వదిలిపెట్టిన సీఐ వెంకటరమణ, సిబ్బంది
ప్రొద్దుటూరు క్రైం : వాహనాలు లేక అర్థరాత్రి సమయంలో రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్న తల్లీకూతుళ్లను పోలీసులు వారి వాహనంలో కూర్చోపెట్టుకొని ఇంటి వద్ద వదలిపెట్టారు. విజయవాడ నుంచి రైలులో వచ్చిన తల్లీకూతుళ్లు ఆదివారం రాత్రి 11.45 గంటల సమయంలో ప్రొద్దుటూరు శివారులోని రైల్వే స్టేషన్‌లో దిగారు. అయితే ఆ సమయంలో ఎలాంటి ఆటోలు లేకపోవడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు.
దీంతో చేసేదేమి లేక ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా పెట్రోలింగ్ పోలీసులు వారిని ఆపడంతో జరిగిన విషయాన్ని తెలిపారు. దిశ యాప్ గురించి వివరించిన పోలీసులు మహిళల సెల్‌ఫోన్లలో యాప్‌ను డౌన్ లోడ్ చేశారు. వాహనాలు చెడిపోయినప్పుడు గానీ, బస్సులు, ఆటోలు తిరగని సమయాల్లో దిశ యాప్ ద్వారా పోలీసుల సాయాన్ని పొందవచ్చని సూచించారు.
అంతేగాక ఏదైనా ముప్పు జరిగే అవకాశం ఉన్న సమయంలో కూడా యాప్‌కు సంబంధించిన ఎస్‌ఓఎస్ బటన్‌ను నొక్కినట్‌లైతే వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని రక్షణగా నిలుస్తారని వివరించారు. తర్వాత మహిళలను వాహనంలో కూర్చోపెట్టుకొని హనుమాన్ నగర్‌లోని వారి ఇంటి వద్ద వదిలి పెట్టారు. అర్థరాత్రి సమయంలో తమను క్షేమంగా ఇంటికి చేర్చిన సీఐ వెంకటరమణ, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, కానిస్టేబుల్ తిరుమలకు మహిళలు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment