అభివృద్ధి వైపు జిల్లా ముందడుగు
కేంద్ర ఆర్థిక సేవారంగ డిప్యూటీ డైరెక్టర్ జెనరల్ ఎంజీ జయశ్రీ
కడప సెవెన్‌రోడ్స్ : ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సాధనలో భాగంగా ఆర్థిక పరిపుష్టితో పాటు అన్ని ప్రామాణికాలలో వైఎస్‌ఆర్ జిల్లా ముందంజలో కొనసాగడం అభినందనీయమని కేంద్ర ఆర్థిక సేవారంగ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంజీ జయశ్రీ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ అధ్యక్షతన ఆకాంక్షిత జిల్లాలో ‘ఆర్థిక పరిపుష్టి – కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్’అనే అంశంపై బ్యాంకు అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఆర్థిక సేవారంగ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంజీ జయశ్రీ ముఖ్య అతిథిగా హాజరు కాగా వారితోపాటు కెనరా బ్యాంక్ డీజీఎం ఆర్తి అగర్వాల్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంజీ జయశ్రీ మాట్లాడుతూ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధి సాధనలో భాగంగా ఆర్థిక పరిపుష్టి, నైపుణ్య అభివృద్ధి అనే అంశాల్లో అత్యుత్తమ పనితీరును కనబరిచినందుకు వైఎస్‌ఆర్ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ‘నీతీ ఆయోగ్’ద్వారా అత్యుత్తమ పురస్కారం బహుకరించడం అభినందనీయమన్నారు. ఆకాంక్ష జిల్లాల లక్ష్య సాధనలో ఆర్థిక పరిపుష్టి అనే ప్రామాణిక పాత్ర 10 శాతం శాతమే అయినా.. బ్యాంకర్ల సహకారం ఎంతో కీలకమైనదన్నారు. బ్యాంకర్లు సమర్థవంతంగా పని చేస్తేనే ఆర్థిక వ్యవస్థ మరింత ధృఢంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా జిల్లాలో డీఆర్డీఏ, మెప్మా పరిధిలోని అన్ని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసి జిల్లా ఆర్థిక అభివృద్ధిలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేయాలన్నారు. బ్యాంకర్లు పొదుపు సంఘాల మహిళలకు రుణాలు అందించి ఆర్థిక చేయుతనివ్వాలన్నారు. కార్యక్రమంలో ముందుగా జేసీ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం జిల్లా పరిపాలన యంత్రాంగం, ఆయా శాఖల అధికారులు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలోని అన్ని బ్యాంకులకు నిర్దేశించిన పలురకాల రుణ లక్ష్యాలు, సాధించిన ప్రగతిని, ఆకాంక్షిత జిల్లా లక్ష్య సాధనలో భాగంగా కీ పాయింట్ ఇండిక్టేటర్స్‌పై ఆయా బ్యాంకుల ప్రతినిధులతో డిప్యూటీ డైరెక్టర్ జన రల్ సమీక్షించారు. జిల్లా లీడ్ బ్యాంకు చీఫ్ మేనేజర్ జనార్దనం పలు శాఖల ద్వారా ప్రభుత్వం అందజేస్తు న్న రుణాల ప్రగతిని వివరించారు. నాబార్డ్ ఏజిఎం విజయ విహారి, రీజర్వ్ బ్యాంక్ ఎల్డిఓ నవీన్ కుమార్, కెనరా బ్యాంకు ఏజిఎం మురళి మోహన్, ఎస్బిఐ ఎజిఎం వాణీ కిషోర్ కుమార్ రెడ్డి, యూబీఐ ఎజిఎం లక్ష్మీ తులసి, ఏపీజిబి ఏజీఎం శ్రీనివాస ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment