సాక్షి రాయచోటి : అందరికీ సుపరిచితుడు...మృధు స్వభావిగా పేరెన్నికగన్న ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే... యేటా వెంకటేశ్వరస్వామిపై భక్తితో అన్నమయ్య కాలిబాట రహదారిలో తిరుమలకు వెళుతూ ఆధ్యాత్మిక వేత్తగా అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అందుకే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభావం కనిపించినా రాజంపేట నియోజకవర్గంలో మాత్రం ఆకేపాటి అమర్‌నాథరెడ్డే కావాలంటూ ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారంటే ఆయనకున్న పట్టు ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాప్రతినిధిగా నేరుగా ఎదుర్కొనలేక తెరవెనుక కుట్రలు, కుతంత్రాలకు తెర తీశారు. ఈ కోవలోనే ఆకేపాటిని మానసికంగా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఆక్రమణల పేరుతో విష ప్రచారం ఒడిగట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే వైఎస్సార్ సీపీలోని కీలక నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
జిల్లా అధ్యక్షుడి కుటుంబంపై కుట్రలు
వైఎస్సార్ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డితోపాటు ఆయన కుటుంబంపై కుట్రలు కొనసాగుతున్నాయి. వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉంటూ మంచి మనిషిగా గుర్తింపు పొందిన ఆకేపాటిని పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. ఈ నేపథ్యంలోనే ఆకేపాటిని అభాసుపాలు చేయాలన్న దురుద్దేశంతో అధికారుల ద్వారా దెబ్బతీసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయన ఇంటిని అక్రమంగా నిర్మించుకున్నారని, అక్రమంగా భూములు సాగు చేస్తున్నారని ఆరోపిస్తూ విష ప్రచారానికి తెర తీశారు. అయితే కుట్రలను ఆకేపాటి దీటు గా ఎదుర్కొంటున్నారు. ఎప్పుడూ కూడా అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటున్నామని, నిజాయితీ నిబద్ధతతో ముందుకెళుతున్నట్లు ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.
ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే వ్యూహం
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ కీలక నేతలపై కక్ష కట్టారు. వారి ఆర్థిక మూలాలతోపాటు ఆస్తులను దెబ్బతీసేలా కూటమి నేతలు వ్యూహం అమలు చేస్తున్నారు. సదరు నేతలు తెరవెనుక ఉంటూ అధికారుల ద్వారా పథకం రచించి అమలు చేస్తున్నారు. ఈ కోవలోనే ఉమ్మడి వైఎస్సార్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్దన్‌రెడ్డికి సంబంధించిన భూముల విషయంలోనూ అధికారుల ద్వారా సర్వే పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కలకడ ఎంపీపీ ఇంటిపై కూడా దాడులు నిర్వహించడం, మాజీ ఎంపీపీ రెడ్డెయ్య ఇంటిపై దాడుల ఘటనలు కూడా ఆందోళన కలిగించే పరిణామం. ఇటీవల రామాపురం, రాయచోటి, రాజంపేట ఇలా పలు మండలాల్లో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు సంబంధించిన స్థలాలు, ఇళ్లను ఆక్రమణల పేరుతో కూల్చి వేస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం.
సార్వత్రిక ఎన్నికల్లో
పట్టు నిరూపించుకున్న ఎమ్మెల్యే
కక్షసాధింపు చర్యల్లో భాగంగా
కుటుంబంపై విష ప్రచారం
Comments
Please login to add a commentAdd a comment