తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ
కడప సెవెన్‌రోడ్స్ : ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ప్రథమ స్వాతంత్య్ర యోధుడని, ఆయన తిరుగుబాటు జాతీయోద్యమానికి ఎంతో ప్రేరణ ఇచ్చిందని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి అన్నారు. రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ఉయ్యాలవాడ వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ దోపిడీ, ఆధిపత్యాలను ఎదిరించిన సాహసి అని కొనియాడారు. తిరుగుబాటును కర్కశంగా అణిచివేసిన బ్రిటీషర్లు నరసింహారెడ్డి కోయిలకుంట్లలో బహిరంగంగా ఉరి తీసి ప్రజలను భయబ్రాంతులను చేసేందుకు 30 ఏళ్లు ఆయన తలను అలాగే ఉంచారన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం మరువలేనిదని, రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. కడపలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహ ఏర్పాటుకు తనవంతు సహకారం అందిస్తాననన్నారు. అధ్యక్షత వహించిన మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్ మాట్లాడుతూ నేటి తరానికి స్ఫూర్తినిచ్చేందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి చరిత్రలను పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నంద్యాలకు చెందిన సీనియర్ జర్నలిస్టు కాశీపురం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నరసింహారెడ్డిని ప్రథమ స్వాతంత్య్ర యోధునిగా గుర్తించాలన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్లే చరిత్రకారులు ఆయనను విస్మరించారని తెలిపారు. ఇది చాలా ఏళ్లుగా రాయలసీమపై అమలవుతున్న వివక్షలో భాగమేనని తెలిపారు. రూపనగుడి గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసుడు కర్నాటి మహేంద్రనాథ్‌రెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, ఏపీ నీటి సంఘం నాయకులు ఎల్వీ భాస్కర్‌రెడ్డి, హిమబిందు, రెడ్డి సేవా సమితి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.నాగిరెడ్డి, లెక్కల కొండారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, నంద్యాలకు చెందిన సీనియర్‌పాత్రికేయులు జనార్దన్‌రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అతిథులు కర్నాటి మహేంద్రనాథ్‌రెడ్డి, కాశీపురం ప్రభాకర్‌రెడ్డి జనార్దన్‌రెడ్డిలను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.
వర్దంతి సభలో ఎమ్మెల్యే ఆకేపాటి
తొలి స్వాతంత్య్ర యోధుడు ఉయ్యాలవాడ
Comments
Please login to add a commentAdd a comment