నేడు సీఎస్, డీఓలకు సమావేశం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ నిమిత్తం పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు, కస్టోడియన్లు, అడిషినల్ చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదివారం సమావేశాన్ని నిర్వహించనున్న ట్లు ఇంటర్మీడియట్ ఆర్‌ఐవో బండి వెంకటసుబ్బయ్య తెలిపారు. సంబంధింత సమావేశం ఉదయం 10 గంటలకు కడప మరియాపురం సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాల సెమినార్ హాల్‌లో ఉంటుందని వివరించారు. ఉత్తర్వులు పొందిన వారంతా విధిగా సమావేశానికి హాజరుకావాలని ఆర్‌ఐఓ తెలిపారు.
నేడు ‘బ్రౌన్’లో
సాహితీ సదస్సు
కడప కల్చరల్ : యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు సాహితీ సదస్సు నిర్వహించనున్నారు. నెలనెల సీమ సాహిత్యం కార్యక్రమంలో భాగంగా 141వ సదస్సుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆచార్య కొలకలూరి ఇనాక్ నవలా సాహిత్యం అనే అంశంపై శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖ పరిశోధక విద్యార్థి జి.రమేష్‌బాబు ప్రసంగించనున్నారు.
25 నుంచి కల్యాణ మహోత్సవాలు
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఈ నెల 25 నుంచి మార్చి 1వరకు బ్రహ్మంగారు, గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్లు మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ ఉత్సవాలను మఠం పిట్‌పర్సన్ శంకర్‌బాలాజీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 26 మహాశివరాత్రి రోజున బ్రహ్మం స్వామి కల్యాణాన్ని తిలకించేందుకు ఆంధ్రా, తెలంగాణా, కర్నాటక, రాష్ట్రాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారని మేనేజర్ తెలిపారు. 5రోజులు పాటు జరిగే ఉత్సవాలలో ప్రతి రోజూ హరికథలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, ప్రవచనలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
రాములోరి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలి
– టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు జేఈఓ వి వీరబ్రహ్మం సూచించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలోని సమావేశ మందిరంలో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఏప్రిల్ 11న జరగనున్న సీతారాముల కల్యాణానికి ముందస్తుగా అనుమతులు తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. త్వరలో కడప జిల్లా అధికారులతో సమన్వయ సమావేశాన్ని టీటీడీ ఈఓ జె శ్యామలరావు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేవలం 45 రోజులు గడువు ఉన్న నేపథ్యంలో ముందస్తుగా చెక్ లిస్టు పెట్టుకొని, అందుకు అనుగుణంగా మార్చి నెల చివరి నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో సీఈ సత్యనారాయణ, ఎస్‌ఈ (ఎలక్ట్రికల్) వెంకటేశ్వర్లు, ఒంటిమిట్ట ప్రత్యేక అధికారి ప్రశాంతి, డిప్యూటీ ఈఓ గోవిందరాజన్, అన్నప్రసాద ప్రత్యేకాధికారి జిఎల్‌ఎన్ శాస్త్రి, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ నియామకం
సిద్దవటం : శ్రీ నిత్యపూజ స్వామి ఆలయంలో ఈనెల 25 నుంచి మూడురోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు దేవదాయశాఖ అధికారులు శనివారం ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా 10 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌గా వంతాటిపల్లె గ్రామానికి చెందిన జ్యోతి వెంకటసుబ్బారెడ్డి, సభ్యులుగా గంగాదేవి, చెన్నమ్మ, రమణయ్య, బాలసుబ్రమణ్యం, లక్షుమ్మ, నరసింహారెడ్డి, పుల్లమ్మ, ఎరికలయ్య, మునీంద్ర, శేషాద్రిశర్మ నియమితులయ్యారు.
నేడు సీఎస్, డీఓలకు సమావేశం
Comments
Please login to add a commentAdd a comment