గంజాయి సిగరెట్‌ @ రూ.100 | Each Marijuana Cigarette Costs 100 Rupees In Nizamabad District | Sakshi
Sakshi News home page

గంజాయి సిగరెట్‌ @ రూ.100

Published Wed, Sep 11 2019 11:52 AM | Last Updated on Wed, Sep 11 2019 11:52 AM

Each Marijuana Cigarette Costs 100 Rupees In Nizamabad District - Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఇప్పటి వరకు జిల్లాలో గంజాయి స్మగ్లింగ్‌ మాత్రమే జరిగేది. తాజాగా వినియోగం కూడా పెరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా గంజాయి సిగరెట్లనే విక్రయిస్తున్నారు. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ.వంద చొప్పున విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారుల విచారణలో తేలింది. గంజాయి సిగరెట్లకు యువత, విద్యార్థులు కూడా బానిసలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి అలవాటు పడుతున్న వారు.. వాటి విక్రయాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు.

గంజాయి స్మగ్లింగ్‌ కేంద్రంగా పేరున్న నిజామాబాద్‌ ఇప్పుడు దాని వినియోగానికి కూడా అడ్డాగా మారింది. ముంబయి, పుణె, హైదరాబాద్‌ వంటి మెట్రోపాలిటన్‌ సిటీల్లో వినియోగమయ్యే ఈ గంజాయి ఇప్పుడు జిల్లాలోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. నిజామాబాద్‌ నగరంలోనే కాదు., గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ గంజాయి ఘాటు పాకింది. జిల్లాలో ఏకంగా గంజాయి సిగరెట్లనే విక్రయిస్తున్నారంటే దీని వినియోగం ఏ స్థాయికి పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. గంజాయి సిగరెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఒక్కో గంజాయి సిగరెట్‌ను రూ. వంద చొప్పున విక్రయిస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఘాటు మరింత ఎక్కువ ఉండాలంటే గంజాయిని మరింత దట్టించిన సిగరెట్‌ను తయారు చేసి ఇస్తున్నారు. సాధారణ సిగరెట్‌లో పొగాకును తొలగించి, ఈ ఎండు గంజాయిని నింపుతున్నారు. సాధారణ సిగరెట్‌ మాదిరిగా కనిపించే వీటిని పీల్చుతూ మత్తులో తేలియాడుతున్నారు. 

ప్రత్యేక వేఫర్లు.. 
ఎండు గంజాయిని నింపుకుని పీల్చుకునేందుకు ప్రత్యేకంగా వేఫర్లు కూడా విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్‌పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ వేఫర్లలో తమకు కావాల్సినంత ఎండు గంజాయిని నింపుకుని తాగవచ్చు.  

విద్యార్థులు, యువత బానిస.. 
గంజాయి సిగరెట్లకు ఇప్పుడు యువత, విద్యార్థులు కూడా బానిసలుగా మారడం ఆందోళనకు గురిచేస్తోంది. వీటికి అలవాటు పడుతున్న వారు.. వాటి విక్రయాలు జరుగుతున్న ప్రదేశాలకు వెళ్లి మరీ కొనుగోలు చేస్తున్నారు. పేద వర్గాలకు చెందిన వారు కూడా ఈ గంజాయి ఘాటుకు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. ముఖ్యంగా కూలీలు ఈ మత్తుకు బానిసలుగా మారుతున్నారు. 

గతంలో గంజాయి చాక్లెట్లు.. 
నిజామాబాద్‌ నగరంలో గతంలో గంజాయి చాక్లెట్లు కూడా వెలుగుచూసిన విషయం విధితమే. సుమారు రెండేళ్ల క్రితం ఎక్సైజ్‌ అధికారులు నగరంలో జరిపిన దాడుల్లో ఈ గంజాయి చాక్లెట్లు పట్టుబడ్డాయి. నగరంలో పెద్ద ఎత్తున వీటి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. చిన్నారులు తినే చాక్లెట్ల మాదిరిగానే ఉండే వీటిని నోట్లో వేసుకుంటే మత్తులో తేలిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. 

కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం 
గంజాయి సిగరెట్లు తాగుతూ పట్టుబడిన యువత, విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాము. తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోకపోవడంతోనే కొంత మంది విద్యార్థులు, యువత ఇలాంటి మత్తు పదార్థాల వినియోగానికి అలవాటు పడుతున్నారు. విక్రయదారులపై పలుమార్లు కేసులు నమోదు చేస్తున్నాము. ద్వారకానగర్‌లో వీటిని విక్రయిస్తున్న మహిళపై పలు కేసులు కూడా పెట్టాము. 
- దీపికా, ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement