ఏటా 10 శాతం చొప్పున వృద్ధి
వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు
డెలాయిట్ సంస్థ నివేదిక వెల్లడి
ముంబై: భారత్‌లో ఇళ్లు, గృహ వినియోగ మార్కెట్ (హోమ్, హౌస్‌హోల్డ్) 2030 నాటికి 237 బిలియన్ డాలర్లకు (రూ.19.67 లక్షల కోట్లు) చేరుకుంటుందని డెలాయిట్ అంచనా వేసింది. ఏటా 10 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు కొనసాగుతుందంటూ.. ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, వినియోగదారుల ప్రాధాన్యతల్లో మార్పులు, వివిధ ఉత్పత్తుల పరంగా సౌకర్యం, సౌలభ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడాన్ని సానుకూలతలుగా తన నివేదికలో ప్రస్తావించింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు వృద్ధి కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు తెలిపింది.
ఓమ్నిచానల్ రిటైల్, ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులతో అనుసంధానానికి సాయపడుతున్నాయని, పట్టణాలకు వెలుపలి ప్రాంతాలకు ఇవి చేరుకుంటున్నాయని పేర్కొంది. గృహస్థుల ఖర్చు చేసే ఆదాయం పెరుగుతుండడం, అదే సమయంలో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తుండడం, సులభంగా రుణాలు లభిస్తుండడం, యువ కస్టమర్లు ఆధునిక డిజైన్లు, గృహ నవీకరణ, వ్యక్తిగత అభిరుచులకు ప్రాధాన్యం ఇస్తుండడం ఈ మార్కెట్ వృద్ధికి చోదకాలుగా తెలిపింది. హౌస్‌హోల్డ్ (ఇంట్లో వినియోగించే ఉపకరణాలు) మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోందని డెలాయిట్ నివేదిక తెలిపింది. విక్రయానంతర సేవలు, వారంటీపై వ్యాపార సంస్థలు దృష్టి పెట్టాల్సి ఉంటుందని పేర్కొంది.
ప్రీమియం ఉత్పత్తులకు ఆదరణ
వినియోగదారులు ప్రీమియం, బ్రాండెడ్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు, కంపెనీలు ఈ–చానళ్ల రూపంలో కస్టమర్లకు ముందుగా చేరువ అవుతున్నట్టు డెలాయిట్ నివేదిక తెలిపింది. వినియోగదారులకు మెరుగైన అనుభవం, డిజైన్ ఆధారిత ఉత్పత్తుల ఆవిష్కరణపై కంపెనీలు ఎక్కువగా దృష్టి సారించినట్టు డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ ఆనంద్ రామనాథన్ చెప్పారు. సోషల్ మీడియా, అత్యాధునిక సాంకేతికతల సాయంతో కంపెనీలు తమ కస్టమర్లను లక్ష్యంగా చేసుకోగలుగుతున్నట్టు డెలాయిట్ నివేదిక వివరించింది. ఇంధన ఆదా గృహోపకరణాలకు, పర్యావరణ అనుకూల కిచెన్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుండడంతో కంపెనీలు నీటిని ఆదా చేసే బాత్‌రూమ్ ఫిట్టింగ్‌లు, ఇంధన ఆధా టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచుతున్నాయని వెల్లడించింది. పీఎల్‌ఐ పథకం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉజాల, ఎస్‌ఎంసీ, పీఎం మిత్ర పథకాల మద్దతుతో డిమాండ్ పెరుగుతుండడం, హౌస్‌హోల్డ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment