
ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా భావించే మధ్యతరగతి ప్రజలు ప్రస్తుతం గణనీయమైన వినియోగ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్(Budget 2025-26)లో మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లకు పరిష్కారం లభించేలా నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేటగిరీ ప్రజలు ఇబ్బంది పడుతున్న వినియోగ సంక్షోబానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు.
నిలకడగా వేతనాలు
జీవన వ్యయాలు పెరుగుతున్నప్పటికీ, అందుకు అనుగుణంగా మధ్యతరగతి కార్మికుల వేతనాలు పెరగడం లేదు. స్థిరంగా ఉన్న వేతనాల వల్ల వారి కుటుంబాలు అత్యవసరం కాని వస్తువులపై ఖర్చు చేసేందుకు సరిపడా డిస్పోజబుల్ ఆదాయం(నిత్యావసర ఖర్చులు, వడ్డీలు, ఈఎంఐలు.. పోను చివరకు మిగిలే డబ్బు) ఉండడంలేదు. ఇది వినియోగం తగ్గడానికి దారితీస్తుంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా అధిక స్థాయిలను తాకుతోంది. దానివల్ల నిత్యావసరాల ఖర్చు పెరిగి మధ్యతరగతి కుటుంబాలు సాధారణ కొనుగోళ్ల కంటే నిత్యావసర ఖర్చులకే ప్రాధాన్యమివ్వాల్సి వస్తోంది.
రుణ భారం
మధ్యతరగతి కుటుంబాలు తనఖాలు, కారు రుణాలు, క్రెడిట్ కార్డు రుణాలతో సహా అధిక స్థాయి అప్పుల భారంతో కాలం వెల్లదీస్తున్నాయి. ఈ రుణం ఈఎంఐలు ఇతర వస్తువులు, సేవలపై ఖర్చులను తగ్గిస్తున్నాయి. దీనికితోడు మార్కెట్‌లో ఆన్‌లైన్ వేదికగా చాలా ప్లాట్‌ఫామ్‌లు అడ్డగోలుగా అప్పులు ఇస్తున్నాయి. మధ్యతరగతి దీనికి ఆకర్షింపబడుతుంది. కానీ అప్పులు తీర్చే సమయానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్థిక మాంద్యం
ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. దాంతో ప్రైవేట్ రంగంలో చాలామంది కొలువులు కోల్పోతున్నారు. కార్పొరేట్ సంస్థల ఆదాయాలు తగ్గుతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో శ్రామికశక్తిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా మెటా, గూగుల్.. వంటి టాప్ కంపెనీలు కూడా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. ఇది మధ్యతరగతి ఆదాయాలపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆయా కుటుంబాలు వారి మునుపటి వినియోగ స్థాయిలను కొనసాగించడం కష్టమవుతుంది.
ఇదీ చదవండి: ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు
బడ్జెట్ సహాయపడుతుందా?
రాబోయే కేంద్ర బడ్జెట్ 2025-26 ఈ సవాళ్లలో కొన్నింటిని పరిష్కరించి మధ్యతరగతికి ఉపశమనం కలిగించే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నాయి. అందుకు ప్రభుత్వం కొన్ని చర్యలపై దృష్టి సారిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పన్ను ఉపశమనం: వ్యక్తిగత ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం లేదా ప్రామాణిక తగ్గింపును పెంచడం వల్ల మధ్యతరగతి కుటుంబాల చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది.
సబ్సిడీలు: ఆహారం, గృహనిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి నిత్యావసర వస్తువులకు సబ్సిడీలను ప్రవేశపెట్టడం లేదా వాటిని విస్తరించడం మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉద్యోగాల కల్పన: మౌలిక సదుపాయాలు, ఇతర ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు మధ్యతరగతి కార్మికులకు ఆదాయం పెరుగుతుంది.
రుణ ఉపశమన కార్యక్రమాలు: గృహ రుణాన్ని నిర్వహించడానికి, దాన్ని భారాన్ని తగ్గించడానికి సహాయపడే కార్యక్రమాలను అమలు చేయడం వినియోగానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తుంది.
ద్రవ్యోల్బణ నియంత్రణ: ద్రవ్య విధాన సర్దుబాట్లు వంటి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు ధరలను స్థిరీకరించడానికి ఉపయోగపడుతాయి. కొనుగోలు శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.