middle class life
-
వచ్చే ఏడాది బాగుంటుంది!.. ‘బెస్ట్ సిటీ’హైదరాబాదే
ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది. రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా. హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది. ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్కమ్గ్రూప్నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు. ముఖ్యాంశాలు.. ► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి ► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. ►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు. ►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి ►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది. – అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా -
చాలని జీతం ప్రేమకు బంధం
జీతంతో వెలుగుతుండే చమురు దీపాలు... మధ్యతరగతి జీవితాలు. ఆ వెలుగులో గోడల మీద రెపరెపలాడుతుండే పొడవాటి నీడలు భార్యాభర్తలు. నెలనెలా ఇంత నూనె తెచ్చి నింపుతుంటాడు భర్త. నెలాఖరు వరకూ రెండు చేతులూ అడ్డుపెట్టి దీపానికి కాపు కాస్తుంటుంది భార్య. అంతకుమించి భర్తగానీ, భార్యగానీ అటూఇటూ కదలడానికి సరుకుల జాబితాలో చింతపండైనా అనుమతించదు. అప్పటికీ వత్తిని చిన్నదిగా చేస్తూ కూడబెట్టిన కాంతితో... జేబులు తడుముకునే వేళ భర్తకు ఎదురొచ్చి, ముందుకు నడిపిస్తుంటుంది భార్య. ఆవిడ కళ్ళలో కాంతులు చూడ్డానికి అప్పుడప్పుడూ ఒత్తిని పెద్దదిగా చేస్తూ చేతులు కాల్చుకుంటుంటాడు భర్త. చాలని దుప్పటి ఒకరికొకరిని దగ్గర చేసినట్లే, చాలని జీతం వల్ల వచ్చే సమస్యలు దాంపత్య బంధాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేస్తుంటాయి! మనిషి బతకడానికైనా, మనుషుల మధ్య సంబంధాలు బతకడానికైనా డబ్బు ముఖ్యం. భూమ్మీద ఉన్నంతసేపూ డబ్బే మనిషి ఆత్మ, అంతరాత్మ. లోకంలో ఎంతో దైన్యం ఉంది. ఆ దైన్యమంతా చాలా వరకు డబ్బు లేని జీవితాలదే. లోకంలో ఎంతో దుర్మార్గం ఉంది. ఆ దుర్మార్గం చాలా వరకు డబ్బే జీవితమైన వాళ్ళది. ఒక ఇంట్లో చెంపను నిమిరిన డబ్బే, ఇంకో ఇంట్లో చెంపను ఛెళ్ళుమనిపిస్తుంది. ఉన్న ఇంటికీ, లేని ఇంటికీ గల వ్యత్యాసమది. డబ్బు అవసరం, డబ్బుపై ఆశ ఉన్నన్నాళ్ళూ... మనిషిని పేరును బట్టి కాకుండా, వేలు పెట్టి పిలుస్తుంది డబ్బు. ఆప్యాయతలు, అనురాగాలు లేకపోయినా కరెన్సీ ఉంటే చాలు కాపురాలు నిలబడి, కుటుంబాలు నడిచేస్తాయేమోనని కూడా అనిపిస్తుంది. అయితే డబ్బుకి నిజంగా అంత శక్తి ఉందా? లేక, చేతిలో పైసా లేకుండా మనిషి రోడ్డున పడిన రోజున మాత్రమే దానికి అంతటి శక్తి వస్తుందా? జేబు నిండా డబ్బుంటే లోకంలో ఇంత మంది దుర్మార్గులైన భర్తలు ఉండేవారు కాదేమో?! డబ్బు సమస్యలే లేకుంటే దాంపత్యాలు మరింత అన్యోన్యంగా ఉండేవేమో! డబ్బున్న రోజున అడక్కుండానే ప్రేమను రెండుమూడు క్యారీబ్యాగులతో మోసుకొచ్చే భర్త, ఆఖరి రూపాÄ ూ ఖర్చయ్యి, అప్పు కూడా పుట్టని రోజున భార్య వచ్చి ప్రేమగా ‘‘ఏంటలా ఉన్నారు?’’ అని అడిగినా ఇంతెత్తున లేస్తాడు. ‘‘ఎలా ఉంటేనేం? ఆర్చేదానివా తీర్చేదానివా’’ అన్నట్లు చూస్తాడు. ‘‘అన్నిటికీ కారణం నువ్వే’’ అని నింద వేసినా వేస్తాడు. అప్పటి అతడి మానసిక స్థితి అది. పదీ పరక కోసం... భర్త మూడ్‌ను పదిసార్లు స్టడీ చేసే భార్యలను కూడా ఒకసారి తలుచుకోండి. జీవితంలో వారు ఎన్ని నెలలు, వేలసార్లు ఇబ్బందిగా వేళ్ళు విరుచుకుంటూ భర్త ముందు దోషిలా నిలబడాలో కదా. అదీ తమకెంతో ప్రియమైన గాజుల కోసమో, చీరల కోసమో కాదు. పాల కోసం, ఇంటి బాడుగ కోసం, జీతాన్ని అర్థాంతరంగా మింగేసిన నెలను భర్తీ చేసుకోవడం కోసం. రెక్కల కష్టంతో అతడు తెచ్చి ఇచ్చే ఏడెనిమిది వేల రూపాయలను ముక్కలు చెక్కలు కాకుండా కాపాడుకుంటూ నాలుగు వారాలను గట్టెక్కేందుకు ఆవిడ చేసుకునే సర్దుబాట్లు ఎవరి ఊహకూ అందనివి! భర్తకు అసలే తెలియనివి. ఒడిదుడుకులు తాత్కాలికమే బడ్జెట్ సంసారాలు హైలీ ఇన్‌ఫ్లేమబుల్. కొత్తగా వచ్చి చేర బోయే చిన్న ఖర్చు చాలు అవి భగ్గున మండేందుకు. ఈ అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధర పెరుగుతుందన్న వార్త... ఆ ఉదయం నుండే భర్తవైపు నుంచి, భార్య వైపు నుంచి రెండు రకాలుగా ఎనలైజ్ అవుతూ ఉంటుంది.. ఖర్చును ఇంకా ఇంకా తగ్గించేందుకు గల మార్గాలను అన్వేషించే ఏకైక లక్ష్యంతో. వచ్చి వెళ్ళిన అతిథి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చే వరకూ వదలని అనారోగ్యం ఒకే నెలలో గడప తొక్కితే... జీతం నావ తల్లకిందులై, సేవింగ్స్ నావకు చిల్లు పడినట్లే. తిరిగి తేరుకునే వరకు భర్త స్కూటర్ వారానికి రెండు రోజులు మాత్రమే రోడ్డెక్కడం భార్య గుండెను పిండేస్తుంటుంది. భార్య చేతిలోని కూరగాయల సంచి బస్ ఎక్కడం మాని, నడిచి వెళ్ళి నడిచి వస్తోందని తెలిసి... కలుపుకున్న ముద్ద భర్త గొంతుకు అడ్డుపడుతుంది. కళ్ళు చెమ్మగిల్లిన ఏ జాములోనో భర్త గొంతుకలో భార్య గుండె కొట్టుకులాడుతుంది. బంధంలోని గొప్ప‘ధనం’ అదే... భార్యాభర్తల మధ్య డబ్బు గొడవలు మామూలే కదా. మనం కొత్తగా మాట్లాడుకునేది ఏముంటుంది? గృహిణి ఎంత జాగ్రత్తగా ఖర్చుపెట్టినా ఏదో ఒక మాట పడుతూనే ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య అఫెక్షన్‌ని పెంచడం కొన్ని కుటుంబాలలో కనిపిస్తుంది! ఇంటికి అవుతున్న ఖర్చును లెక్క చూసుకుంటున్నట్లే, భర్త తన భార్య కోసం ఎన్ని ఆత్మీయ క్షణాలను ఖర్చు చేయగలుగుతున్నాడో గమనించుకుంటే... డబ్బు చెప్పుచేతల్లోంచి అప్పుడప్పుడూ దొంగచాటుగా తప్పించుకుని, ఆవిడను ట్యాంక్‌బండ్ మీద చల్లటి గాలికి నడిపిస్తూ, వేరుశెనగల పొట్టు రాల్చి ప్రేమగా తినిపించాలని అనిపించదా? పురుషుడికి తెలియని విషయం భర్త సంపాదనను బట్టి భార్య అతడికి విలువ ఇస్తుందని మగవాళ్ళ అభిప్రాయం. అయితే అదొక అపోహ మాత్రమేనని వర్జీనియా యూనివర్శిటీ మనోవైజ్ఞానిక శాస్త్ర విభాగం కొంతకాలం క్రితం ఐదు వేల మంది దంపతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. భార్యను సంతోషపెట్టడానికే ఆమెను పట్టించుకోకుండా తాము సంపాదిస్తున్నట్లు భర్తలు చెబితే, భర్త నుంచి తామెప్పుడూ అప్యాయత, అనురాగాలనే ఆశించామని భార్యలు చెప్పారు. ఆ మాట నిజం ఆర్థిక ఇబ్బందులకు చికాకుపడి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే... అవి దాంపత్య సమస్యలుగా మారి ముక్కును, చెవినీ బిగించేస్తాయి. సంపాదించడానికి భర్త ఎంత కష్టపడతాడో, పొదుపుగా వాడి అందులో కొంత కూడబెట్టేందుకు భార్య కూడా అంతే కష్టపడుతుంది. ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేందుకేమీ లేదు. ఇద్దరూ కుటుంబ భద్రత కోసం ప్రయాస పడుతున్న వారే కనుక అనూహ్యంగా సంభవించే ఒడిదుడుకులకు ఎవరూ బాధ్యులు కారు. ద్రవ్యోల్బణం వల్ల బియ్యం ధర పెరగడానికి మన ఇంట్లో జరిగిన నిర్లక్ష్యం కారణం అయివుండదు కదా. అయితే కారణం మనం కాకపోయినప్పటికీ అవసరాలు మనవే కనుక తప్పనిసరిగా కోత విధించుకోవాలి. లేదంటే అదనంగా సంపాదించాలి. అది సాధ్యం కానప్పుడు భర్త ఆత్మన్యూనతకు లోనై మధనపడుతుంటాడు.