చాలని జీతం ప్రేమకు బంధం | how to manage limited salary middle class couples | Sakshi
Sakshi News home page

చాలని జీతం ప్రేమకు బంధం

Published Fri, Mar 24 2017 10:53 PM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

చాలని జీతం ప్రేమకు బంధం

చాలని జీతం ప్రేమకు బంధం

జీతంతో వెలుగుతుండే చమురు దీపాలు... మధ్యతరగతి జీవితాలు. ఆ వెలుగులో గోడల మీద రెపరెపలాడుతుండే పొడవాటి నీడలు భార్యాభర్తలు. నెలనెలా ఇంత నూనె తెచ్చి నింపుతుంటాడు భర్త. నెలాఖరు వరకూ రెండు చేతులూ అడ్డుపెట్టి   దీపానికి కాపు కాస్తుంటుంది భార్య. అంతకుమించి భర్తగానీ, భార్యగానీ అటూఇటూ కదలడానికి సరుకుల జాబితాలో చింతపండైనా అనుమతించదు. అప్పటికీ వత్తిని చిన్నదిగా చేస్తూ కూడబెట్టిన కాంతితో... జేబులు తడుముకునే వేళ భర్తకు ఎదురొచ్చి, ముందుకు నడిపిస్తుంటుంది భార్య. ఆవిడ కళ్ళలో కాంతులు చూడ్డానికి అప్పుడప్పుడూ ఒత్తిని పెద్దదిగా చేస్తూ చేతులు కాల్చుకుంటుంటాడు భర్త.  చాలని దుప్పటి ఒకరికొకరిని దగ్గర చేసినట్లే, చాలని జీతం వల్ల వచ్చే సమస్యలు దాంపత్య బంధాన్ని ఎప్పటికప్పుడు పటిష్టం చేస్తుంటాయి!

మనిషి బతకడానికైనా, మనుషుల మధ్య సంబంధాలు బతకడానికైనా డబ్బు ముఖ్యం. భూమ్మీద ఉన్నంతసేపూ డబ్బే మనిషి ఆత్మ, అంతరాత్మ. లోకంలో ఎంతో దైన్యం ఉంది. ఆ దైన్యమంతా చాలా వరకు డబ్బు లేని జీవితాలదే. లోకంలో ఎంతో దుర్మార్గం ఉంది. ఆ దుర్మార్గం చాలా వరకు డబ్బే జీవితమైన వాళ్ళది. ఒక ఇంట్లో చెంపను నిమిరిన డబ్బే, ఇంకో ఇంట్లో చెంపను ఛెళ్ళుమనిపిస్తుంది. ఉన్న ఇంటికీ, లేని ఇంటికీ గల వ్యత్యాసమది. డబ్బు అవసరం, డబ్బుపై ఆశ ఉన్నన్నాళ్ళూ... మనిషిని పేరును బట్టి కాకుండా,  వేలు పెట్టి పిలుస్తుంది డబ్బు. ఆప్యాయతలు, అనురాగాలు లేకపోయినా కరెన్సీ ఉంటే చాలు కాపురాలు నిలబడి, కుటుంబాలు నడిచేస్తాయేమోనని కూడా అనిపిస్తుంది. అయితే డబ్బుకి నిజంగా అంత శక్తి ఉందా? లేక, చేతిలో పైసా లేకుండా మనిషి రోడ్డున పడిన రోజున మాత్రమే దానికి అంతటి శక్తి వస్తుందా?

జేబు నిండా డబ్బుంటే లోకంలో ఇంత మంది దుర్మార్గులైన భర్తలు ఉండేవారు కాదేమో?! డబ్బు సమస్యలే లేకుంటే దాంపత్యాలు మరింత అన్యోన్యంగా ఉండేవేమో!  డబ్బున్న రోజున అడక్కుండానే ప్రేమను రెండుమూడు క్యారీబ్యాగులతో మోసుకొచ్చే భర్త, ఆఖరి రూపాÄ ూ ఖర్చయ్యి, అప్పు కూడా పుట్టని రోజున భార్య వచ్చి ప్రేమగా ‘‘ఏంటలా ఉన్నారు?’’ అని అడిగినా ఇంతెత్తున లేస్తాడు.    ‘‘ఎలా ఉంటేనేం? ఆర్చేదానివా తీర్చేదానివా’’ అన్నట్లు చూస్తాడు. ‘‘అన్నిటికీ కారణం నువ్వే’’ అని నింద వేసినా వేస్తాడు. అప్పటి అతడి మానసిక స్థితి అది. పదీ పరక కోసం... భర్త మూడ్‌ను పదిసార్లు స్టడీ చేసే భార్యలను కూడా ఒకసారి తలుచుకోండి. జీవితంలో వారు ఎన్ని నెలలు, వేలసార్లు ఇబ్బందిగా వేళ్ళు విరుచుకుంటూ భర్త ముందు దోషిలా నిలబడాలో కదా. అదీ తమకెంతో ప్రియమైన గాజుల కోసమో, చీరల కోసమో కాదు. పాల కోసం, ఇంటి బాడుగ కోసం, జీతాన్ని అర్థాంతరంగా మింగేసిన నెలను భర్తీ చేసుకోవడం కోసం. రెక్కల కష్టంతో అతడు తెచ్చి ఇచ్చే ఏడెనిమిది వేల రూపాయలను ముక్కలు చెక్కలు కాకుండా కాపాడుకుంటూ నాలుగు వారాలను గట్టెక్కేందుకు ఆవిడ చేసుకునే సర్దుబాట్లు ఎవరి ఊహకూ అందనివి! భర్తకు అసలే తెలియనివి.

ఒడిదుడుకులు తాత్కాలికమే
బడ్జెట్‌ సంసారాలు హైలీ ఇన్‌ఫ్లేమబుల్‌. కొత్తగా వచ్చి చేర బోయే చిన్న ఖర్చు చాలు అవి భగ్గున మండేందుకు. ఈ అర్ధరాత్రి నుంచి పెట్రోల్‌ ధర పెరుగుతుందన్న వార్త... ఆ ఉదయం నుండే భర్తవైపు నుంచి, భార్య వైపు నుంచి రెండు రకాలుగా ఎనలైజ్‌ అవుతూ ఉంటుంది.. ఖర్చును ఇంకా ఇంకా తగ్గించేందుకు గల మార్గాలను అన్వేషించే ఏకైక లక్ష్యంతో. వచ్చి వెళ్ళిన అతిథి, డాక్టర్‌ దగ్గరికి వెళ్ళి వచ్చే వరకూ వదలని అనారోగ్యం ఒకే నెలలో గడప తొక్కితే... జీతం నావ తల్లకిందులై, సేవింగ్స్‌ నావకు చిల్లు పడినట్లే. తిరిగి తేరుకునే వరకు భర్త స్కూటర్‌ వారానికి రెండు రోజులు మాత్రమే రోడ్డెక్కడం భార్య గుండెను పిండేస్తుంటుంది. భార్య చేతిలోని కూరగాయల సంచి బస్‌ ఎక్కడం మాని, నడిచి వెళ్ళి నడిచి వస్తోందని తెలిసి... కలుపుకున్న ముద్ద భర్త గొంతుకు అడ్డుపడుతుంది. కళ్ళు చెమ్మగిల్లిన ఏ జాములోనో భర్త గొంతుకలో భార్య గుండె కొట్టుకులాడుతుంది.

బంధంలోని గొప్ప‘ధనం’ అదే...
భార్యాభర్తల మధ్య డబ్బు గొడవలు మామూలే కదా. మనం కొత్తగా మాట్లాడుకునేది ఏముంటుంది? గృహిణి ఎంత జాగ్రత్తగా ఖర్చుపెట్టినా ఏదో ఒక మాట పడుతూనే ఉంటుంది. అయితే ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య అఫెక్షన్‌ని పెంచడం కొన్ని కుటుంబాలలో కనిపిస్తుంది! ఇంటికి అవుతున్న ఖర్చును లెక్క చూసుకుంటున్నట్లే, భర్త తన భార్య కోసం ఎన్ని ఆత్మీయ క్షణాలను ఖర్చు చేయగలుగుతున్నాడో గమనించుకుంటే... డబ్బు చెప్పుచేతల్లోంచి అప్పుడప్పుడూ  దొంగచాటుగా తప్పించుకుని, ఆవిడను ట్యాంక్‌బండ్‌ మీద చల్లటి గాలికి నడిపిస్తూ,  వేరుశెనగల పొట్టు రాల్చి  ప్రేమగా  తినిపించాలని అనిపించదా?

పురుషుడికి తెలియని విషయం
భర్త సంపాదనను బట్టి భార్య అతడికి విలువ ఇస్తుందని మగవాళ్ళ అభిప్రాయం.  అయితే అదొక అపోహ మాత్రమేనని వర్జీనియా యూనివర్శిటీ మనోవైజ్ఞానిక శాస్త్ర విభాగం కొంతకాలం క్రితం ఐదు వేల మంది దంపతులపై జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. భార్యను సంతోషపెట్టడానికే ఆమెను పట్టించుకోకుండా తాము సంపాదిస్తున్నట్లు భర్తలు చెబితే,  భర్త నుంచి తామెప్పుడూ అప్యాయత, అనురాగాలనే ఆశించామని భార్యలు చెప్పారు.    

ఆ మాట నిజం
ఆర్థిక ఇబ్బందులకు చికాకుపడి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే... అవి దాంపత్య సమస్యలుగా మారి ముక్కును, చెవినీ బిగించేస్తాయి. సంపాదించడానికి భర్త  ఎంత కష్టపడతాడో, పొదుపుగా వాడి అందులో కొంత కూడబెట్టేందుకు భార్య కూడా అంతే కష్టపడుతుంది. ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేందుకేమీ లేదు. ఇద్దరూ కుటుంబ భద్రత కోసం ప్రయాస పడుతున్న వారే కనుక అనూహ్యంగా సంభవించే ఒడిదుడుకులకు ఎవరూ బాధ్యులు కారు. ద్రవ్యోల్బణం వల్ల బియ్యం ధర పెరగడానికి మన ఇంట్లో జరిగిన నిర్లక్ష్యం కారణం అయివుండదు కదా. అయితే కారణం మనం కాకపోయినప్పటికీ అవసరాలు మనవే కనుక తప్పనిసరిగా కోత విధించుకోవాలి. లేదంటే అదనంగా సంపాదించాలి. అది సాధ్యం కానప్పుడు భర్త ఆత్మన్యూనతకు లోనై  మధనపడుతుంటాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement