ప్రస్తుతం దేశంలోని ఆర్థికరంగ స్థితిగతుల తీరును బట్టి.. వచ్చే ఏడాది తమ ఆదాయ స్థాయిల్లో మెరుగైన మార్పులు చోటుచేసుకుంటాయనే ఆశాభావం దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా నగర, పట్టణ కేంద్రాల్లోని నాలుగింట మూడువంతుల దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వినియోగదారుల్లో ఈ నమ్మకం వ్యక్తమవుతోంది.
రాబోయే సంవత్సరాల్లో తమ వేతనాలు గణనీయంగా పెరుగుతాయనే ధీమా వారిలో ఏర్పడడానికి దేశీయ ఆర్థికరంగం మరింత పుంజుకుంటుందనే లెక్కలే కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకుంటున్న క్రమంలో.. ఆర్థికరంగం బలపడుతుండడంతో గతేడాది 52 శాతం అల్పాదాయ వినియోగదారుల ఆదాయాలు పెరగగా, వచ్చే ఏడాది 76 శాతం మంది తమ ఆదాయాలు పెరుగుతాయని, ఆదాయంలో సేవింగ్స్ ఉంటాయని 64 శాతం ఆశిస్తున్నట్టు ఓ అంచనా.
హైదరాబాద్ మోస్ట్ ఫేవరబుల్ సిటీ
దిగువ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల జీవనానికి దేశంలోనే హైదరాబాద్ ‘బెస్ట్ సిటీ’గా నిలుస్తున్నట్టుగా హోమ్ క్రెడిట్ ఇండియా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన ‘ద ఇండియన్ వ్యాలెట్ స్టడీ 2023–అండర్‌స్టాండింగ్ ఫైనాన్షియల్ బిహేవియర్ అండ్ వెల్‌బీయింగ్ ఆఫ్ కన్జుమర్స్’‘అధ్యయనంలో వెల్లడైంది. అల్పాదాయవర్గాల జనాభా జాతీయ సగటు నెలవారీ వేతనం రూ.30 వేలుగా ఉన్నట్టుగా ఈ సర్వే అంచనావేసింది.
ఈ అధ్యయనంలో... నగరాల వారీగా డేటాను పరిశీలిస్తే మాత్రం టాప్–4 మెట్రోనగరాలను తోసిరాజని ప్రథమశ్రేణి నగరాల్లో హైదరాబాద్ లోయర్ ఇన్‌కమ్‌గ్రూప్‌నకు రూ.42 వేల నెలవారీ సగటు వేతనంతో (జాతీయ సగటు కంటే రూ.12 వేలు అధికంగా) ‘మోస్ట్ ఫేవరబుల్ సిటీ’గా నిలిచినట్టు వెల్లడించింది. బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ నగరాలు కూడా ఢిల్లీ (రూ.30వేలు), ముంబై (రూ.32 వేలు), చెన్నైతో సమానంగా, అంతకంటే ఎక్కువగా అల్పాదాయవర్గాలకు నెలవారీ వేతనాలు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఎమర్జె న్సీ, వైద్యఖర్చులు, పిల్లలకు అనారోగ్యం, ఇంటి ఖర్చులు సమర్థవంతంగా ఎదుర్కొనేలా ఈ వర్గాలు సన్నద్ధమౌతున్నట్టు వెల్లడైంది.
దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కొల్‌కత్తా, బెంగళూరు. హైదరాబాద్, భోపాల్, పటా్న, రాంచీ, అహ్మదాబాద్, చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్,జైపూర్, లక్‌నవూ, లూధియానా, కొచ్చి, పుణెలలోని 18–55 ఏళ్ల మధ్యలోని వార్షికాదాయం రూ.2 లక్షల నుంచి రూ.5లక్షల లోపున్న 2,200 మంది అల్పాదాయ వర్గాలకు చెందిన వారి నుంచి వివిధ అంశాలపై సమాచారం సేకరించారు.
ముఖ్యాంశాలు..
► ముంబై, ఢిల్లీ, చెన్నై, కొల్‌కత్తా వంటి మెట్రోనగరాల కంటే కూడా హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు వంటి ప్రథమ శ్రేణి నగరాల్లో (టైర్–1 సిటీస్) అల్పాదాయవర్గాలకు అధిక ఆదాయాలు వస్తున్నాయి
► ఈ టైర్–1 సిటీస్‌లోని దిగువ మధ్యతరగతి, అల్పాదాయవర్గాల వారు స్వయంగా షాపులకు వెళ్లి షాపింగ్ చేయడం ద్వారా వివిధ రకాల వినిమయ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.
► కొనుగోలు చేసిన వస్తువులకు చెల్లింపులు లేదా రుణాలు తీసుకునేపుడు డిజిటల్ పేమెంట్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.
►అల్పాదాయవర్గాల వినియోగదారుల నెలవారీ ఆదాయంలో 70 శాతం దాకా ఇంటి అద్దె(11శాతం), నిత్యావసర వస్తువులు (41 శాతం), ఆఫీసులకు రాకపోకలకు (14 శాతం) ఖర్చు అవుతోంది అదేసమయంలో 70 శాతం మంది అనవసర ఖర్చులు (నాన్–ఎసెన్షియల్ స్పెండింగ్)చేసేందుకు ఏమాత్రంగా సుముఖత వ్యక్తం చేయడం లేదు.
►వీరికి లోకల్ సైట్ సీయింగ్, హోటళ్లలో తినడం, సినిమాలకు వెళ్లడం వంటివి ప్రధాన రిక్రియేషన్‌గా ఉంటున్నాయి
►ఈ కుటుంబాల్లో ఒకరికి మించి వేతనజీవులు ఉండడం వల్ల వీరంతా కుటుంబఖర్చులను పంచుకుంటున్నట్టుగా ఓ అంచనా. అందులో ఇంటిపెద్ద 80 శాతం దాకా కంట్రిబ్యూట్ చేస్తున్నారు
వినియోగదారుల నాడిని పట్టుకోవడంలో భాగంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో కన్జూమర్లు చేసే ఖర్చుల తీరుతెన్నులపై దృష్టి పెట్టాం. కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికరంగం, వినియోగదారుల వ్యవహారశైలిలో వచి్చన మార్పు, చేర్పులను పరిశీలించాం. ప్రధానంగా దాదాపు వందకోట్ల వినియోగదారులు (అర్భన్ లోయర్ మిడిల్‌క్లాస్)చేసే ఖర్చులు, ఇతర అంశాలపై దృష్టిపెట్టాం. ఈ వర్గం వినియోగదారుల్లో చేసే ఖర్చులు, సేవింగ్స్ విషయంలో సానుకూల దృక్పథం వ్యక్తమౌతోంది.
– అశిష్ తివారీ, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హోమ్ క్రెడిట్ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment