అభిప్రాయం
‘మిడిల్ క్లాస్ ఫీల్‌గుడ్ బడ్జెట్’గా 2025–26 బడ్జెట్‌కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అయితే మధ్యతరగతిని సంతృప్తి పరిచే దిశలో కొంత ప్రయత్నం జరిగినా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం దిశలో బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ లేవు. ప్రత్యేకంగా చూస్తే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానూ ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల ఆదా యాలు పెంచేందుకు అవసరమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా చర్యలు చేపట్టలేదు. అంటే సమాజంలో అధిక శాతమున్న ప్రజల చేతుల్లో మరింత డబ్బు పెట్టే చర్యలేవీ తీసుకోలేదన్నమాట.
అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులకు పరిమితం కావడం, ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు పెరగక పోవడం, కేవలం క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌తోనే వృద్ధిని ముందుకు తీసుకెళ్ల లేకపోవడంతో ఉద్దీపనలతో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కీలకమైన రంగాల అభి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా మధ్యతరగతి చేతుల్లో డబ్బుపెట్టి కొనుగోలుశక్తి పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
వ్యవసాయ రంగం విషయానికొస్తే... దేశంలో మొత్తం ఏడు వందలకు పైగా జిల్లాలు ఉంటే... కేవలం వంద జిల్లాల్లో ‘ధన్, ధాన్య, కిసాన్ యోజన’ కింద (11 కోట్ల మంది రైతులకు గాను 1.7 కోట్ల మంది) రైతాంగానికి ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు. అది కూడా మూడు పప్పుదినుసులకు సంబంధించి రాబోయే ఆరేళ్లలో దీనిని చేస్తామని చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ రైతులకు ఒనగూడే ప్రయోజనం ఏమీఉండదు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వ విద్యాలయాల్లో విద్యాభివృద్ధికి, దాని నాణ్యతను పెంచే దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడా పేర్కొన లేదు.
దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్‌లో కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లోని డిమాండ్ అనేది స్తబ్ధుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉండడంతో అర్బన్ డిమాండ్ పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు ‘ఉద్దీపన’ కింద రాయితీల కల్పన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి అనేది అసంతృప్తితో ఉందని, ఈ వర్గం కొనుగోలు శక్తి తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ఈ అంశానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది.
వార్షిక బడ్జెట్‌లో ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపులతో దాదాపుగా అన్ని వర్గాలనూ సంతోషపరిచే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నదే. గతంలో రూ. 15 లక్షల వార్షికాదాయం గలవారు గరిష్ఠంగా 30 శాతం పన్ను కట్టేవారు. ఇప్పుడు ఈ 30 శాతం పన్ను ఏడాదికి రూ. 24 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి వర్తింప చేశారు. ఈ పన్ను మినహాయింపుల పరంగా చూస్తే రూ. 12 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానానికి లోబడి ఉన్న వారికే వర్తిస్తుంది.
ఈ విధంగా రూ. లక్ష కోట్ల వరకు వచ్చే ఆదాయపు పన్ను మొత్తాన్ని మధ్యతరగతి చేతుల్లో పెట్టి కొనుగోలుశక్తి పెంచడంద్వారా డిమాండ్‌పెంచితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయనేది దీని వెనక ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే... స్వేచ్చగా తమ అభిప్రా యాలను వ్యక్తపరిచే ‘వోకల్ సెక్షన్స్’ను సంతృప్తి పరిచే ప్రయత్నంగానే ఇది నిలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలోని ప్రజలు ఇంకా కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఆదాయపు పన్ను మినహాయింపు రూపంలో ఇచ్చిన ఉద్దీపనలు ఏ మేరకు ఉపయో గపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రొ‘‘ డి. నర్సింహా రెడ్డి
వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్
Comments
Please login to add a commentAdd a comment