D. Narasimha reddy
-
లక్ష్యాల సాధన సాధ్యమేనా?
‘మిడిల్ క్లాస్ ఫీల్‌గుడ్ బడ్జెట్’గా 2025–26 బడ్జెట్‌కు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. అయితే మధ్యతరగతిని సంతృప్తి పరిచే దిశలో కొంత ప్రయత్నం జరిగినా దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణ సమస్య పరిష్కారం దిశలో బడ్జెట్లో ఎలాంటి చర్యలూ లేవు. ప్రత్యేకంగా చూస్తే దేశంలో ఆహార ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగానూ ప్రత్యేక చర్యలేవీ తీసుకోలేదు. దిగువ మధ్యతరగతి, పేద ప్రజల ఆదా యాలు పెంచేందుకు అవసరమైన నిర్దిష్టమైన కార్యక్రమాలు లేదా చర్యలు చేపట్టలేదు. అంటే సమాజంలో అధిక శాతమున్న ప్రజల చేతుల్లో మరింత డబ్బు పెట్టే చర్యలేవీ తీసుకోలేదన్నమాట. అభివృద్ధి సాధనలో మౌలిక సదుపాయాల కల్పన ప్రభుత్వ పెట్టుబడులకు పరిమితం కావడం, ఆశించిన మేర ప్రైవేట్ పెట్టుబడులు పెరగక పోవడం, కేవలం క్యాపిటల్ ఎక్స్పెండిచర్తోనే వృద్ధిని ముందుకు తీసుకెళ్ల లేకపోవడంతో ఉద్దీపనలతో ప్రైవేట్ పెట్టుబడులను పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. కీలకమైన రంగాల అభి వృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోకుండా మధ్యతరగతి చేతుల్లో డబ్బుపెట్టి కొనుగోలుశక్తి పెంచడం ద్వారా పట్టణ ప్రాంతాల్లో వివిధ ఉత్పత్తులకు డిమాండ్ పెంచవచ్చని ఆశిస్తున్నట్టుగా కనిపిస్తోంది. వ్యవసాయ రంగం విషయానికొస్తే... దేశంలో మొత్తం ఏడు వందలకు పైగా జిల్లాలు ఉంటే... కేవలం వంద జిల్లాల్లో ‘ధన్, ధాన్య, కిసాన్ యోజన’ కింద (11 కోట్ల మంది రైతులకు గాను 1.7 కోట్ల మంది) రైతాంగానికి ప్రయోజనం కల్పిస్తామని చెబుతున్నారు. అది కూడా మూడు పప్పుదినుసులకు సంబంధించి రాబోయే ఆరేళ్లలో దీనిని చేస్తామని చెప్పడం ద్వారా ఇప్పటికిప్పుడు ఈ రైతులకు ఒనగూడే ప్రయోజనం ఏమీఉండదు. దేశ వ్యాప్తంగా విద్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న విశ్వ విద్యాలయాల్లో విద్యాభివృద్ధికి, దాని నాణ్యతను పెంచే దిశలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది ఎక్కడా పేర్కొన లేదు. దేశ జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మధ్య తరగతిని మంచి చేసుకునే ప్రయత్నంలో భాగంగా బడ్జెట్లో కొన్ని చర్యలు చేపట్టారు. ముఖ్యంగా పట్టణాల్లోని డిమాండ్ అనేది స్తబ్ధుగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత మెరుగైన పరిస్థితుల్లో ఉండడంతో అర్బన్ డిమాండ్ పెంచేందుకు ప్రైవేట్ పెట్టుబడులకు ‘ఉద్దీపన’ కింద రాయితీల కల్పన జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల్లో మధ్యతరగతి అనేది అసంతృప్తితో ఉందని, ఈ వర్గం కొనుగోలు శక్తి తగ్గిందనే అభిప్రాయం సర్వత్రా నెలకొనడంతో ఈ అంశానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్లో ఇచ్చిన ఆదాయపు పన్ను మినహాయింపులతో దాదాపుగా అన్ని వర్గాలనూ సంతోషపరిచే ప్రయత్నం జరిగింది. ఇది ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నదే. గతంలో రూ. 15 లక్షల వార్షికాదాయం గలవారు గరిష్ఠంగా 30 శాతం పన్ను కట్టేవారు. ఇప్పుడు ఈ 30 శాతం పన్ను ఏడాదికి రూ. 24 లక్షలకు పైగా ఆర్జిస్తున్నవారికి వర్తింప చేశారు. ఈ పన్ను మినహాయింపుల పరంగా చూస్తే రూ. 12 లక్షల దాకా ఆదాయం వచ్చేవారికి ప్రయోజనం కలుగుతుంది. అయితే ఇది నూతన ఆదాయ పన్ను విధానానికి లోబడి ఉన్న వారికే వర్తిస్తుంది.ఈ విధంగా రూ. లక్ష కోట్ల వరకు వచ్చే ఆదాయపు పన్ను మొత్తాన్ని మధ్యతరగతి చేతుల్లో పెట్టి కొనుగోలుశక్తి పెంచడంద్వారా డిమాండ్పెంచితే ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయనేది దీని వెనక ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే వాస్తవంగా చూస్తే... స్వేచ్చగా తమ అభిప్రా యాలను వ్యక్తపరిచే ‘వోకల్ సెక్షన్స్’ను సంతృప్తి పరిచే ప్రయత్నంగానే ఇది నిలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలోని ప్రజలు ఇంకా కొనుగోలు శక్తి లేక ఇబ్బందులు ఎదుర్కునే పరిస్థితులే ఉంటాయి. అందువల్ల ఆదాయపు పన్ను మినహాయింపు రూపంలో ఇచ్చిన ఉద్దీపనలు ఏ మేరకు ఉపయో గపడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.ప్రొ‘‘ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
జీవ భద్రత నేలపాలు
విశ్లేషణ, డాక్టర్. డి. నరసింహా రెడ్డి జన్యు మార్పిడి పంటలను పరీక్షించే సమయంలో ‘జన్యు’ కాలుష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎన్ని తీసుకున్నా కాలుష్య సమస్యలు వస్తున్న వాస్తవాన్ని గుర్తించిన దేశాలు, ఆ పరీక్షలను ఆపివేస్తున్నాయి. ఐరోపా సమాజంలోని దేశాలలో అత్యధికంగా 264 పరీక్షలకు 1997లో అనుమతులు ఇవ్వగా, 2012లో ఆ సంఖ్య 51కి పడిపోయింది. జన్యు మార్పిడి పంటలను క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి ఇటీవల కేంద్ర పర్యావరణ మంత్రి వీరప్ప మొయిలీ అనుమతించడం కొత్త వివాదానికి తెరలేపింది. బీటీ పత్తి విత్తనాలను 2002లో అనుమతించినప్పుడే ఈ వివా దం మొదలయ్యింది. ఈ అనుమతులేవీ క్షేత్ర పరీక్షల ఫలితాల ఆధారంగా ఇచ్చినవి కాదని సమాచారం. బీటీ పత్తి విత్తనాలు అందుబాటులోకి వచ్చి నాక, 12 ఏండ్ల అనుభవం చూస్తే, క్షేత్ర పరీక్షల మీద, వాటి ఫలితాల మీద, ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని ఇచ్చిన అనుమతుల శాస్త్రీయత మీద అనుమానాలు వస్తున్నాయి. బీటీ పత్తిలో కాయను తొలిచే పురుగును చంపే విషం చొప్పించి, జన్యు మార్పిడి చేశామనీ, దాని వలన, పురుగు మందుల ఉపయోగం తగ్గి, రైతులకు ఖర్చు తగ్గి, దిగుబడి పెరు గుతుందని చెప్పి మాన్సాంటో కంపెనీ అనుమతులు తీసుకుంది. బీటీ విషం తిని పురుగులు మొదట్లో చనిపోయినా, క్రమంగా వాటికి ఈ విషాన్ని తట్టుకునే శక్తి వచ్చిందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆకులు తిన్న పశువులు చనిపోయాయి. బీటీ పత్తి ఆకులు హానికరమని ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థక శాఖ ప్రకటించింది కూడా. బీటీ పత్తి విత్తనాలకు సంబంధించి పరిశోధన కేంద్రంలో కంటె, క్షేత్రస్థాయి పరీక్షలలో కంటె రైతులు సొంత పెట్టుబడితో తెలుసుకున్న ఫలితాలే ఎక్కువ. కంపెనీకి లాభాలు, రైతుల ఖర్చులను చూస్తే, గత ఏడాది (2013-14), పత్తి విత్తనాల మీద రైతులు పెట్టిన పెట్టుబడి కనీసంగా రూ. 1,215 నుంచి గరిష్టంగా రూ. 1,600 కోట్లు. ఇందులో కనీసం రూ.500 కోట్లు మాన్సాంటో కంపెనీకి నేరుగా రాయల్టీ ద్వారా చేరినాయి. నియంత్రణ వ్యవస్థ ఏదీ? బీటీ పత్తి విత్తనాలలో రెండవ తరం ప్రవేశించింది. మొదటి తరం పని చేయడం లేదని మాన్సాంటో కంపెనీ ప్రకటించింది, అయినా మొదటి తరం విత్తనాలు రైతులకు అమ్ముతుంటే నియంత్రించే వ్యవస్థ ఇక్కడ లేదు. ఇప్పుడు దాదాపు 180 బీటీ హైబ్రీడ్లు చలామణిలో ఉన్నాయి. 2002లో అనుమతులు ఇచ్చినప్పుడు, ఒకే రకం విత్తనాల మీద జరిపిన క్షేత్ర పరీక్షల ఫలితాలను ఇప్పుడున్న అన్ని హైబ్రీడ్లకు వర్తింపజేయడం పెద్ద లోపం. ఆ హైబ్రీడ్ల అనుమతుల గురించైనా పర్యావరణ మంత్రిత్వ శాఖ కాకుండా, భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో ఒక చిన్న కమిటీ నిర్ణయాలు తీసుకోవడమే చిత్రం. ఇంకా ప్రజలకు తెలియనివీ, శాస్త్రవేత్తలు పట్టించుకోనివీ, అధికారులు నిర్లక్ష్యం చేసిన నిబంధనలూ, నిజాలూ అనేకం ఉన్నాయి. వాటి ఫలితమే కంపెనీలకు లాభాలు, రైతులకు కష్టాలు, పర్యావరణానికి ‘జన్యు’ కాలుష్యం. ఒకే జన్యుమార్పిడి విత్తనంతోనే ఇన్ని రకాల సమస్యలు ఉంటే, ఇటీవలి ఉత్తర్వులలో 50 రకాల జన్యు మార్పిడి పంటలపైన క్షేత్ర పరీక్షలు జరుపుకోవటానికి అనుమతులు ఇవ్వడం పూర్తిగా రైతాంగ వ్యతిరేక చర్య. జీవ భద్రత ముఖ్యమని, మన దేశంలో ‘జన్యు’ కాలుష్యాన్ని ఆపే, నియంత్రించే పద్ధతులు, నిబంధనలు రూపొందించలేదు కనుక, క్షేత్ర పరీక్షల అనుమతులు ఇవ్వడం మంచిది కాదని ‘హరిత విప్లవాన్ని’ నెత్తికి ఎత్తుకున్న స్వామినాథన్ లాంటి వ్యక్తి అనేక సందర్భాలలో చెప్పారు. ఒక వ్యాజ్యం సందర్భంలో, సుప్రీంకోర్టు నియమించిన బయోటెక్నాలజీ శాస్త్రవేత్తలతో కూడిన సాంకేతిక సంఘం కూడా ‘జన్యుమార్పిడి విత్తనాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించినపుడు ‘జన్యు’ కాలుష్యం జరగవచ్చనీ, ఒకసారి మన జీవ వైవిధ్యం కలుషితమైతే అనర్థాలు జరగవచ్చనీ, ప్రకృతి సహజంగా వచ్చిన విత్తనాలు కలుషితమైతే తిరిగి ‘సహజ’ స్థితికి తీసుకురాలేమని ఆ సంఘం నిపుణులు నివేదికలో చెప్పారు. జీవ భద్రత ముఖ్యమని, భావితరాల ఆహారం కలుషితం కాకుండా కాపాడుకోవడానికీ, ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందే వరకు, జన్యు మార్పిడి పంట పరీక్షలు ‘ల్యాబ్‌కే పరిమితం చేయాలని, క్షేత్ర పరీక్షలకు అనుమతులు ఇవ్వవద్దని నివేదిక సుస్పష్టంగా చెప్పింది. ఐరోపా సమాజం దూరం జన్యు మార్పిడి పంటలను పరీక్షించే సమయంలో ‘జన్యు’ కాలుష్యం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎన్ని తీసుకున్నా కాలుష్య సమస్యలు వస్తున్న వాస్తవాన్ని గుర్తించిన అనేక దేశాలు, జన్యు పరీక్షలను ఆపివేస్తున్నాయి. ఐరోపా సమాజంలోని దేశాలలో అత్యధికంగా 264 పరీక్షలకు 1997లో అనుమతులు ఇవ్వగా, 2012లో ఆ సంఖ్య 51కి పడిపోయింది. దిగుమతి చేసుకునే దేశాలు తిరస్కరిస్తాయన్న భయంతోఅమెరికా కూడా 9 సంవత్సరాల క్రితం గోధుమల మీద జన్యు మార్పిడి పరీక్షలను నిలిపివేసింది. అయినా, అనూహ్యంగా గత సంవత్సరం ఓరెగాన్ రాష్ట్రంలో, ‘జన్యుమార్పిడి గోధుమ’ ఆనవాళ్లు బయటపడినాయి. రక్షణ చర్యలను అతిక్రమించి ఎలా కాలుష్యం జరిగిందో మాన్సాంటో దగ్గర సమాచారం లేదు. ఈ వార్త వెల్లడికాగానే, అమెరికా నుంచి దిగుమతి చేసుకునే గోధుమల మీద జపాన్ నిషేధం విధించింది. జన్యు మార్పిడి క్షేత్ర పరీక్షల వల్ల జన్యు కాలుష్యం జరుగుతుందని, జీవ రక్షణ చర్యలు ఎన్ని తీసుకున్నా, ఈ కాలుష్యాన్ని ఆపే వ్యవస్థ లేదని ఈ సంఘటన రుజువు చేస్తున్నది. మరి, మన దేశంలో, ఏ రక్షణ లేని, పర్యవేక్షణ లేని, నియంత్రణ లేని, అవగాహన లేని పరిస్థితులలో జన్యు మార్పిడి పరీక్షలను అనుమతించడం ఆత్మహత్యాసదృశమే. బియ్యం ఎగుమతుల మీద ప్రభావం జన్యు మార్పిడి పంట చుట్టూ కొంత భాగం బఫర్ పంట వేయడం వల్ల జన్యు కాలుష్యం అరికట్టే అవకాశం లేదని కూడా రుజువయింది. పరీక్షలు జరిపే పొలం చుట్టూ దడి కడితే సరిపోతుందని ఎఉఅఇ ఇటీవలి ఉత్తర్వులలో పేర్కొనడం వారి సాంకేతిక నైపుణ్యాన్ని, మన దేశ జీవావరణం పట్ల ప్రదర్శిస్తున్న అశ్రద్ధలను తేటతెల్లం చేస్తుంది. మన ముఖ్య ఆహార పంటలు వరి, మొక్కజొన్న, గోధుమలతో పాటు పత్తి మీద కూడా పరిశోధనలు జరపటానికి అనుమతులు ఇచ్చారు. ఆ పరీక్షలు బియ్యం ఎగుమతుల మీద చూపిన ప్రభావాన్ని మన ఆర్థిక స్వావలంబన మీద దాడిగా కూడా చూడవచ్చు. భారత్ ఇప్పటికే వ్యవసాయ ఎగుమతుల దేశం స్థాయి నుంచి దిగుమతుల దేశంగా పయనిస్తున్నది. మన దేశంలో పండే పప్పులను ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. జన్యు మార్పిడి పరీక్షల వల్ల మన ఆహార భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అవసరం లేని, అక్కరకు రాని, ఉపయోగపడని జన్యు మార్పిడి పంటలను చిట్ట చివరి అంకంలో అనుమతించడం ద్వారా యూపీఏ ప్రభుత్వం ఇంకొక స్కామ్‌కు తెరలేపింది. అనుమతులు ఇచ్చిన క్రమం, పద్ధతి శాస్త్రీయంగా కాకుండా, వ్యాపార లబ్ధికీ, ఎన్నికల నిధుల సేకరణకీ, వచ్చే ప్రభుత్వం మెడకు ఒక గుదిబండను తగిలించేందుకూ ఉద్దేశించినదిగా భావించవచ్చు. సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యం, పరిశోధనశాలలు ఉన్న ధనిక దేశాలనే భయపెడుతున్న జన్యు మార్పిడి క్షేత్ర పరీక్షలు, అవేవి లేని భారతదేశంలో, ఇష్టానుసారంగా, పార్లమెంటుకు తెలియకుండా చేయడం వెనుక లాభాపేక్ష స్పష్టంగా కనబడుతుంది. కంపెనీల బాగుకే ఇదంతా! బీటీ వంకాయ వద్దని దేశవ్యాప్తంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సంప్రదింపుల సమావేశాలలో పాల్గొన్న ప్రజలు, శాస్త్రవేత్తలు, రైతులు ముక్త కంఠంతో చెప్పారు. ఆ తరువాతే అప్పటి మంత్రి వీటి మీద మారటోరియం విధించారు. స్వతంత్ర శాస్త్రవేత్తలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, రైతులు జన్యు మార్పిడి పంటలు అవసరం లేదని అనేకసార్లు చెప్పారు. కానీ కొంత మంది అధికారులు, అతి కొద్దిమంది రాజకీయ నాయకులు, లాభాపేక్షతో, బహుళ జాతి కంపెనీ వ్యాపార ప్రయోజనాల కోసం, దేశ నియంత్రణ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, మన వ్యవసాయాన్ని, రైతుల భవిష్యత్తును పణంగా పెడుతూ, దేశ జీవావరణం నాశనానికి ఒడిగడుతున్నారు. (వ్యాసకర్త వ్యవసాయ విధాన విశ్లేషకులు) -
ఇది మోసం, దగాల ‘కలనేత’
దేశంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తితో పోటీ పడుతూ, దాదాపు 13 శాతం జాతీయ అవసరాలను తీరుస్తున్నది. ఇంత చేనేత ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కడాలేదు. చేనేత శ్రామిక కుటుంబాల నిబద్ధత, త్యాగం, నైపుణ్యం, చేనేతను ప్రేమించే వినియోగదారుల కొనుగోలు శక్తి ఈ పోటీని సాధ్యం చేస్తున్నాయి. ‘అంచు డాబే కానీ, పంచె డాబు లేదు’ అని సామెత. చేనేత మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సన్నాహాలను పరిశీ లిస్తే ఇదే అనిపిస్తుంది. పైపై మెరుగులు, ఆధునిక జౌళి రంగాన్ని సంతృప్తి పరచడం కోసం ఈ పనిని కేంద్రం దొడ్డితోవనైనా సాధించాలని చూస్తోం ది. ‘సాలెల మగ్గా’నికి కొత్త నిర్వచనం ఇచ్చే మహత్కార్యం నిర్వర్తించడానికి మే 2, 2013న కేంద్రం ఒక సంఘాన్ని నియమించింది. ఇందులో చేనేతరంగ ప్రతినిధులకు చోటివ్వలేదు. పవర్ లూమ్ రంగానికి చెందిన కొందరిని సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ అంతరంగం ఏమిటో ఈ చర్యే చెబుతోందని అసలు నేతన్నలు మథనపడుతున్నారు. సంఘం ఎందుకు? చేనేత ఉత్పత్తులలో కొన్నింటిని యాంత్రీకరణ చేసే అవకాశాలను పరిశీలించాలి. జౌళి రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా చేతి మగ్గం అంటే ఏమిటో పునర్ నిర్వచించాలి. చిన్న పవ ర్ లూమ్ ఉత్పత్తిదారులను వర్గీకరించి, చేనేత కుటుంబాలకు ఇచ్చే ప్రభుత్వ సాయం వారికి కూడా అందేవిధంగా సిఫారసులు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆధునీకరణ/ యాంత్రీకరణ ఎంతవరకు పూర్తయిందో అంచనాలు వేసి, చేనేత వస్త్రాన్ని కూడా ఆయా ప్రక్రియలకు అనుగుణంగా ఉత్పత్తి చేసేందుకు ఇతర ప్రాంతాలలో కూడా ఆ సిఫారసులను విస్తరించాలి. సంఘం ఉద్దేశాలన్నీ గతంలో ప్రభుత్వాలూ, న్యాయస్థానాలు చేనేత రంగానికి ఇచ్చిన రక్షణలూ, భరోసాలకు భంగం వాటిల్ల చేసేవిగానే ఉన్నాయని ఎవరికైనా అర్థమవుతుంది. చేనేత రంగం అభ్యర్థనలను ఈ ప్రభుత్వం ఏనాడూ వినిపిం చుకోలేదు. దానికి రుజువు ఆత్మహత్యలు. అయితే ఇప్పుడు చేనేత రంగం ప్రతినిధుల నుంచి ఎలాంటి అభ్యర్థన కూడా అందకుండానే ఒక సంఘాన్ని నియమించి మగ్గానికి మారుపేరు పెట్టే పనిని నెత్తికెత్తుకుంటున్నది. అసలు చేనేత రంగ ప్రతినిధులు లేకుండా మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడం ఎంత వరకు సబబు? ఒక్క పవ ర్ లూమ్ వల్ల పాతిక మంది చేనేత వృత్తిదారులు ఉపాధి కోల్పోతారని 1974లోనే శివరామన్ కమిటీ చెప్పిన సంగతి ప్రభుత్వానికి గుర్తు లేదా? విచ్ఛిన్నం చేయడానికే! చేనేత మగ్గాన్నీ ఆధునిక యంత్రాల పక్కన పెట్టి చూడటం చేనేత రంగాన్ని నిర్వీర్యం చేయడానికే. మగ్గానికి కొత్త నిర్వచనం ఇవ్వడం వల్ల చిన్న పవర్ లూమ్ ఉత్పత్తిదారులు, చేనేత నుంచి పవ ర్ లూమ్ ఉత్పత్తులకు మారిన చేనేత వృత్తిదారులు లబ్ధిపొందుతారని ఒక మాట వినిపిస్తోంది. వాస్తవం ఏమిటంటే పవ ర్ లూమ్ రంగంలోని పెద్ద, అతి పెద్ద ఉత్పత్తిదారులే దీనితో మేలు పొందుతారు. గత పదిహేను ఏళ్లుగా వివిధ పథకాలు, ప్రత్యేకంగా టెక్నాలజీ అప్‌గ్రెడేషన్ ఫండ్ ద్వారా వారికి ధన సహాయం వెళ్లిందేకానీ, పైన చెప్పినట్టు మార్పు చెందిన కుటుంబాల వారికి కాదు. ఇది గమనించాలి. నిధుల లోటు, ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం, అవగాహన లేమి, వివక్ష, గాంధీగారు ఎంతో ప్రేమించిన ఈ రంగం మీద అసలు సానుభూతి లేకపోవడం చేనేతకు అసలు శాపం. అందుకే చేనేత రక్షణకు ఉద్దేశించిన చట్టాలు, ప్రభుత్వం రూపొందించిన విధానాలు కూడా నామ మాత్రంగానే మిగిలాయి. చేనేత రిజర్వేషన్ మాటేమిటి? చేనేత రంగం అత్యంత అవసరమైన వృత్తిగా, ఉపాధి రంగంగా గుర్తించిన గత ప్రభుత్వాలు 1985 తరువాత ఆ రంగం రక్షణకు కొన్ని చర్యలు రూపొందించాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు ప్రకారం 1950 నుంచే చేనేత రిజర్వేషన్ ప్రభుత్వ రికార్డులలో ఉంది. చేనేత ఉపాధిని కాపాడే ప్రయత్నంగా ఈ ‘రక్షణ’ కల్పించారు. ఉపాధి పట్ల నాడు, నేడు కూడా ప్రభుత్వాల ఆలోచనలు మారలేదు. కానీ చేనేత రంగం ఉపాధి పట్ల వివక్ష కనపడుతున్నది. ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తి పట్ల మమకారం కనపడుతున్నది. పెద్ద కంపెనీలకు పూలబాట వేయడానికి పోటీలు పడే రాజకీయ నాయకులకు, అధికారులకు దేశంలో కొదవలేదు. కానీ కోట్లాది కుటుంబాలు మన దేశ సంస్కృతిని కాపాడుతూ, తమ నైపుణ్యాన్ని పెంచు కుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకుండా జీవిస్తున్నవారికి అండగా నిల వటానికి ఎవరూ ముందుకు రాకపోవడం దురదృష్టకరం. నేతన్నల కడుపు కొడుతున్నారు దేశంలో చేనేత వస్త్రాల ఉత్పత్తి, ఆధునిక యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తితో పోటీ పడుతూ, దాదాపు 13 శాతం జాతీయ అవసరాలను తీరుస్తున్నది. ఇంత చేనేత ఉత్పత్తి ప్రపంచంలో ఎక్కడాలేదు. చేనేత శ్రామిక కుటుంబాల నిబద్ధత, త్యాగం, నైపుణ్యం, చేనేతను ప్రేమించే వినియోగదారుల కొను గోలు శక్తి ఈ పోటీని సాధ్యం చేస్తున్నాయి. కాని ఆధునిక ‘బకాసుర’ యంత్ర-ఆధార వస్త్ర ఉత్పత్తి ప్రభుత్వ సబ్సిడీల సహకారంతో, అధికారుల అవ్యాజ ప్రేమతో ‘నకిలి’ చేనేత వస్త్రాలను మార్కెట్లో ప్రవేశపెట్టి అనైతిక పోటీని సృష్టిస్తూ నేతన్నల ఉపాధిని దెబ్బతీస్తున్నారు. 1985లో నూతన జాతీయ ఔళి విధానం ప్రకటించారు. ఈ విధానం మొదటిసారిగా చేనేత- ఆధార జౌళిరంగ అభివృద్ధికి కాకుండా, అప్పటి వరకు ఉన్న విధానాలకు భిన్నంగా రూపొందించారు. దానికి ‘నూతన’ పదం జోడించారు. కాక పోతే, అప్పటి చేనేత రంగానికి రాజకీయ మద్దతు ఉన్నందువల్ల, ఓట్ల గురించి మాత్రమే చేనేత రక్షణకు కొన్ని చర్యలు ప్రకటించారు. అందులో ముఖ్యమైనది. చేనేత రిజర్వేషన్ చట్టం. ఈ చట్టం ద్వారా 22 రకాల చేనేత ఉత్పత్తులు పవర్ లూమ్ లేదా మిల్లులు, ఉత్పత్తి చేయకుండా, కేవలం చేతి మగ్గాల మీదనే ఉత్పత్తి చేయాలని నిర్దేశించారు. కానీ చట్టం ఉన్నా అం దులో చేనేత వస్త్రాన్ని కాపాడేందుకు సరైన చర్యలు లేవు. చట్టుబండలైన చట్టం చేనేత రిజర్వేషన్ చట్టానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు కాగా, సుప్రీం కోర్టు 1993లో కొట్టివేసింది. చట్టం సక్రమమేనని తేల్చింది. 1995లో మీరా సేథ్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చట్టం పరిధిలో రిజర్వేషన్ 11 రకాలకు కుదించారు. పదేళ్ల కాలంలోనే, చట్టం పూర్తిగా అమలు కాకముందే, దాని అనుభవాల విశ్లేషణ జరగకముందే, చేనేత రంగ ప్రతినిధులతో పూర్తిగా సంప్రదించకుండా, అధికారికంగా నీరుగార్చేశారు. అటువంటి ప్రయ త్నాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. 1995కి ముందు, ఆ తరువాత కూడా ఈ చట్టం అమలు తీరు పూర్తిగా లోపభూయిష్టంగానే ఉంది. ఈ చట్టం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు, దాదాపు 25 ఏళ్ల కాలంలో ఒక్క శిక్ష కూడా ఖరారైనట్లు సమాచారం లేదు. నిర్లక్ష్యానికి ఇది ఒక సూచిక. 11, 12వ పంచవర్ష ప్రణాళికలలో చేనేత రిజర్వేషన్ చట్టం ఎత్తివేసే ప్రతిపాదనలు చేశారు. ఎగుమతి మార్కెట్ల పేరిట ఈ రిజర్వేషన్‌కు స్వస్తి పలికే ప్రయత్నం చేశారు. ఇప్పుడు, చేనేత మగ్గం నిర్వచనం మార్చి, నామ మాత్రంగానే ఉన్న ఆ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసి, చేనేతరంగాన్ని తుడిచి పెట్టే ప్రయత్నాలు ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ‘చేనేత కార్మికులు వృధాగా శ్రమపడుతున్నారు. వారి శారీరక శ్రమను తగ్గించడానికి, చేనేత మగ్గానికి మార్పులు చేశాం. ఆయా మార్పులు, విద్యుత్‌తో నడిచే పరికరాల ఆధారంగా జరిగినవి కాబట్టి, రిజర్వేషన్ చట్టంలో ఆ విధమైన మార్పులు చేయాలి’ అనేది వారి ప్రతిపాదన. ఈ నిర్వచనాన్ని మార్చినందువల్ల పవర్ లూమ్ రంగం విస్తృతంగా లాభపడే అవకాశమే ఉంది. మానవ శ్రమ, చేతి నైపుణ్యం, సృజన, కళ ఇమిడి ఉన్న చేనేత రంగం కుంటుపడి, ఆ కుటుంబాలు వీధిన పడే అవకాశం ఎక్కువ. మభ్యపెడుతున్న ప్రభుత్వాలు చేనేతను కాపాడుతున్నామని మభ్యపెట్టి, పబ్బం గడుపుకోవడమే తప్ప కోట్లాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న ఈ రంగానికి సేవ చేద్దా మనే ఆలోచన పాలకులకు లేకపోవడం శోచనీయం. చేనేత వస్త్రం, చేనేత మగ్గం పునర్ నిర్వచన కార్యక్రమం విరమించుకున్నామని అధికారులు, మం త్రులు నోటి మాటగా చెబుతున్నారు. కానీ కాగితం రూపేణా ఇప్పటి వరకు చెప్పలేదు. కమిటీ ఉందో, రద్దయిందో కూడా తెలియలేదు. ఈ ప్రతి పాదనకు వ్యతిరేకంగా చేనేత శ్రామికులు, చేనేత వస్త్ర ప్రేమికులు, ఆ రంగం నుంచి ఉపాధిని కోరుకునే వారు భారత ఆర్థిక సార్వభౌమత్వాన్ని కోరుకునేవారు, పర్యావరణ ఉద్యమకారులు నడుం బిగించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలి. - డాక్టర్ డి.నరసింహారెడ్డి జాతీయ జౌళిరంగ నిపుణులు -
కర్షకుడి పేరు... కంపెనీల జోరు
సందర్భం: హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బేయర్‌కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరిహారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. ప్రపంచ వ్యవసాయ సదస్సు కు ఈసారి హైదరాబాద్ వేదిక కాబోతోంది. నవంబర్ 4-7 తేదీలలో జరిగే ఈ సదస్సు నిర్వ హణలో రాష్ర్ట ప్రభుత్వం కూడా భాగస్వామే. ఇంతకీ ఈ సదస్సు ఎవరి కోసం? ఇది మన రైతులకు ఉపయోగపడితే సంతోషమే. ఈ సదస్సులు ప్రపంచ వ్యవసాయ వేదిక ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు (గత పదేళ్లుగా) ఒకసారి జరుగుతున్నాయి. తొలి ఐదు అమెరికాలోనూ గత సదస్సు బెల్జియం (బ్రస్సెల్స్)లోను జరిగాయి. సదస్సులతో ప్రపంచ వ్యవసాయ అభివృద్ధికి దిశానిర్దేశనం చేయడం ఈ వేదిక ఉద్దేశం. పెరుగుతున్న ప్రపంచ జనాభాకు ఆహారం అందాలంటే అధిక ఉత్ప త్తితోనే సాధ్యమని ఇది స్పష్టం చేస్తున్నది. హరిత విప్లవా న్ని కొనసాగిస్తూ, వ్యవసాయాన్ని ఆధునీకరించాలని ఆశిం చే ప్రపంచ సంస్థలలో ఇది ఒకటి. ఇదే సూత్రాన్ని పాటించ మని ప్రైవేట్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం మీద ఒత్తి డి తెస్తున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచ నలు కలిగిన వ్యక్తులు, సంస్థల కలయికే ఈ సదస్సు.చిన్న రైతులు, మహిళా రైతుల ప్రయోజనాల కోసం అని పత్రాలలో రాసుకున్నా ఆచరణలో వాటికి ప్రాధాన్యం కన పడదు. సదస్సు నిర్వాహక సంఘంలో ఒక్క మహిళ కూడా లేదు. పేరు గొప్ప... ఊరు దిబ్బ... చిన్న రైతులు లేదా వారి ప్రతినిధులకు కూడా ప్రాతినిధ్యం లేదు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, వేసిన విత్తనాలు మొలకెత్తక, మొలక వచ్చినా కాయ రాక, వచ్చిన కాయకు సరైన మార్కెట్ ధర అందక రైతు ఇబ్బంది పడుతుంటే, ‘అధిక ఉత్పత్తి మా లక్ష్యం’ అనే నినాదంతో ఈ సదస్సు జరగబోతోంది. మరి సాగు సమ స్యలు ప్రస్తావించకుండా ఏం సాధిస్తారు? జన్యుమార్పిడి విత్తనాల వల్ల రైతుకు వచ్చే ప్రయోజ నం ఏమీ లేదని ఐదేళ్ల బిటీ పత్తి అనుభవంలో తేలింది. అలాంటి జన్యు మార్పిడి విత్తనాలను నెత్తికెత్తుకున్న డా॥కెన్నెత్ బేకర్ (చైర్మన్, ప్రపంచ వ్యవసాయ వేదిక) ఈ సదస్సును హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం పెద్ద వ్యూహమే. డా॥కెన్నెత్ యూరోప్, ఆఫ్రికా ఖండాలలో మోన్శాంటో కంపెనీ ప్రతినిధి. మన పార్లమెంటులో, సుప్రీంకోర్టులో జన్యుమార్పిడి విత్తనాలను అనుమతిం చడం గురించి తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో ఈ సదస్సు ఏర్పాటయింది. దేశంలో విత్త నాల ఉత్పత్తిలో 90 శాతం మన రాష్ట్రంలోనే జరుగుతుంది. విత్తన కంపెనీలు, వారికి వత్తాసు పలికే రాజకీయ నాయ కులు, అధికారులు కలిసిపోయి జన్యుమార్పిడి విత్తనాల అనుమతులకు మార్గం సుగమం చేయడానికే ఈ సదస్సును తలపెట్టారు. ఈ సదస్సుకు పెట్టుబడి పెట్టే వాళ్లలో మోన్శాంటో, బెయిర్ లాంటి పెద్ద కంపెనీలు ఉండటం గమనార్హం. మొదటి ఐదు సదస్సులు అమెరికాలోని మిస్సోరీలో జరిగాయి. వాటి చర్చనీయాంశాలు ఇవి: ఒకటి (20-22 మే, 2001) వ్యవసాయంలో కొత్త శకం: ప్రపంచానికి ఆహారం. రెండు: (8-20 మే, 2003) వ్యవసాయంలో కొత్త శకం: కలిసి భవిష్యత్తు నిర్మాణం, అడ్డంకుల తొల గింపు. మూడు: (6-18 మే, 2005) శాంతి, రక్షణ, వృద్ధికి మార్గం: స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యవసాయ - ఆహార వ్యవస్థలు. నాలుగు: (8-10 మే, 2007) వ్యవ సాయ పెట్టుబడుల ద్వారా సంపద సృష్టి. ఐదు:(18-20 మే, 2009) వ్యవసాయానికి సవాళ్లు. బెల్జియంలో (29 నవంబర్ - 1 డిసెంబర్, 2011) జరిగిన ఆరో సదస్సులో అంశం ‘పెరుగుతున్న ప్రపంచ జనాభా పోషణకి వ్యవ సాయంపై పునరాలోచన. రాష్ట్రంలో జరగబోయే ఏడో సద స్సులో ‘సుస్థిర భవిష్యత్తుకు వ్యవసాయ స్వరూపాన్ని మార్చడం: చిన్న రైతుల మీద దృష్టి’ అన్న అంశాన్ని తీసుకుంటున్నారు. ఆది నుంచీ వివాదాస్పదమే 1997లో ప్రారంభమైన ప్రపంచ వ్యవసాయ వేదిక వ్యవ సాయ విధానాల మీద చర్చలను నిర్వహించే తటస్థ సంస్థ అని చెప్పుకుంటుంది. కానీ వ్యవహారంలో ఇదెక్కడా కన పడదు. వేదిక రైతుల కోసం ఏర్పాటయినది కూడా కాదు. ఇది ఏటా తమ మార్కెట్ వాటాలను పెంచుకుంటున్న బహుళజాతి కంపెనీల వ్యాపార వేదిక. ప్రపంచ వ్యవ సాయాన్ని వారి వ్యాపారాలకు అనుగుణంగా మార్చడమే ప్రధాన ధ్యేయంగా కనపడుతుంది. పెద్ద కమతాలలో ఆధునిక వనరులను పెద్ద ఎత్తున ఉపయోగించి చేసే సేద్యం గురించిన వ్యూహాలే కనిపిస్తాయి. జన్యుమార్పిడి పంటల పరిశోధన, ఉత్పత్తి, అను మతులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఉన్న వ్యాజ్యం కీలక దశకు చేరింది. కోర్టు నియమించిన టెన్నికల్ కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక జీవరక్షణ, భద్రత చర్యలు లేకుండా జన్యుమార్పిడి విత్తనాల క్షేత్ర పరీక్షలు నిర్వహిం చరాదని చెబుతున్నది. తీర్పు ఇంకా రావాల్సి ఉంది. అటు పార్లమెంటులో బీఆర్‌ఏఐ బిల్లు ప్రవేశపెట్టారు. దీనికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అనేక అభిప్రాయాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇది పార్లమెంటరీ స్థాయీ సం ఘం ముందుంది. ఈ సంఘం ఇప్పటికే జన్యుమార్పిడి పంటల అవసరం మన సేద్యానికి లేదని నివేదించింది. కేంద్ర వ్యవసాయ, పర్యావరణ మంత్రిత్వశాఖల మధ్య ఈ పంటలకు అనుమతి ఇవ్వడం గురించి ఏకాభిప్రాయం లేదు. ఈ తరుణంలో సదస్సు ఏర్పాటు చేయడమంటే మన వ్యవసాయ విధానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికే. హైదరాబాద్ సదస్సులో ప్రధానోపన్యాసం బెయ ర్కంపెనీ ప్రతినిధి ఇవ్వబోతున్నాడు. ఈ కంపెనీతో మన రైతులు ఎందరో నష్టపోయారు. వారికి ఇప్పటికీ నష్ట పరి హారం రాలేదు. దీని ప్రతినిధి చిన్న రైతుల బాగు గురించి ప్రసంగించటం హాస్యాస్పదమే. తుపానులతో దెబ్బ తిన్న రైతాంగాన్ని చూడటానికి కూడా రాని కేంద్ర వ్యవసాయ మంత్రి ఈ సదస్సుకు రావాలని నిర్ణయించుకోవడం శోచ నీయం. 2011 సమావేశంలో జేమ్స్ బోల్గేర్, (చైర్మన్, అం తర్జాతీయ సలహా సంఘం) జన్యు మార్పిడి పంటల ఆవ శ్యకతను గుర్తు చేశారు. వ్యాట్ వెబ్సైట్ ప్రకారం వారి సహకారం అందించే సంస్థలలో ప్రపంచ బ్యాంకు, డబ్లు. కె.కెల్లోగ్ ఫౌండేషన్, మోన్శాంటో, టైసన్, డీఐ ఆయిల్స్, కార్పొరేట్ కౌన్సిల్ ఆన్ ఆఫ్రికా, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ద వరల్డ్ ఫుడ్ ప్రైస్ పార్టనర్షిప్ టు ఎండ్ హంగర్ ఇన్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా మోన్శాంటో కంపెనీకి అనుగుణంగా పని చేస్తున్నవే. మేలు చేయని ఆలోచనలు గత సమావేశాలలో వేటిలోనూ రైతులు పాల్గొన్న దాఖ లాలులేవు. బ్రస్సెల్స్ సమావేశాలలో ప్రసంగించిన వారి లో ఎవరూ రైతులుకాదు. సమావేశాల తీరు, భాష కూడా అంతర్జాతీయమే. ఎక్కువగా, రౌండ్ టేబుల్ సమావేశాలే. వారి చర్చనీయాంశాలు ఇవి. వ్యవసాయంపైన పునరాలోచన- సమస్యలు: (వ్యవ సాయ ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కడ నుంచి వస్తుం ది? ఇది నూతన ప్రపంచ ఒరవడికి దారితీస్తుందా? /రైతుల నుంచి సమాజం ఏమి ఆశిస్తుంది?/ వ్యవ సాయానికి ఆధునిక టెక్నాలజీ: సవాళ్లు./ప్రపంచ వాణిజ్య ఏర్పాటు ద్వారా ఆహార భద్రత. /గొలుసు కట్టు వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా నుంచి ఉప యోగాలు ఎలా రాబట్టాలి?) వ్యవసాయంపైన పునరాలోచన- సాధ్యమయ్యే పరి ష్కారాలు: (వ్యవసాయానికి ఒక నూతన దృష్టి: మార్కెట్ ఆధార పరిష్కారాలు./తక్కువ నుంచి ఎక్కువ: సమాజ వనరుల సుస్థిర ఉపయోగంలో మార్పులు. /వ్యవసాయంలో పెట్టుబడులకు సూత్రా లు. /వ్యవసాయంలో భవిష్యత్తు పెట్టుబడులకు ప్రోత్సాహం.) {పపంచ వ్యవసాయంపైన పునరాలోచన: భవిష్య త్తుకు అవసరమైన నిధులు, యాజమాన్యం (వ్యవ సాయ ఉత్పత్తుల మార్కెట్: నియంత్రణ అవస రమా?/వాణిజ్యం, ఆర్థిక అంశాలు.) ఈ శీర్షికలు, చర్చనీయాంశాలు సామాన్య రైతుకు కాదు, ఇది చూడగానే అర్థమవుతుంది. వ్యవసాయం మీద వ్యాపారం చేస్తున్న కంపెనీలకు ఉపయోగపడేవి మాత్రమే. ఒరిగేదేమీ లేదు... హైదరాబాద్ సదస్సులోను ఈ తరహా శీర్షిక లే ఉండబోతు న్నాయి. ఇందులో రాష్ట్రంలో పురుగు మందులు లేకుండా లక్షల ఎకరాలలో జరుగుతున్న వ్యవసాయం గురించి లేదు. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన పెట్టుబడుల ప్రస్తావన లేదు. వ్యవసాయం ద్వారా సాధ్యమయ్యే ఆహా ర భద్రత గురించీ లేదు. రైతులు ఇందులో పాల్గొనే అవకా శాలు తక్కువ. ప్రవేశ రుసుం రాష్ర్ట ప్రభుత్వం భరించినా, భాష ఒక సమస్య. అనువాదకులు ఉన్నా, సంబంధం లేని విషయాలు అర్థం చేసుకునే అవకాశం రైతులకు లేదు. ప్రపంచ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లో నిర్వహిం చినా మనకు నష్టమే తప్ప లాభం లేదు. మన వ్యవసాయ సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి. మన శాస్త్ర వేత్తలు, అధికారులు, రైతులు చర్చించుకోవాలి. ముఖ్యం గా రైతుల స్వాతంత్య్రాన్ని హరించే సదస్సులకు ప్రజా ధనం వినియోగపడరాదు. - డాక్టర్ డి.నరసింహారెడ్డి వ్యవసాయ విశ్లేషకులు